నందమూరి అందగాడు (ఇష్టపదులు):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
అందమా యద్భుతము అభినయము మోహనము 
నందమూరి వంశము నటనకే మందిరము 

రాజు పేద తానే రమణీయ నటనలో 
రామకృష్ణుల వలెను రాణిoచి నాడుగద 

దరహాస వదనమ్ము దర్శకుల విజయమ్ము 
ఘనదర్శకులచెంత ఘనమైన కథలెన్నో 

జస్టిస్ చౌదరి తాను జగదేక వీరునిగ
తోటరాముడి నటన తులలేని స్వచ్ఛత 

లవకుశల ఘనవిజయ లాలిత్య రాముడే 
ప్రేగులను మీటినా ప్రియభక్తి   రావణుడు 

మిస్సమ్మ సినిమాను మెచ్చితిరి జనమెల్ల 
అతి సహజ నటనలో ఆయనకు పేరుంది 

సాంఘిక జానపద సరసంపు నటరాజు 
ఆత్మ గౌరవమంటు ఆంధ్రుల మేల్కొలిపి 

తెలుగుదేశం పేర తేజమందిన పార్టి 
అధ్యక్షుడైనాడు ఆయనే సకలమై 

వీర బ్రహ్మేంద్రుడయి వినుతికెక్కిన గాథ 
పుట్టవలె నికముందు పూజ్య ఎన్టీయారు !