పాలు ఎలా వస్తాయి అంటే, పొద్దున్నే పాల ప్యాకెట్ గేటు సంచిలో ఉంటుంది అని పిల్లలు చెప్పే జవాబు గురించి, కొందరు కామెడీగా మాట్లాడుకోవడం మనలో చాలా మందికి తెలిసిన విషయం! విషాదకరమైన కామెడీ అది!
ఒక్క పాల విషయమే కాదు,మరెన్నో వంటింటి పదార్థాలు, ముప్పూటలా అందరం తినే అనేక రకాల ఆహార పదార్థాల గురించి, వాటి ఉత్పత్తి క్రమం గురించి, మన పిల్లలకు ఎటువంటి జ్ఞానం లేదు. ఉండే అవకాశం లేదు.
తల్లిదండ్రులను చూసి , సెల్ ఫోన్, ఇంటర్నెట్ ,యూట్యూబ్ వగైరా పరిజ్ఞానం మాత్రం విపరీతంగా పెరిగింది.
పిల్లలు ప్రకృతి నుండి దూరంగా పెంచబడుతున్నారు.ప్రాకృతిక సజీవ స్పందనలు తగ్గుతున్నాయి.పిల్లలు మెకానికల్ గా పెరుగుతున్నారు.పట్టించుకోవాల్సిన హ్యూమన్ రిలేషన్స్ ను కూడా పట్టించుకోవడం లేదు. మనం చెపితే కద,వాళ్లు నేర్చుకునేది? చదువులు ఉద్యోగాలు డబ్బు అనే మూడు విషయాల చుట్టూ తిరుగుతోంది ఆధునిక సమాజం!
అవి అవసరమే కానీ, మరెన్నో అత్యవసరం అని మరిచిపోతున్నాం! కుటుంబ సంబంధాల్లో ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి!
మన లైఫ్ స్టైల్ అలా ఉన్నప్పుడు,పిల్లల జ్ఞానం మరొకలాగా ఎందుకు ఉంటుంది?సమాజం పట్లనే కాదు, కన్న తల్లిదండ్రుల పట్ల కూడా స్పృహ లేని తరం ఒకటి తయారు అవుతోంది!
స్కూల్లలో నేర్పని విషయాలను, ఇళ్లల్లో ఎందుకు నేర్పకూడదు? పాల ప్యాకెట్ దగ్గర ఎడ్యుకేషన్ ప్రారంభించి,మనం ఒక కృతజ్ఞతా సంస్కారాన్ని,మానవీయ విలువలను కూడా నేర్పవచ్చు.
మీ సమీపంలో ఉన్న ఓ డైరీ ఫామ్ కు ,పిల్లలను తీసుకువెళ్ళి గేదెలను ఆవులను చూపించాలి.మీరు నిత్యం తాగే పాలు ఈ మహాతల్లుల నుండే వస్తున్నాయి అని వివరించాలి! వాటి బిడ్డలకు కూడా దక్కకుండా వాటి పాలను పిండి మనకు పోస్తున్నారని కూడా చెప్పాలి.డైరీ నిర్వహణలో ఉన్న అమానవీయతలను పిల్లల దృష్టికి తేవాలి.
గేదెలకు ఆవులకు పిల్లలు పుట్టగానే, ఆ పిల్లలను అమ్మేస్తున్నారు.ఆ తల్లిబిడ్డల అరుపులు ఏడ్పులు పిల్లల హృదయాన్ని తాకాలి.పాలు వట్టిపోయిన పశువులను మరెవరో కొని,మళ్ళీ ఈనేదాకా బాగా చూసి, ఈనిన తరువాత మరెవరికో అమ్మేస్తారు.ఆ కొన్నవారు,ఆ దూడను నిర్దాక్షిణ్యంగా మరెవరికో అమ్మేస్తారు.ఆ కొన్న వారు ,వాటిని పెంచి ,ఈనేదాకా చూసి, మరెవరికో అమ్మేస్తారు. చిట్టచివరికి పశువులను కబేలాలకు అమ్మేస్తారు. అంటే, వాటి గొంతులు కోసి చంపి మాంసం అమ్ముకుంటారు.అదీ మనమే తింటాం.ఇదీ ,మన డైరీ ఫాం ల కథ,వ్యథా భరిత,దుఃఖ భరిత గాథ,దయనీయ,కరుణ రహిత గాథ- అటువంటి బ్యాంక్ గ్రౌండ్ ఉంది మన పాల ప్యాకెట్ వెనక ,మనం తాగే పాల వెనుక,మనింట్లోకి వచ్చిపడే పాల ప్యాకెట్ వెనుక అని పిల్లలకు అర్థం చేయించాలి- చూపించాలి!
అంతే కాదు, వెళ్లేటప్పుడు పశువులు ఇష్టంగా తినే -తౌడు చిట్టు పచ్చిగడ్డి వేరుశనగ చెక్క,అరటిపండ్లు వగైరా తీసుకుని వెళ్ళి ,అక్కడ ఉన్న అన్ని పశుమహాతల్లుల మూతులకు మీ పిల్లల చేతులతో తినిపించండి- పిల్లల చేతులు జోడింప చేసి ,కన్న తల్లల కంటే మిన్న అయిన వాటికి నమస్కరించమని చెప్పండి.
అంతిమంగా, పాలు మనకు అవసరం లేదు అని కూడా అర్థం చేయించండి.అలా అయినా క్రమంగా పశుహింస తగ్గుతుంది. మనలో కొంత మానవత్వం పెరుగుతుంది!
స్కూల్లో నేర్పనిది,ఇళ్లల్లో నేర్పాలి!
పిల్లలను విద్యావంతుల్ని చెయ్యడం ఎంత ముఖ్యమో, వారిని మానవులుగా చెయ్యడం అంతకంటే ముఖ్యం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి