తెలివి:-డి.కె.చదువులబాబు.3/528_2వై.యమ్…ఆర్…కాలనీ…ప్రొ ద్దుటూరు. Ysrకడప జిల్లా

 ఒక అడవిలో ఉరుము అనే కోతి ఉండేది. తాను చాలా తెలివైన దాన్నని ఉరుము అనుకునేది.
అడవి నుండి కొంత దూరంలో ఉన్న పల్లెకు వెళ్ళి కొబ్బరి చిప్పలు, టమోటాలు మొదలగు ఆహార పదార్థాలు తిని, మరికొన్ని రేపటి కోసం తెచ్చుకునేది. తాను మనుష్యుల కళ్ళు కప్పి ఎంత నేర్పుగా రకరకాల ఆహారం సంపాదించుకున్నదో కథలు కథలుగా చెప్పుకునేది. తన తెలివి గురించి గొప్పలు చెప్పుకొనేది. కానీ ఏ జంతువులూదాన్ని తెలివైనదని అనేవి కావు.
 ఆ అడవిలో మెరుపు అనే కోతి ఉండేది. జంతువులన్నీ మెరుపును చాలా తెలివైనది అనేవి.మెరుపు గొప్ప ఏందో, దాన్ని తెలివైనదని ఎందుకంటారో తెలుసుకోవాలనుకుంది ఉరుము.
ఒక రోజు ఉరుము, మెరుపు దగ్గరకెళ్ళి -"నిన్ను అందరూ తెలివైన దానివంటున్నారు. నీ తెలివేందో చూడాలనుంది. రెండు రోజులు నీ వెంట వస్తాను"అంది ఉరుము.
"దానిదేం భాగ్యం, నా వెంట తిరుగుతానంటే ఎందుకు వద్దంటాను ?నాతో తిరగటం నీకు ఉపయోగపడితే అంతకంటే కావలసిందేముందీ "అంది మెరుపు.
అంతలో నాలుగు కోతులు అటుగా వచ్చాయి.మెరుపు వాటిని పిలిచి చెట్టు తొర్రలో తాను దాచుకున్న కొన్ని పండ్లు తెచ్చి ఇచ్చింది. అవి సంతోషంగా వెళ్ళిపోయాయి.
ఎందుకలా ఇచ్చావని అడిగింది ఉరుము.
"వాటిలో రెండు ముసలివి,మరో రెండు కాళ్ళు దెబ్బ తిన్నకోతులు. అవి ఆహారం సంపాదించు కోవటానికి చాలా కష్టపడాలి.అందుకే నా వద్ద అదనంగా ఉన్ప పండ్లు ఇచ్చాను. వాటిని నిల్వ ఉంచుకుంటే ఎవరికీ ఉపయోగపడకుండా మురిగిపోయే ప్రమాదం కూడా ఉంది"అంది మెరుపు.
ఉరుము,మెరుపు వెళ్తూంటే ఒ క నెమలి, దాని రెండు పిల్లలు కనిపించాయి. నెమలి మెరుపు కోతిని ఆపి, "నేను వేటాడి ఒక పామును చంపాను. దాన్ని తినమని రెండు పిల్లలకూ సమంగా పంచాను. కానీ దేనికది పూర్తి పాము తనకే కావాలంటున్నాయి. ఏం చేయాలి?"అంది.
"ఆహారాన్ని సంపాదించింది నువ్వు కాబట్టి ఈ పామును నీవు తిను. వాటి ఆహారం అవి సంపాదించుకుంటాయి.'అంది మెరుపు
ఆ కోతి తెలివి మీదున్న నమ్మకంతో 'సరే' అంది నెమలి.
ఆహారం తమకు లేకుండా తల్లి తినేస్తుందని భయపడి పిల్లలు వెంటనే మంకు వీడి
మూడు భాగాలు చేసి తల్లితో పంచుకుని తినటానికి ముందుకొచ్చాయి.
