కొత్త విజేత (కథ):-.గంగశ్రీ- 9676305949

  సిద్ధాపూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడడంతో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఇంటివద్ద టికెట్ తాయిళం కోసం ఆశావాహులు బెల్లం చుట్టూ ఈగల్లా గుమిగూడారు. కరోన సెకండ్ వేవ్ దేశాన్ని భయకంపితులను చేస్తుందన్న భయమే లేదు ఎవ్వరికి.
            నలభై వార్డులున్న పట్టణంలో ఆశావాహుల బలాబలాలు బేరీజు వేసుకుంటూ పాత వారికి బుజ్జగింపుల తీర్థం పోస్తూ, కొత్తవారికి టికెట్ ప్రసాదమిస్తున్నారు. తమను కాదని నామినేషన్ వేసిన వారిని నయానో భయానో లొంగదీసుకుంటున్నారు.
ఈసారి కూడా బల్దియా పీఠంపై తమ జెండానే ఎగరాలని పట్టుదలతో ఉన్న అధికార పార్టీ స్వతంత్ర అభ్యర్థులకు వెచ్చని తాయిలం ఇస్తూ మచ్చిక చేసుకుంటుంది.
             ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకోవడంతోపాటు స్వతంత్రులు కూడా వరదలా పోటెత్తడంతో, రాష్ట్రస్థాయి నాయకులంతా ఇక్కడే తిష్ట వేశారు. అప్పటి దాకా చాలా తక్కువ కేసులతో రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా ఉన్న సిద్ధాపూర్ ఒక్కసారిగా ఎన్నికల ప్రచార పులి పట్టణంపై విరుచుకుపడడంతో, అప్పటిదాకా పట్టణంలో తన ఉనికి కోసం తాపత్రయ పడుతున్న కరోన అనుకోకుండా వచ్చిన అవకాశంతో పద్మవ్యూహం లోని అభిమన్యుడిలా చెలరేగింది. ఎన్నికలకు ముందు రోజు రాత్రి  రకరకాల  మంతనాలతో  కరోనాకు  మరింత  చోటు దొరికింది.
           పోలింగ్ రోజున కూడా ఓటర్లు చీమల్లా బారులు తీరడంతో కరోనా మరింత కదం తొక్కింది. పట్టణంలో జరిగిన ఎన్నికల్లో ఈసారి మాత్రం కరోనానే అఖండ మెజారిటీ సాధించి విజేతగా నిలిచింది.

               ..