నిజమైన జ్యోతిష్యం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్: 9908554535.

    సిరిపురం గ్రామాధికారి ధర్మయ్యకు జ్యోతిష్యం అంటే చాలా నమ్మకం . అతడు ప్రసిద్ధులైన ఇద్దరు జ్యోతిష్యులను పిలిపించాడు. ఎవరి జ్యోతిష్యం నిజమవుతుందో !కాదో! అని అతడు వారికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ ఇద్దరు పండితుల పేర్లు  రుద్ర భట్టు, విష్ణు భట్టు.
       ముందుగా రుద్ర భట్టును" ఈరోజు వర్షం పడుతుందా" అని గ్రామాధికారి ప్రశ్నించాడు ?రుద్ర భట్టు ఇంటిలోపలే కూర్చొని వేళ్ళు పెట్టి గుణింప సాగాడు ."అయ్యా !ఈరోజు వర్షం పడే పరిస్థితులు లేవు" అని అన్నాడు రుద్రభట్టు.
       అప్పుడు ధర్మయ్య విష్ణుభట్టును చెప్పమన్నాడు.విష్ణుభట్టు ఇంటి బయటకు వచ్చి వేళ్లతో గుణించాడు. బయట ఒక గాడిదను  చూశాడు .అది వింత చేష్టలు చేస్తున్నది . వెంటనే లోపలికి వచ్చి "అయ్యా!  ఒక గంటలో ఇచ్చట వర్షం రాబోతున్నది "అని అన్నాడు .ఈ మాటలు విన్న రుద్రభట్టు "ఇంత ఎండ కాస్తున్నది.వర్షం పడనే పడదు" అని అన్నాడు ."మీరే చూడండి  పండిత వరేణ్యా "అని అన్నాడు విష్ణు భట్టు .
       .సరిగ్గా గంట గడిచేసరికి గడిచేసరికి భళ్ళున వాన కురిసింది. ధర్మయ్య విష్ణుభట్టును అభినందించాడు. వర్షం వెలిసిన తర్వాత బయటకు వచ్చిన రుద్ర భట్టు విష్ణు భట్టును పిలిచి "మీరు వర్షం పడుతుంది అని ముందే ఎలా ఊహించారు "అని అన్నాడు. 
        అప్పుడు విష్ణుభట్టు నవ్వి " నేను కూడా మీ వలెనే గుణించాను.వర్షం ఈరోజు తప్పక పడుతుందని తెలిసింది.తర్వాత బయట ఒక గాడిదను ,దాని చేష్టలను  గమనించాను.నా లెక్కలకు బలం చేకూరింది. అందువల్ల  వర్షం పడుతుందని చెప్పాను. అదే నిజమైంది. జ్యోతిష్కుడు బయట పరిస్థితులు కూడా గమనించాలి .  సరిగా గుణించాలి.లెక్కలు తప్పుగా గుణించడం వలన  మనం చెప్పింది జరుగక   ఇబ్బందులు వస్తాయి. శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు.దాని గురించి సంపూర్ణ అవగాహన లేకపోవడం , తొందరపడి పొరపాట్లు చేయడం మనదే లోపం " అని అన్నాడు .ఆ మాటలు విన్న రుద్రభట్టు తిరిగి వేళ్లతో గుణించి తను తొందరపడి తప్పుగా గుణించడం వల్లనే ఈ  పొరపాటు జరిగిందని   విష్ణుభట్టును అభినందించాడు.