బతుకు పుస్తకంలో
ఓ అపారమైన అనుభవ సారం
ఆ రూపం అనంత ఆత్మవిశ్వాసం
తప్పులు సరిదిద్దే మండే అగ్నిగోళం
నిత్య సత్యాలు బోధించే ఆత్మ బంధువు!
సంసార సంద్రాన ఎగిసిపడే
సుఖ దుఃఖాలలు దాటుకుంటూ
దరి చేర్చే చక్కని చుక్కాని నాన్న
రెక్కలు ముక్కలు చేసుకొని
నెత్తురు చెమటగ మార్చే శ్రమయోగి
అమ్మ కడుపున ఆశయాల విత్తులు చల్లి
ఆశల సిరుల పంట పండించి
ఆకాంక్షాకలి తీర్చే త్యాగధనుడు!
వెన్నుతట్టి లేపి వేలుపట్టి
నడిపించే కరుణామూర్తి
తప్పటడుగులు తప్పించి
మంచి నడత నెర్పే శిక్షకుడు
దినదినం బిడ్డల ప్రగతికి చేదోడై
అహరహం కనురెప్పలా రక్షకుడు
విశ్వ కుటుంబానికి వెన్నెల పంచే జాబిలి
బాధ్యతకు భరోసా క్రమశిక్షణకు ప్రతీక
అమ్మ అదృశ్యమైనా.....!
అన్నీ తానై నిలిచే ఆదర్శ మహర్షి!
కరుగుతూ వెలుగు పంచే కొవ్వత్తి
మాయా మర్మం తెలియని
మకుటం లేని మహా రాజయ్యా!
కాలంతో పాటు తరాలు
అంతరాలు మారుతున్న వైనం
రెక్కలొచ్చి రివ్వున ఎగిరే పుత్రరత్నాలు
అనురాగ మేఘానికై చకోర పక్షిలా
ఎదురు చూసే సత్య శోధకుడు
వణికే అమృత హస్తాలకు
చేయూత నిచ్చి చేరదీద్ధాం!
రండి! కనిపించే దైవం పాదాలు
పవిత్ర గంగాజలంతో అభిషేకిద్దాం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి