అరుదైన ఫోటో:-- యామిజాల జగదీశ్ అమెరికాలోని ప్రముఖ పత్రికలలో "జాక్సన్ విల్లె జర్నల్" ఒకటి. ఈ పత్రికలో ఓ ఫోటోగ్రాఫర్ పని చేశారు. ఆయన పేరు Rocco Morobito. 
1967 జూలైలో ఆయన తన పత్రిక పని నిమిత్తం తన కారులో వెళ్తుండగా ఓ  వీధి పక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన ఓ సన్నివేశం చూసి విస్తుపోయారు. 
అదేంటంటే ఆ విద్యుత్ స్తంభాన విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులున్నారు. పైగా వారిద్దరూ ఉట్టినే ఉండటం కాక, ముద్దిచ్చుకుంటున్నారు. 
అది చూసిన మొరొబిటో కారుని ఓ పక్కగా ఆపి కారు రేడియో ద్వారా ఆంబులన్సుకి ఫోన్ చేశారు. అలాగే ఆ సన్నివేశాన్ని ఆయన తన కెమెరాలో బంధించారు. నిజానికి విద్యుత్ స్తంభాన ఉన్న ఆ ఇద్దరూ ముద్దిచ్చుకోవడం లేదు. 
అప్పటికి కొన్ని నిముషాల ముందు విద్యుత్ ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయిన వ్యక్తికి తోటి ఉద్యోగి CPR చేస్తున్నారు. అంటే, కార్టియో పల్మనేరీ రెసిస్టేషన్ చేసి తన తోటి ఉద్యోగి ప్రాణాలు కాపాడుతున్న సంఘటన అది. 
అలా ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు j.d. thompson. 
ప్రమాదానికి గురైన వ్యక్తి పేరు randall champion. 
స్పృహ కోల్పోయిన వ్యక్తిని కాపాడటం కోసం ఆ క్షణంలో సమయోచితంగా వ్యవహరించి ఆ మనిషి ప్రాణాలు కాపాడిన జేడీ థాంప్సన్ నిజంగా ఓ  హీరో. ఈ విషయం ప్రపంచస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఆ సంఘటనను మొరొబిటో కెమెరాలో బంధించిన ఆ ఫోటో అంతర్జాలలో వైరలైంది. 
అంతేకాదు, 1968 సంవత్సరానికి గాను ఆ ఫోటో "స్పాట్ లైట్ ఫోటోగ్రఫీ" విభాగంలో పులిట్జర్ అవార్డు పొందింది. ఆ ఫోటోకి "ది కిస్ ఆఫ్ లైఫ్" అని పేరూ పెట్టారు. 
తర్వాతి కాలంలో ఈ ఫోటోను ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫోటో ఎగ్జిబిషన్లలో ప్రముఖంగా ప్రదర్శించారుకూడా.  
ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఆ తర్వాత దాదాపు ముప్పై అయిదేళ్ళు బతికేక చనిపోయారు. 
ఇక తోటి వ్యక్తిని కాపాడిన Thompson ఇంకా బతికే ఉన్నారు. 
ఈ ఫోటో తీసిన మొరొబిటో 1920లో న్యూయార్కులో పుట్టారు. 2009 ఏప్రిల్లో తన 88వ ఏట మరణించారు.
ఆయన తన 22వ ఏట రెండవ ప్రపంచ యుద్ధంలో పని చేసారు. యుద్ధానంతరం ఆయన ఫోటో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవలసి ఉంది. ఆయన ఏ పత్రికకైతే పని చేశారో ఆ పత్రికను తన తొమ్మిదో ఏట వీధుల్లో అమ్మారు. అంటే పేపర్ బాయిగా పని చేసిన ఆయన ఆ తర్వాత అదే పత్రికలో ఫోటోగ్రాఫరుగా పని చేశారు.
"ది కిస్ ఆప్ లైఫ్" ఫోటోతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం. ఈ సంఘటన జరిగిన నలబై ఏళ్ళ తర్వాత 2008లో ఆర్. ఫోర్డ్ అనే డైరెక్టర్ దీనిని ఆధారంగా చేసుకుని ఓ డాక్యుమెంటరీ రూపొందించారు.
జీవితాన్ని ఎప్పుడూ పోటీగానూ బలపరీక్షనిరూపించుకునే మైదానంగానూ మాత్రమే చూడాల్సిన పని లేదు. జీవితాన్ని ఆస్వాదించాలి.  ప్రతి క్షణంలోనూ సరైన విషయాలను మాత్రమే సరిగ్గా చూస్తే గుర్తింపు పొందగలమనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఆ ఫోటో ఉన్నతమైన ముద్దుగా చెప్పుకోబడుతోంది. అదే, "ది కిస్ ఆప్ లైఫ్".

కామెంట్‌లు