ఎవరు వ్రాయ గలరూ: -సత్యవాణి
ఎవరు వ్రాయ గలరూ
మధ్య తరగతి వ్యధలను
కథలుగ మలచీ
ఎవరు రాయగలరూ

కౌపీనము పెద్దదగు
అంగవస్త్రము  చిన్నదగు
ఆశలేమొ బారలుగా
జీవనమ్ము జానెడుగా
ఆశల అంబుధినీదే
మధ్యతరగతి వ్యధలను
కథలుగ మలచీ

ఎవరు వ్రాయగలరూ
మధ్యతరగతి వ్యధలను
కథలుగ మలచీ
ఎవరు రాయగలరూ

ఆచారాలధిఘమించ
విచారించు వేదనపడు
ధైర్యమింత లేకుండగ
దైన్యంగా బ్రతుకునెడుతు
ఆశల నంబుధినీదే
మధ్య తరగతి వ్యధలను
కథలుగ మలచీ

ఎవరు వ్రాయగలరూ
మధ్యతరగతి వ్యథలను
కథలుగ మలచీ
ఎవరు రాయగలరూ

సుఖ పడగను ఆశపోదు
సౌఖ్య మెపుడు కానరాదు
విసిగిపోక వెనుదిరగక
పోరాటమె జీవనంగ
సుడిగుండంలో తిరిగే
మధ్యతరగతి వ్యధలను
కథలుగ మలచీ

ఎవరు రాయగలరూ
మధ్యతరగతి వ్యధలను
కథలుగ మలచీ
ఎవరు రాయగలరూ

వస్తున్నాయ్ ప్రభుత్వాలు
పోతున్నాయ్ వెనుదిరిగీ
మధ్య తరగతొకటుందని
మనసున తలవరు ఒకపరి
త్రిశంఖు స్వర్గపు ప్రజలవి
తీరని వ్యధలను 
కథలుగ మలచీ

ఎవరు రాయగలరూ
మధ్యతరగతి వ్యధలను
కథలుగ మలచీ
ఎవరు రాయగలరూ