*శ్రేష్టుడే!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.నందివర్ధనం!
   తనవళ్ళంతా పూలకళ్ళు,
   చేసిన నేలతల్లికి,
   ఆనందవర్ధనంగా,
  నిత్యం ఆకళ్ళనే అర్పిస్తూ,
  అపరకన్నప్పలా నిలిచింది!
2.మామిడి!
  విత్తు నుండి వృక్షంగా,
  పెంచిన భూమాతకు,
  భారంగావంగి ఫలాలను,
  మధుర నైవేద్యమంటున్నది!
3.ఆ చిగుళ్ళు మేసిన కోయిల,
   చెట్టు మూలం వసుంధరకి,
   గళం ఎత్తి ఆనందంగా,
   స్వరరాజ నాదనీరాజనం!
4.నేలపై పారే సెలయేరు!
   ఆవిరియై,ఆపై మేఘమై,
   వర్షమై వచ్చి,
 చినుకులహస్తాలతో చుట్టేస్తూ,
 పుట్టింటికొచ్చి కన్నతల్లిని,
  వాటేసుకున్న తనయలా,
               పులకరిస్తుంది!
5.ఓ మొక్క!మాను!
                   పక్షి! ఏరు!
 అనాదిగా, ఎంచక్కా,
ఏ మార్పులేక బతికేస్తున్నాయి!
శ్రేష్టజీవి మనిషి!
భూమి వళ్ళంతా కుళ్ళపొడిచి,
ఆపై వ్యర్థాలవస్త్రాలు,
   అనంతంగా చుడుతున్నాడు!
 ఇది ఋణం తీర్చడమా!
    దారుణం ఒడి కట్టడమా!
భావిలో  భ్రష్టజీవుల్లో,
        *మనిషే శ్రేష్టుడు!*