*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౭ - 57)

 మత్తేభము:
*శ్రుతులభ్యాసముచేసి, శాస్త్రగరిమ | ల్శోధించి తత్వంబులన్*
*మతినూహించి, శరీరమస్థిరము, బ్ర| హ్మంబన్న సత్యంబు గాం*
*చితిమంచున్ సభలనే వృధావచనము | ల్చెప్పంగనేకాని, ని*
*ర్జిత చిత్త స్థిర సౌఖ్యముల్ తెలియరో | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.
చదువులు అన్నీ చదివేశాము, మాకు తెలియనిది ఇంక ఏమీ లేదు, బ్రహ్మ పదార్ధాన్ని అర్థం చేసుకున్నాము అని సభలలోనూ, వేదికల మీదనూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వారు అందరూ, మనస్సును జయించిన వారూ కాదు, స్థిరముగా ఒకచోట వుంచుకున్నవారూ కాదు........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*వేదోపనిషత్తులు, పంచవేదాలూ చదివేశాము అని చెప్పే పండితోత్తములు అందరూ కూడా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోలేక పోయారు. ఏకొందరో తప్ప. ఆ తెలుసుకున్న వారు కూడా, నీ పద్మపాదలు పట్టుకోవడం వల్లనే తెలుసుకో గలిగారు.  అసలు బ్రహ్మమే నీవు అయినప్పుడు, నీ దయ, కరుణ లేకుండా నిన్ను తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది, నీలకంఠా! "అంతయు నీవే హరి పుడరీకాక్ష!" ఇదే నిజము! సత్యము! సుందరము! కదా సుందరేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు