(నేడు జూలై 23 , తిలక్ జయంతి)
స్వరాజ్యం సిద్దిస్తేనే సురాజ్యం వస్తుందని "స్వరాజ్యం నా జన్మహక్కు" అని గర్జించిన భారతీయ సింహం. భారత అశాంతి పితామహుడిగా తెల్లవారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన పోరాటయోధుడు. రాజకీయ పదవులేవి ఆశించకుండా స్వాతంత్ర్య సముపార్జనే లక్ష్యంగా అతివాద ఉద్యమాన్ని నిర్మించిన ప్రఖర దేశభక్తుడు. ఆయనే దేశభక్తుల్లోకెళ్ల రారాజు గా పిలువబడిన బాలగంగాధర తిలక్. మహారాష్ట్రంలోని రత్నగిరిలో తిలక్ 1856 జూలై 23వ తేదీన జన్మించాడు. పార్వతీబాయి, గంగాధర రామచంద్ర ఆయన తల్లిదండ్రులు. బాలగంగాధర తిలక్ పూనాలోని దక్కన్ కాలేజీలో చేరి, గణిత శాస్త్రమును ప్రత్యేక విషయంగా చదివి ఇరువదవ ఏట పట్టభద్రుడయ్యాడు. తర్వాత ఎల్.ఎల్.బి.పట్టాను కూడా పుచ్చుకున్నాడు. విద్యావ్యాప్తి తన కర్తవ్యమని భావించిన తిలక్ 1880లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ అను పాఠశాలను ప్రారంభించాడు. 1885 దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి గవర్నర్ ఫెర్గుసన్ పేర కళాశాల ప్రారంభించాడు. గోపాలకృష్ణ గోఖలే ఆ కళాశాలలో ఆంగ్ల భాషాధ్యాపకుడుగా పనిచేసేవాడు.
సాంఘిక సేవారంగ ప్రవేశం చేసి, విద్యావకాశాల మెరుగుదలకు విస్తృతంగా పనిచేశారు. రాజకీయ నాయకుడుగా, పాత్రికేయుడుగా బహుముఖంగా దేశానికి సేవచేసే భాగ్యం ఆయనకు కల్గింది. తిలక్ ముప్పదిమూడేళ్ళు ప్రజాహిత సేవారంగంలో, ఎనిమిదేళ్ళు కారాగారంలో గడిపాడు. తిలక్‌ను బ్రిటిషర్లు భారతదేశ అశాంతి జనకుడు (Father of Indian Unrest) అని వర్ణించారు. భారత అశాంతి జనకుడు తిలక్ అని టైమ్స్ పత్రికా రచయిత వాలంటైన్ చిరోల్ విమర్శించాడు. ఈయనపై తిలక్ కేసు వేశాడు.
తిలక్ అనేక లారీ క్లబ్బులను ఏర్పాటు చేసి గోవధ నిషేధమును అమలుపరిచాడు. 1893లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు.1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు. "అఖాడా"అనే వ్యాయామ శాలలను ఏర్పాటు చేశాడు.1896లో మొట్టమొదటి సారిగా విదేశీ వస్త్రాలను పూనే వద్ద దహనం చేశాడు.పైసా ఫండ్ ను వసూలు చేసి దేశంలో జరిగే ఉద్యమాలకు వాడాడు.1897లో ప్లేగు కమీషన్ చైర్మన్ రాండ్‌కు వ్యతిరేకంగా తన వార్తా పత్రికలలో అనేక వ్యాసాలను ప్రచురించాడు.దీనికి ప్రభావితులైన చాపేకర్ సోదరులు (బాలకృష్ణ, దామోదర్) రాండ్, ఐరెస్ట్లను హత్య చేశారు. దీనిపై విచారణ జరిగి తిలక్‌కు 18 నెలల జైలు శిక్ష విధించబడింది.1908లో ప్రపుల్ల చాకీ, ఖుదిరాంబోస్ ముజాఫర్పూర్ జడ్జి అయిన కింగ్స్‌ఫోర్డ్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. కానీ విఫలం చెందారు.వీరికి మద్ధతుగా తిలక్ తన పత్రికలలో అనేక వ్యాసాలను ప్రచురించాడు.దీంతో తిలక్‌పై దేశద్రోహి కేసు నమోదై విచారణ జరిగి 6 సంవత్సరముల జైలుశిక్ష విధించబడింది. 1908 నుండి 1914 వరకు మయన్మార్‌లోని మాండలే జైల్లో నిర్బంధించబడ్డాడు.1916లో తిలక్ మహారాష్ట్రలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని అలహాబాద్, లక్నో మొదలైన ప్రాంతాల్లో మహ్మద్ అలీ జిన్నా వ్యాప్తి చేశారు.తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం అనిబిసెంట్ యొక్క ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ఉద్యమంలో విలీనమైనది.1916లో లక్నో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తిలక్, జిన్నా, అనిబిసెంట్‌ల ప్రయత్నాల ఫలితంగా మితవాదులు, అతివాదులు, ముస్లిం లీగ్ ఏకమైనాయి.ఈ సమావేశానికి అధ్యక్షుడు – ఎ.సి. మజుందార్ (అంబికా చరణ్ మజుందార్)1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని తిలక్ గర్జించాడు.
స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని చాటిన తిలక్ భారతీయులకు కావాల్సింది సంస్కరణలు కాదు, స్వపరిపాలనాధికారం లేదా స్వరాజ్యం అని పేర్కొన్నాడు.స్వరాజ్యం అనే చెట్టు మొదలుకు బహిష్కరణలు, స్వదేశీ ఉద్యమం కొమ్మల వంటివని తిలక్ అభిప్రాయబడ్డారు.జాతీయ భావానికి కర్జన్ చర్య గొడ్డలిపెట్టు లాంటిదని బెంగాల్ విభజన సమయంలో తీవ్రంగా విమర్శించారు. సంవత్సరానికోసారి కప్పలవలె బెకబెకమని అరిస్తే విజయం సాధించలేము అని కాంగ్రెస్‌ను విమర్శించాడు. దేవుడు అంటరాని తనమును సహించినట్లయితే నేను ఆయన్ను దేవుడిగా అంగీకరించను అని అంటరానితనం విషయంలో పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్య ఉద్యమంపై చెరగని ముద్ర వేసిన తిలక్ జీవితం అజరామరం. అలుపెరుగక పోరాడిన లోక మాన్యుడు 1918 ఆగష్టు 1 వ తేదీన ప్రశాంతంగా కన్ను మూశాడు. గాంధీజీ తన ' యంగ్ ఇండియా ' పత్రికలో తిలక్ కు శ్రద్ధాంజలులర్పిస్తూ "తిలక్ మహాశయుడు సాధించిన అనురాగం, పలుకుబడి మన కాలంలో మరే నాయకుడు సాధించలేదు. ఆయన ప్రజలకు ఆరాధ్య దైవం, మానవులలో మనోన్నత మూర్తి అస్తమించాడు. భారతదేశమంతటికీ లోక మాన్యుడైన తిలక్ మహాశయుని ధైర్యం, నిరాడంబరత్వం, త్యాగం, మాతృదేశాభిమానం మనము అలవరచుకొని ఆయనకు మన హృదయంలో చెక్కుచెదరని స్మృతి చిహ్నం నిలుపుకొందాం " అన్నాడు గాంధీజీ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి