లేఖలు -మొగ్గలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
దూరంగా ఉన్న ఆత్మీయుల పలకరింపుతోనే 
అభిమానంతో వ్రాసే మధురమైన లేఖలు!
వ్రాసినవాళ్ళకు అందుకున్న వారికీ ఆనందమే!

మనోభావాలు కాగితంపై లేఖలో  పేరుస్తూనే 
కలంలో పొంగే జ్ఞాపకాల నదులు!
హృదయం నుండి హృదయానికిచేరే అనుభూతి!

నవరస జీవితంలో నవ్యకాంతి లేఖగా 
పుట్టినిల్లు నుండి మెట్టినింటికి వారధి!
అక్షరం కురిసే ఆత్మీయవర్షంలో 
 తడిసిముద్దవుతూ!

చదువు కోసమే దూరంగా ఉంటూనే 
చక్కని సలహాలు జాగ్రత్తలూ కన్నవారిలేఖ!
మధ్యతరగతి సంయమనం మహా గొప్పది!

ప్రేమవెల్లడి చేసిన క్షణం నుండీ 
అటుఇటు నడిచే వలపు లేఖాయణo!
అపార్ధాలు తొలిగే ఉపాయం లేఖలు!

దైవానికి వ్రాసే అభ్యర్థన లేఖలో 
ప్రస్తుత గడ్డుపరిస్థితి తొలగించమనే మనిషి!
లెక్కలేనన్ని లేఖల ఇంద్రధనుస్సు ఉత్తరాలకమ్మీ!