సుమధుర గాయకుడు-బాలు:-పిల్లి.హజరత్తయ్య--శింగరాయకొండ, ప్రకాశం జిల్లా

స్వరాభిషేకంలో స్వరాలను పలికించి
శ్రోతలను సరిగమలతో పలకరించి
ఎందరో మనఃపలకాలను కదిలించిన 
సుమధుర గాయకుడు మన బాలు

మారుమూల గ్రామాలలో సైతం
పాటలతో గుర్తింపు తెచ్చుకొని
పామరుల హృదయాలను కొల్లగొట్టిన
గాన గంధర్వుడు మన బాలు

నటుల హావభావాలను ఒలికించి
పాటలలో మాధుర్యాన్ని రంగరించి 
కళారంగంలో పద్మభూషణ్ గా మురిసిన 
సంగీత నారదుడు మన బాలు

సముద్రపు కెరటాల అలలను
ప్రవహించే సెలయేరు సవ్వడులను
తన పాటలతో ఓలలాడించగల
పాటల మాంత్రికుడు మన బాలు

పిల్లల ఆకలి మంటలను
పెద్దల అశ్రు ధారలను
తన గాత్రంతో కట్టిపడేయగల
సంగీత పుత్రుడు మన బాలు.

'పాడుతాతీయగా' 'పాడాలని ఉంది'లో
ఎందరో నూతన గాయకులకు
సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన
పండితపుత్రుడు మన బాలు

సహాయపాత్రలతో ప్రేక్షకులను మెప్పించి
కళాకారులకు గాత్రమును ఇచ్చి
కళారంగంలో ధ్రువతారగా ఎదిగిన
కళామతల్లి ముద్దుబిడ్డ మన బాలు