మెరుపు నెమలి పిల్లలతో  "మీ అమ్మ తాను తినకుండా మీ కోసం తెచ్చింది. నేను చెప్పినా మీరు తినకుండా తాను తినదు. తల్లి ప్రేమ అలాంటిది. మనం పెద్దలమాట వినాలి.పంచుకుని తినడం నేర్చుకోవాలి"అంది.వాటికి జ్ఞానోదయమయింది.
ఉరుము,మెరుపు పోతూంటే ఒక కోతుల గుంపు ఆయాసపడుతూ,పరుగులు పెడుతూ ఎదురుగా వచ్చింది. ఒక కోతి చేతిలో బంగారు కంకణం ఉంది. ఆ కోతి అయాసపడుతూ" మెరుపన్నా! నాకు ఒక బంగారు కంకణం దొరికింది. ఒక వేటగాడు నా వెంట పడ్డాడు. మన వాళ్ళ గుంపులో కెళ్ళి పడ్డాను. బాణాలతో అందరినీ వెంట పడ్డాడు"అంది భయపడిపోతూ.
అంతలో వేటగాడు అక్కడికి చేరుకున్నాడు. బాణం గురిపెట్టాడు."కంకణాన్ని విసిరేయ్" అందిమెరుపు.
వెంటనే ఆ కోతి తన చేతిలోని కంకణాన్ని విసిరేసింది.వెంటనే వేటగాడు కంకణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తెలివిగా తమను కాపాడిన మెరుపుకు కోతులు ధన్యవాదాలు చెప్పాయి.
మెరుపు,ఉరుము వెళ్తూంటే కొన్ని పావురాలు ఎదురయ్యాయి. అవి మెరుపును ఆపాయి.
"మెరుపన్నా!ఓ వేటగాడు ఈ చెట్టు కింద గింజలు చల్లాడు. వాటి పైన వల పరిచి వెళ్ళి పోయాడు. గింజల కోసం వల మీద వాలితే చిక్కుకు పోతాము. వలలో చిక్కకుండా గింజలు తినడం ఎలా?"అని అడిగాయి.
"ఎవరూ రెండు రోజులు వల మీద వాలకుండా ఉంటే విసుగొచ్చి వేటగాడు వలను తీసుకుని మరోచోటికి వెళ్ళిపోతాడు. అప్పుడు గింజలు తినండి"అంది మెరుపుకోతి. ఆ సలహాకు పావురాలు సంతోషించాయి.
"మెరుపన్నా!నీ తెలివి అమోఘం. ఓ మూడు ప్రశ్నలడుగుతాను. సమాధానాలు చెప్పు"అంది ఉరుము.అడగమంది మెరుపు.
"ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్పవాళ్ళెవరు?"
"తల్లిదండ్రులను గౌరవంగా,ప్రేమగా చూసుకునే వాళ్ళు. ఉన్నంతలో ఇతరులకు సాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు "చెప్పింది మెరుపు.
"అందరి కంటే మూర్కులు ఎవరు?" అడిగింది ఉరుము.
"నాకు అన్నీ తెలుసు. అన్నీ వచ్చు. నన్ను మించిన వాళ్ళు లేరనుకునే వాళ్ళు మూర్కులు" అంది మెరుపు.
"తెలివైన వారిగా పదిమందితో అనిపించుకోవాలంటే ఏంచేయాలి?" అడిగింది ఉరుము.
"మన తెలివి మన అభివృద్ది కోసమే కాక ఇతరుల కోసం ఉపయోగపడితే మనల్ని తెలివైన వారిగా గుర్తిస్తారు."అంది మెరుపు.
"నువ్వు తెలివైన దానివని పదిమందీ ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థమయింది.మనకు తెలివితేటలుంటే నరిపోవు.మన తెలివి మనకే కాకుండా పదిమందికీ ఉపయోగపడాలని తెలుసుకున్నాను"అని నమస్కరించి వెళ్ళిపోయింది ఉరుము.
                

కామెంట్‌లు