నా మది నిండిన గది..!!: ------డా.అంజనీదేవి--కల్యాణి నర్శింగ్ హోం హన్మకొండ.

 నా స్నేహితురాలు గృహప్రవేశం అని పిలిస్తే వెళ్ళాను... తను ఇష్టం గా కట్టుకున్న ఇల్లు..
కట్టక మునుపు, కట్టేటపుడు పడ్డ కష్టాలని చెప్పి ఇల్లు అంతా తిప్పి చూపించిది....
ఇది డ్రాయింగ్ రూమ్, కిటికీలు పెద్దగా డోర్ సైజు పెట్టించాము. ఫ్రెంచ్ డోర్స్, ఇది లివింగ్ రూమ్..
ఇది హాల్, ఇది పిల్లల గది, ఇది కిచెన్.. ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఫ్యాషన్ కదా అందుకే ఇలా పెట్టాము.
 ఇంకా పైన రెండు గదులున్నాయి, అందులో ఒకటి గెస్ట్ రూమ్, ఇంకొకటి నా గది, అది నాకు నచ్చిన గది.. అంది ఆరతి నా ఫ్రెండ్..
 అవునండి.. అది కూడా మా ఆవిడ తనకు ఇష్టమైన రీతిలో కట్టించుకుంది.. అదే తనకు అన్ని గదుల్లోకి నచ్చిన గది.. అని వాళ్ళయాన చెప్పాడు..
 వెనకవైపు గార్డెన్ కోసం వదిలిన స్థలం నుండి ముందువైపు వాస్తు ప్రకారం కట్టిన గ్యారేజ్ వరకు అన్నీ చూసి ఇంటికి తిరిగి వచ్చాను..
 అవును.. నాకు నచ్చిన గది ఏది అని, ఆలోచించాను ఇంట్లో అన్ని గదులు చూసుకున్నాను ఏది నాకు నచ్చలేదు.. నా స్టడీ రూమ్ నుండి మెట్లు దిగి నా హాస్పిటల్ కు వెళ్లాను. అటు ఇటు చూశాను ఎడమవైపు ఉన్న గది ఇదే నాకు నచ్చింది అని అనుకున్నాను. మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకున్నాను..
 ఆ గది పదేళ్లక్రితం కట్టించినది లక్షల సార్లు లోపలికెళ్ళి ఉంటాను అయినా ఈ రోజు మటుకు నాకు నచ్చిన గది అదే అనిపిస్తుంది సంతోషంగా మరొక్కసారి చూసుకున్నాను..
 అదే లేబర్ రూమ్ (ప్రసూతి గది)
అవును ఆ గదిలోకి వచ్చే స్త్రీకి కుల మతాలు లేవు, ధనిక బీద అనే తేడాలు ఉండవు, అందాల భరిణ కానీ, అనాకారి గాని, మాటకారి గానే, మూగ గాని ఎవరైనా ఒకటే బాధ ప్రసూతి బాధ.
 ఆ గదిలోకి వెళ్లగానే నేను అన్నీ మర్చిపోతాను అప్పుడు నా ఇల్లు, నా వాళ్లు, నా సంసారం గురించి కాదు నేను ఆలోచించేది. ఆ స్త్రీ బాధను సంతోషంగా మలచడం గురించి ఆలోచిస్తాను..
ఆ గది ముందే సంబరాలు స్వీట్స్ పంపకాలు..
 నేను ఆ గదిలోకి నిత్యం వెళ్లాలి నాకు భత్యం అదే కదా! నాకు కడుపునిండా భోజనం నా కాళ్ళకి దండాలు ప్రపంచంలో ఎక్కడా దొరకని రీతిలో కృతజ్ఞతలు.. అందుకే ఆ గది ఆహ్లాదంగా ఉండేట్లు ప్రయత్నిస్తాను అందంగా అలంకరిస్తారు.
 ఇలాగే స్త్రీ వైద్యురాలిగానే జీవితాంతం ఉండాలనిపిస్తుంది, ఆ గదిలోనే రాలి పోవాలనిపిస్తుంది కానీ విధి వెక్కిరించినప్పుడు, ఆ గదిలో స్త్రీ మౌనం వహించినప్పుడు ప్రసూతి వైరాగ్యం.. నా ప్రొఫెషన్ వదిలి ఎటో వెళ్లి (పారి) పోవాలనిపిస్తుంది.
 కానీ ఆ గది నా మదిలో నుండి పోదే!