ఊయల వచ్చింది ఇంటికి
బ్రహ్మం దానిని తెచ్చేడు
ఉయల అందంగా నగిషీలతో
మెరిసిపోతోంది
అమ్మ బ్రహ్మానికి
స్వయంపాకంతోపాటుగా
పంచలజత ఇప్పించింది
నాన్న అతడికి ఘనంగానే
బహుమానమిచ్చేడుకాబోలు
బ్రహ్మంమొఖం
బ్రహ్మాడంగా వెలిగిపోయింది
పట్టుపరుపు ఊయలలో చేరింది
పట్టుపరుపుపై
అమ్మమ్మ పట్టుచీరను
మెత్తగా హత్తివుండేలా పరిచారు
అటూ ఇటూ పట్టు బాలీసులూ చేరాయి
రంగు రంగుల చిలకల
పాలవెల్లినీ వేలాడదీసారు మద్యగా
ముడిచి తెరిచే ముద్దుగావున్న
తెల్లటి గొడుగునూ తెచ్చివుంచేరు
ఇదంతా నాకొసమే
నాకుకూడా కొత్తబట్టలు తొడిగారు
ముస్తాబు చేసి అమ్మ మెటికలు విరిచింది
నన్ను ఊయలలో వుంచి
ఊపడంకోసమే ఈ హడావిడంతా
ఊరిలోవున్న పేరంట్రాడ్లనూ
పిలిచేరు
కలకలలాడుతూ వున్నారందరు
కిలకిలా నవ్వుకొంటూ
గలగలా మాట్లాడుకొంటున్నారు సందడిగా
పాటలు పాడేరు కొందరు
అమ్మ నన్ను అపురుపంగా అలంకరిచిన ఊయలలో
వుంచబోయింది
తన మెత్తటి వెచ్చటి ఒడినుంచి తీసి
కళ్ళువిప్పి ఒళ్ళు విరుచుకొన్నానునేను
ఉంచింది అమ్మ ఊయలలో నన్ను
అమ్మమ్మ మెత్తటి పట్టుచీర చల్లగావుంది
ఏదీ ఊయలలో
అమ్మఒడి కమ్మదనం
ఏదీ ఊయలలో అమ్మఒడి వెచ్చదనం
గొంతు సవరించుకొన్నాను
బేర్ మనబోయి
కేర్ మన్నాను
అంతే అమ్మ ఒడిలోకి
వెచ్చగా చేరిపోయాను నేను
అలంకరించిన ఊయల
ఊగుతోంది కిర్రు కిర్రుమంటూ
ఉట్టినే ఊగుతున్న ఊయలను చూసి
పాలవెల్లికి కట్టిన చిలుకలు
ఫకాలున పగలబడి నవ్వుతూనే వున్నాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి