లాక్ డౌనంటే విసుగెందుకు-- డా.. కందేపి రాణీప్రసాద్.
దేశ స్వాంతంత్ర్య పోరాటాల్లో
సాలిటరీ శిక్షలు పడి
కాళ్ళు చావుకోను స్థలం  లేక
జీవితకాలం జైళ్ళ లో మగ్గిన
వీరుల గాధలు చదివితే
లాక్ డౌనంటే విసుగు పుట్టదు!

సునామీ సమయంలో 
కుటుంబాన్నంతా కోల్పోయి
అనాధై మిగిలిన పసిగుడ్డు
సహాయక శిబిరాల్లో ఉన్న
దయనీయస్థితి గుర్తు తెచ్చుకుంటే
లాక్ డౌనంటే విసుగు పుట్టదు!

కార్గిల్ యుద్ధరంగంలో
శత్రుదేశానికి చిక్కిన
జవాన్లు చిత్రహింసలకు గురై
మరణించిన తీరుతెన్నులు
మనసులో జ్ఞప్తికి తెచ్చుకుంటే
లాక్ డౌనంటే విసుగు పుట్టదు!

పెను తుఫాన్లలో
పడిపోయే ఇంట్లో ఉండలేక
బయటకు వెళ్ళలేక
పడే బతుకు భయాన్ని
సందిగ్దతను తలుచుకుంటే
లాక్ డౌనంటే విసుగుపుట్టదు!

ఉధృతమైన వరదల్లో
ఊరంతా కొట్టుకుపోగా
చెట్టు కొమ్మ మీద కూర్చుని
ఆకలికేడ్వాల ప్రాణానికేడ్వాల అని
కొట్టుమిట్టాడే స్థితి తెలుసుకుంటే
లాక్ డౌనంటే విసుగు పుట్టదు!