మండోదరి( ఏకపాత్ర)-సత్యవాణి

   "ఆ ఏమనుచుంటివి సేవకా?ముక్కంటి,ముల్లోక దైవము ఆది శంకరులనే మప్పుతిప్పలు పెట్టిన నా నాధుడు ,లంకాధిపతి రావణబ్రహ్మ ,ఒక మానవుని చేతిలో హతమయ్యనా?ఈ విషయం నమ్మతగిన విషయమేనా?
        అపర పరక్రమశాలి,ఏడు ,ఏడు పద్నాలుగు లోకాలను గడగడలాడించిన అరివీర భయంకరుడు ,అపర పరాక్రమశాలీ అయిన నా నాధుడు యుధ్ధ క్షేత్రంలో  విగతుడై పడియున్నాడా?నన్ను  వారికడకు కొనిపొమ్ము.
       ఆహా!విధి ఎంతటి బలీయమైనది.ఎంతటి ఉన్నతుని  దశను ఎంతటి హీనదశకు చేర్చింది.హిమన్నగము కూలిపోయినదే.
     అయ్యో పట్టు తల్పం పై పవ్వళించే లంకాధిపతి , దాసదాసీ జనము చేత సేవలందే నాప్రభువు, విగతుడై, రణభూమిలో, దుమ్ము దూసరితమైన ప్రదేశంలో, కటిక నేలపై పడియుండెనా?
      అయ్యో నాధా!ఆనాడే,ఆ మహా ఇల్లాలు శ్రీరాముని సతిని చెరబట్ట వలదని చెవినిల్లు కట్టుకొని చెప్పితినిగదా!వింటిరా?
       నాధా!మీపరస్త్రీ వ్యామోహము ఎంతటి వినాశనానికి దారి తీసింది.
యోధాను యోధులైన సోదరులనూ,కడుపున పుట్టిన బిడ్డల క్షయమునకు కారణమైనదికదా! ఈనాటి వరకూ జగజగ్గాయమానంగా వెలుగులీనిన ,ఈ బంగారు లంక బుగ్గి పాలైనదికదా!
      నేనేకాదు,మీకంటే చిన్నవారైన మీ సోదరులు కూడా శ్రీరామునితో యుధ్ధం అనర్థమని చెప్పినూ చెవిని బెట్టక పోతిరే! రాక్షస వనిత త్రిజట సీతను రామునికి అప్పగించమని,తనకు కలలో అనర్థమలు గోచరించినవని,పదే పదే వేడుకొన్నదే,అయిననూ పెడచెవిని పెట్టితిరిగదా!ఇంతటి అనర్దమునుకు మీరు కారకులై, మేరునగ సమ ధీరులైన పుత్రులను గనియు నేడు వారిని పోగొట్టుకొని గొడ్రాలువలే జీవించవలసిన దురవస్థ తెచ్చిపెట్టితిరిగదా !
       ఆ....అక్కడ ఎవరూ?నా నాధుని విగత శరీరము ప్రక్కగా నిలువబడిన నమస్కరించుచున్న ఆజానుబహుడు.అరవింద దళాయతాక్షుడు.
        అతడేనా సీతాపతి శ్రీరాముడు?నిర్జీవుడైన రిపునకు నిమస్కరించుచున్నాడు.ఆహా! ఎంతటి ధర్మమూర్తి.
     నా రాకను గమనించకున్ననూ,నా నీడను  స్త్రీ యొక్క నీడని గుర్తించి, ఆనీడను సహితమూ తాకక దూరముగా వైదొలగినవాడు సుగణాలవాలుడు రాముడే అయివుండగలడు!ఇటువంటి సుగుణాత్ముని భార్యనా, నాభర్త రావణుడు చెరబట్టినది?ఎంతటి  అపచారము చేసినాడు లంకానాధుడు?
      పోనిమ్ము ,వీరులైన ప్రభువులకు యుద్ధము చేయకనూ తప్పదు.ఖర్మవశమున అటు దిటుయైన ఆ యుధ్ధములో మరణమునూ తప్పదు. అటవంటి వీర మరణము ఇటువంటి సుగుణాలవాలుడు,దయాబ్ది సోముడైన రఘుకుల తిలకుడు, రాఘవ నారాయణుని చేతిలో సంభవించుట మీరు అనవ్రతమూ జేసెడి శివార్చన ఫలితమేకదా!
నాధా! మీజన్మ  ధన్యమైనది.మీ పట్టపు రాణినైనందున  నాజన్మమునూ ధన్యమైనది. 
సెలవు శ్రీరామా!కరుణాలవాలా!రఘుకులసోమా !
     సెలవు మహాత్మా సెలవు.యక్షరాజ తనయ మండోదరి ప్రణాలివే గైకొనుము.