పేలపిండి పండుగ ..!!:---శీరంశెట్టి కాంతారావు రచయిత పాల్వంచ .

 ఏరుముందా?ఏకాదశి ముందాని
మాపెద్దోళ్ళు అనుకుంటుండగా వింటూ పెరిగాము
వాళ్ళెప్పుడైనా ...
ఏరే ముందురావాలని మొక్కుకునేది
ఏరు ముుందొస్తే కాలం 
మస్తు గౌతుందని నమ్మకం మరి
మెరక దుక్కుల్లో పెసర్లేసి
బావులకింద నార్లుబోసి ఎడ్లను పుల్లరకుతోలి ముక్కారపనుల్లో మునిగి పోయినప్పుడు ఆటవిడుపుగా తొలేకాదశి పలకరించి పోయేది
తొలేకాదశి అంటే మాకు మాత్రం పేల పిండి పండుగగానే గుర్తు
పండుగ వారంరోజుల దూరంలో వుందనగానే పల్లెల్లో అమ్మలంతా బదుల్లో సదుల్లో జేసి తవ్వెడో మానెడో పజ్జొన్నలు, వీశో అరవీశో బెల్లం, తులమో అరతులమో యాలకులు సమీకరించి దొంతుల కుండల్లో దాచిపెట్టేది
పండుగపూట పొద్దున్నే ఇంటి పన్లన్నీ ఫటాఫట్ చేసి పైటాళ్ళదాటిన కాన్నుండి పొయిల మీదికి మంగళాలు ఎక్కించి చాటలకొద్ది జొన్న పేలాలు ఏయించి పోసేది
మాపటిజామ్ యసళ్ళాళ్ళకు పేలాల్ని రోళ్ళల్లో పోసి, బెల్లం , యాలకులేసీ మెత్తగా పిండిపడ దంచేది
చెప్పుకున్నట్టే అమ్మలంతా అదేసమయంలో పేలాపిండి కొడుతుంటే 
రోళ్ళ మృదంగాలమీద రోకళ్ళ చిర్రెల్తో వాయిస్తున్నట్టు ఊరు ఊరంతా బతుకునాదంతో చిందులు వేస్తూ బృందగానం పాడినట్టు వుండేది
ఇప్పుడా పండుగెటుబోయెనో
ఆ బృందగాన మేమాయెనో
మా మనుమరాలికి పేలా పిండి పెట్టిస్తే ఇదేం స్వీట్ అస్సలు బావోలేదంటూ ఇస్సిరికొట్టింది
పండుగపూట వాళ్ళ అమ్మమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది
                    

కామెంట్‌లు