పనికొచ్చే పనిముట్టు ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక ఇంట్లో ఓ కుండ ఉండేది. ఒకరోజు అది విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో  కుండ ప్రక్కన ఉన్న  గ్లాస్  కుండతో ముచ్చట్లకు దిగింది. ఆమాట ఈ మాటా చాలా సేపు చెప్పుకున్నాయి. మాటల మధ్యలో కుండను  ఇలా అడిగింది గ్లాసు.  "మిత్రమా! నీవు ఎల్లప్పుడూ చల్లగా ఉంటావు. మండు ఎండల్లో మానవుడి గొంతును చల్లగా తడిపి సేద తీరుస్తావు. అలా ఎందుకు వుంటున్నావు?"  కుండ చిన్నగా నవ్వి ఇలా చెప్పింది. "గ్లాసు మిత్రమా! నేను మట్టి నుండి వచ్చాను. నా ఆయుష్షు క్షణికం.  ఏక్షణంలోనైన పగిలిపోవొచ్చు. అప్పుడు మళ్లీ మట్టిలో కలిసిపోతాను. పనికొచ్చే పనిముట్టుగా మారిన ఈ నాలుగు రోజులైనా  అందరికి  ఉపయోగపడాలి కదా?  అందుకే నేను చల్లగా ఉంటూ అందరికి హాయిగా చల్లటి మంచినీరు అందిస్తూ ఉంటాను" అన్నది.  ఆ మాటలకు గ్లాసు  ముచ్చటపడింది.  బాలలూ! మనం కూడా మట్టి నుండే వచ్చాము. మళ్ళి మట్టిలోనే కలుస్తాము. జన్మలన్నింటిలో ఉత్తమ మైన   జన్మ ఈ మానవ జన్మ.  ఈ జన్మను సార్ధకం చేసుకోవాలి.  బ్రతికిన ఈ కొద్ది కాలంలోనే పనికొచ్చే పనిముట్టుగా మారి ఉపయోగకరమైన మంచి పనులు చేయాలి.