కవి చక్రవర్తి కణ్ణదాసన్: -- యామిజాల జగదీశ్

 రాయడం 
చదవడం తెలీనివారిలో 
యముడూ ఒకడు....
కవితల పుస్తకాన్ని
చించి పడేశాడు!!
- తమిళ కవిచక్రవర్తి కణ్ణదాసన్ గురించి
"కవి వాలి" చెప్పిన మాటలవి!
నేనెంతో ఇష్టపడి అభిమానించే తమిళ కవులలో కణ్ణదాసన్ ఒకరు. సుప్రసిద్ధ కవి,  రచయిత, వేల కవితలు, సినిమా పాటలూ రాసి తమిళుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన కవిచక్రవర్తి కణ్ణదాసన్ జూన్ 24 (1927) న జన్మించారు. తమిళనాడులోని శివగంగై జిల్లా సిరుకూడల్పట్టిలో పుట్టి పెరిగిన కణ్ణదాసన్ అసలు పేరు ముత్తయ్య. 
చిన్ననాటనే దత్తతు పోయిన కణ్ణదాసన్ ని ఆ ఇంట నారాయణా అని పిలిచేవారు.
సిరుకూడల్పట్టిలో ప్రాథమిక విద్య చదివిన కణ్ణదాసన్ అమరావతిపుదూర్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి దాకా చదువుకున్నారు. ఆ తర్వాత చదువుకోలేదు.
 
చిన్నతనంలోనే ఇంట్లో ఏదైనా తెల్ల కాగితం కనిపిస్తే ఏదో ఒకటి రాస్తుండేవారు.
"దుకాణానికి వెళ్ళాను....పావలా ఇచ్చాను...." అంటూ ఏవేవో సంఘటనలను రాస్తూ వచ్చిన కణ్ణదాసన్ మద్రాసు వళ్ళి తిరువత్తియూరులో ఓ సంస్థలో పని చేసుకుంటూ కథలూ రాసారు. గృహలక్ష్మి అనే పత్రికలో ఆయన రాసిన "నిలవొలియిలే"అనే కథ అచ్చయింది. అదే ఆయన రాసినతొలి కథ.
అనంతరం పుదుక్కోట్టైలో ఓ పత్రికలో చేరారు. అక్కడ కొంత కాలానికే సంపాదకుడిగా పదోన్నతి పొందిన కణ్ణదాసన్ తర్వాతి రోజులలో చండమారుతం, తిరుమగళ్, తిరై ఒళి‌, తెండ్రల్ తదితర పత్రికలలో సంపాదకులుగా పని చేశారు.
 
తమిళంలో రామాయణం రాసిన కంబర్, తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్యభారతియార్ రచనలను ఇష్టంతో చదివిన కణ్ణదాసన్ భారతిని తన మానసిక గురువుగా భావించి కణ్ణదాసన్ అనే పేరుతో కథలూ వ్యాసాలూ కవితలూ రాయస్తూ వచ్చారు. 
ఆయన కలం పేర్లు - కారై ముత్తు పులవర్, వనంగాముడి, గమక ప్రియ, పార్వతినాథన్, ఆరోగ్యసామి.
ఆ తర్వాత సేలం మోడర్న్ థియేటర్లో కథలూ సంభాషణలూ రాయడానికి ఉద్యోగిగా చేరారు. కన్నియిన్ కాదలి అనే సినిమాకు పాటలు రాశారు. 
పండితుడు కా. అప్పాదురై దగ్గర వ్యాకరణం నేర్చుకుని సాహిత్యంపై మక్కువ పెంచుకున్న కణ్ణదాసన్ 
శివాజీ కథానాయకుడిగా నటించిన భాగప్పిరివినై సినిమాలో పాటలు రాసిన తర్వాత కణ్ణదాసన్ పాటల రచయితగా స్థిరపడ్డారు. పాసమలర్, పావమన్నిప్పు, పడిక్కాద మేదై వంటి చిత్రాలలో ఆయన రాసిన పాటలకు విశేష ఆదరణ లభించింది. తమిళ సినీ చరిత్రలో రెండు దశాబ్దాలపాటు కొనసాగిన ఆయన అయిదు వేలకుపైగా పాటలు రాశారు. 
పరాశక్తి, రత్తత్తిలకం‌, కరుప్పు పణం, సూర్యకాంతి వంటి సినిమాలలో నటించిన ఆయన సొంతంగా సినిమాలు నిర్మించారు. కానీ అవి విజయవంతం కాలేదు.
రాజకీయాలలోనూ చురుకుగా ఉంటూ వచ్చిన ఆయనను తమిళనాడు ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది.
జీసస్ పై కావ్యం రాసిన కణ్ణదాసన్ నాటకాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు రాసారు. ఆయన రాసిన "అర్థమున్న హిందూమతం" లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. 
 
"వనవాసం" పేరిట తన స్వీయకథను రాసుకున్న కణ్ణదాసన్ "చేరమాన్ కాదలి" నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 
కుయందైక్కాగ చిత్రానికి రాసిన సంభాషణలకుగాను 1961 జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కణ్ణదాసన్ అనారోగ్యంతో 1981లో కాలధర్మం చెందారు. అప్పుడు ఆయన వయస్సు 54 ఏళ్ళు.
ఆయన స్మృత్యర్థం కారైక్కుడిలో ఓ మణిమండపం ఏర్పాటు చేశారు. చెన్నై టీ.నగర్లో ఆయన నివాసమున్న వీధికి కణ్ణదాసన్ అని పేరుపెట్టారు. 
 ఆయనను చూడటమే తప్ప ఎన్నడూ మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. ఆయన కుమారుడు గాంధీ కణ్ణదాసన్ "కణ్ణదాసన్ పదిప్పగం" (కణ్ణదాసన్ పబ్లికేషన్) నడుపుతూ వేల పుస్తకాలు ప్రచురించారు. ఈ సంస్థ నుంచి వెలువడిన ఓషో తమిళ పుస్తకం "ఒరు కోప్పయ్ తేనీర్" ( ఎ కప్ ఆఫ్ టీ) చదవడంతోనే గాంధీ కణ్ణదాసన్ ని కలిసి తెలుగులో అనువదించే అవకాశం ఇవ్వమని కోరాను. కానీ తెలుగు రాష్ట్రాలలో మార్కెటింగ్ తెలీదంటూనే రాయండి చూద్దాం అన్నారు. ఇంతలో నేను ఉద్యోగరీత్యా హైదరాబాదుకి బదిలీ అవడంతో ఆ పుస్తకానువాదం కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ పుస్తకం కొనుక్కుని ఓ వంద ఖండికలదాకా అనువదించాను.  

కామెంట్‌లు