*నిశ్శబ్ద --డప్పు వాయిస్తూ*:--కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్యపర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764
రోజుకో నాజూకైన రూపం మార్చుకుంటూ
కంగారెత్తించే కపట నాటకధారి కరోనా వైరస్
పేద ధనిక తేడా లేని బతుకులన్నీ బెంబేలెత్తిస్తూ
యిప్పుడిప్పుడే హిట్టవుతున్న బ్లాక్ బస్టర్ ఫంగస్

ప్రమాద ఘంటికలు మోగిస్తూ
నిశ్శబ్ద చావు డప్పు వాయిస్తూ
దినదినం రెట్టింపు శక్తితో పంజా విసురుతోంది
నట్టింట్లో జనాల నుంచి తాను వీధుల్లో  ఊరేగుతుంది

ఆత్మీయులైనా అనుచర గణాలైనా                                                   
నాలుగు నయనాశ్రులు రాల్చలేని దైన్యం
తగలబడుతున్న శవాలగుట్ట సాక్షిగా
ఇప్పుడు కావాల్సింది మంటల నార్పే నేర్పు
కానరాని క్రిమి కట్టడి చేసే మంత్రాంగాలు
ఫ్రంట్ లైన్ వారియర్ల అనుపమాన త్యాగాలు!

ప్రతీ ప్రాణం వెలకట్టలేని బహుమానం
కోసూపిరితో కొట్టుమిట్టాడుతూ..
ప్రాణవాయువు కోసం పడిగాపులు
పొంచి వున్న ముప్పు పసిగట్టే ఆలోచనేది?
ఓ చావు చూసి గుణపాఠం నేర్చే నైపుణ్య మేది?
                                 
బతికి బలుసాకు తినొచ్చు 
ముక్కు మూతికి బట్టకడితే
స్వీయ నియంత్రణ ఓ మంత్రదండం 
భౌతికదూరం అడ్డుకట్ట వేసే తంత్ర విద్య
అజాగ్రత్తే అపాయం నిర్లక్ష్యం ఒక నిప్పుకణిక
మనో దైర్యమే  కరోనాకి అమూల్యమైన ఔషధం



కామెంట్‌లు