మానవ వనరుల వినియోగం ఏది?:-యమ్.రామ్ ప్రదీప్--తిరువూరు,9492712836

 చరిత్రకి నిర్మాత మనిషే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మనిషి
అనేక ఆవిష్కరణలు చేసాడు.ఈనాడు మనం పొందుతున్న సౌకర్యాలన్ని శాస్త్రవేత్తల కృషి  ఫలితంగా వచ్చినవే.అయితే మనిషి స్వార్ధం వల్ల కొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి.వీటిల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.సైన్స్ అభివృద్ధి చెందిన క్రమంలో మనిషి సగటు ఆయుష్షు పెరిగింది. కాలంతో పాటు క్రమంగా జనాభా కూడా పెరుగుతుంది.
రోజు రోజుకు పెరుగిపోతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఏటా జులై 11 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలుపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 1989లో దీనిని ప్రారంభించింది. 1987 జులై 11 నాటికి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకోవడంతో ఆరోజునే ప్రపంచ జనాభా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా జూలై 11 న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
జనాభాలో చైనా, భారత్,అమెరికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.త్వరలో జనాభా పెరుగుదలలో చైనాని భారత్,అమెరికాని నైజీరియా అధిగమిస్తాయని ఐక్య రాజ్య సమితి వెల్లడించింది.చైనా జనాభా పెరుగుదలని ఒక సానుకూల అంశంగా మార్చుకుంది.ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా అమెరికాని అధిగమించి ముందుకు వెళుతుంది.కరోనాని సమర్ధ వంతంగా నియంత్రణ చేసిన దేశాల్లో చైనా ఒకటిగా పేరు పేరు పొందింది.
జనాభా పెరుగుదల ఆఫ్రికా దేశాలకి పెను శాపంగా మారుతుంది.పలు ఆఫ్రికా దేశాలలో పిల్లలకి కనీసం పౌష్టికాహారం లభించడం లేదు.ఫలితంగా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.అందరికీ ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది.
మనదేశంలో ప్రతి పది ఏళ్ళ ఒకసారి జనాభా లెక్కలు చేపడతారు. కరోనా కారణంగా
2021 లో చేయాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం భారత దేశంలో ప్రస్తుతం జనాభా సుమారు 140 కోట్లు ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 17.7 శాతంగా ఉంటుంది. జనాభా పెరుగుదల
వల్ల,పేదరికం, నిరుద్యోగం, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విద్య,వైద్యం పేదవారికి సక్రమంగా అందవు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కొనుక్కునే స్థితిలో పేద దేశాలు లేవు.ఫలితంగా కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. ధనిక దేశాలు పేద దేశాలకి సహాయం చేయడం లేదు.
యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమౌతున్నారు.దీని వల్ల మానవ వనరులు సక్రమంగా వినియోగం అవడం లేదు.
జపాన్,ఇటలీ,ఇరాన్ వంటి దేశాలు తమ దేశాల్లో జనాభా తగ్గి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూ ఎన్ డి పి 2020 లో
ప్రకటించిన ర్యాంకులో మన దేశం 131 వ స్థానం పొందింది. ఈ సంస్థ 189 దేశాలని పరిగణనలోకి తీసుకుని తన నివేదికను వెల్లడించింది. మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరగడం,నిరుద్యోగం, నిరక్షరాస్యత  వంటి సమస్యలు
ఉండటం వల్ల ఈ సంస్థ ఇచ్చిన నివేదికలో వెనుకబడి ఉన్నాం.
స్వాతంత్రం వచ్చి ఈ 75 ఏళ్ల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో మనం అభివృద్ధి చెందాము.దేశ వ్యాప్తంగా పలు పరిశోధనా సంస్థలు నెలకొల్పబడ్డాయి.అయితే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మానవ వనరులని సద్వినియోగం చేసుకోవాలి.ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి.ఇటువంటి సమయంలో యువతకు సరైన అవకాశాలు కలిపించాలి. తద్వారా వారి నైపుణ్యాలను దేశానికి ఉపయోగపడేటట్లు చూసుకోవాలి.కరోనా మహమ్మారి మానవ జీవితాల్ని
చిన్నా భిన్నం చేసింది. ఇటువంటి వాటిని ఎదుర్కొవాలంటే మానవ వనరుల వినియోగానికి సరైన ప్రణాళికలు ఉండాలి.