చదవాలి
ఆలోచించాలి
ఆలోచనకు తదుపరి చర్య
అనుకున్నది రాయడం
అయితే రాయడం తెలియాలంటే
చదవాలి
చదవడం రాయిస్తుంది
చదవడం ఆనందాన్నిస్తుంది
చదవడం ఉత్సాహాన్నిస్తుంది
చదవడం మంచేదో చెడేదో చెప్తుంది
ఓ విధంగా పుస్తకం
మనకొక గురువే.....
నాకిష్టమైన తమిళ రచయిత, వక్త
భారతీకృష్ణకుమార్.
ఆయన చెప్పిన విషయం నన్నెంతో
ఆకట్టుకుంది
ఆయన చదువుకుంటున్న రోజుల్లో
ఓ పోటీకి వెళ్ళగా అందులో వెయ్యి రూపాయల బహుమతి లభించింది. ఆ సొమ్ముతో పుస్తకాలు కొనాలనుకుంటారు. అయితే ఏ ఏ పుస్తకాలు కొనాలో తెలీదు. అప్పుడు గోవిందన్ అనే మాష్టారు ఆయనను ఓ దుకాణానికి తీసుకెళ్ళిపుస్తకాలు కొనిపిస్తారు. వాటిలో ఒకటి "పుదుమైపిత్తన్" అనే పాతతరం రచయిత రాసిన కథలపుస్తకమొకటి.
భారతీకృష్ణకుమార్ ఆ పుస్తకాన్ని తీసుకుని డాబా మీదకు వెళ్ళి "కాంచనా" అనే కథ చదువుతారు. అది దయ్యాలకు సంబంధించిన కథ. సగం కథ చదివేసరికే ఆయనలో భయం పుట్టుకొచ్చి డాబా మీద నించి కిందకొచ్చెస్తారు. ఆ తర్వాత ఎవరితోనో ఈ విషయమై చర్చించగా అతనొక సలహా ఇస్తాడు. అదేంటంటే ఏ పుస్తకం చదవాలన్నా ముందుగా ఆ పుస్తకం గురించి రాసుకున్న ముందు మాటలు (పీఠిక) చదివి ఆ తర్వాతే పుస్తకంలోకి ప్రవేశించాలని.
ఆ మాటతో భారతీకృష్ణకుమార్ ఇంటికి వెళ్ళీవెళ్ళడంతోనే ముందుమాట చదువుతారు.
అందులో పుదుమైపిత్తన్ చెప్పిన విషయం ....
"అందరూ నన్ను అడుగుతుంటారు. దయ్యాలూ పిశాచాలూ ఉన్నాయాని. అవి ఉన్నాయని నమ్ముతారా అని. కానీ నేను చెప్పదలచుకున్నదేమిటంటే అవున్నాయో లేదో కానీ ఆ తలంపు వల్ల మనకో భయం ఉందని. ఆ భయంతో పాఠకులలో భయం పుట్టించొచ్చని...."
ఈ మాటలు చదివాక భారతీకృష్ణకుమార్ మనసు కుదుటపడటమే కాక రాయాలనే ఆలోచనకు పునాది వేసిందా పుస్తకం.
కొన్నేళ్ళ క్రితం నేను ఏ ఒక్క పుస్తకమూ చదివేవాడిని కాను. ఎందుకంటే చదివితే ఏమీ రాయలేమనే అభిప్రాయంతో. అందరూ రాసేస్తుంటే ఇక నేనేం రాయగలను అనుకున్నాను. కానీ చదవడంతోనూ పుస్తకాలను ప్రేమించడంతోనూ రాయగలమని, మనసుకొక ఊరట అన్న నాకెంతో ఇష్టమైన తమిళ రచయిత ఎస్. రామకృష్ణన్ వల్లే పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కానీ నేను ఒకటీ అరా రాయగలుగుతున్నానంటే అందుకు స్ఫూర్తి రామకృష్ణన్ గారే. అలాగని నేనేమీ కొత్తగా ఏమీ రాయడంలేదు. కానీ అనుకున్నదేదో రాస్తుంటాను. అవి అందరికీ తెలిసినవే. కొత్తదనమేమీ ఉండవందులో అన్న నిజం నాకు తెలుసు. మరెందుకు రాయడం అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకొచ్చే జవాబు..."ఇదీ ఓ వ్యాపకం. ఇదీ ఓ కాలక్షేపం. ఇదీ ఓ ఆనందం....అంతే. ఎవరు చదివినా చదవకున్నా నాకేమీ నష్టమూ లేదు. నా టైంపాస్ కోసం రాసుకోవడమే ఈ మాటలన్నీనూ. రాయడం కోసం ఏదో ఒకటి చదవాలిగా. పుస్తకాన్ని ప్రేమిస్తుంటాను. చదువుతుంటాను. అవి నా శ్వాస. ధ్యాస.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి