రవి చిన్నప్పటినుండి చదువు మీద సరిగా ధ్యాస పెట్టేవాడు కాదు.తల్లిదండ్రులు తిడతారు,కొడతారు అన్న భయంతోనే తప్ప శ్రద్ధ మీద చదివే వాడు కాదు.
ఒక రోజు రవి "నేను పదవ తరగతి పాసయితే ఏడుకొండలూ నడిచివచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను"అని వెంకటేశ్వరస్వామికి మ్రొక్కుకున్నాడు.అప్పటినుంచి అసలు చదవకుండా ఊరిమీద పడి జులాయిగా తిరుగుతున్నాడు.చదవకుండా తిరుగుతున్న కొడుకును చూసిన రంగయ్య "ఏమిరా! రవి చదవకుండా తిరుగుతున్నావు.ఇలా అయితే నీ చదువు చుట్టబండలయినట్లే" అని కోపంతో కేకలేశాడు."నీకు తెలియదు నాన్న నేను ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నాను.నేను చదవకపోయినా ఫరవాలేదు ఆ దేవుడే నన్ను పాస్ చేయిస్తాడు"అని రవి అన్నాడు.
వీడికి తిట్టి,కొట్టి లాభం లేదనుకొని ఒకరోజు రంగయ్య కొడుకును పొలం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.పొలంలోకి నీరు పారించాలని చెరువు గట్టు మీదకు ఇద్దరూ చేరుకున్నారు."పొలంలోకి నీరు పారించవా!దేవుడా!అలా నీరు పారిస్తే 101 కొబ్బరికాయలు కొట్టి మా నాన్న తలనీలాలు కూడా సమర్పించుకుంటాము" అని దేవుడికి మ్రొక్కు అని రవితో రంగయ్య అన్నాడు.రవి వాళ్ళ నాన్న చెప్పినట్లే మ్రొక్కాడు.
కానీ ఎంత సేపు ఎదురు చూసినా నీరు పారలేదు. అప్పుడు రంగయ్య పార తీసుకొని కాలువ త్రవ్వడం ప్రారంభించాడు.త్రవ్వుతూ వెళుతుంటే నీరు దానంతటదే ఉరుకులు పరుగులు పెడుతూ పొలంలోకి చేరింది.
కొడుకును పిలిచి "చూశావా దేవునికి మ్రొక్కుకున్నాము అని మనము కష్టపడకుండా కూర్చుంటే ఏ దేవుడూ మనలను కరుణించడు. మనము కష్టపడితే ఫలితం దానంతటదే మనలను వెదుక్కుంటూ వస్తుంది.దేవుడు కూడా కృషిని నమ్ముకున్న వారినే కరుణిస్తాడు"అని అన్నాడు.
అప్పటినుండి రవి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడై అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి