పెద్దలు మెచ్చిన పిల్లల సలహా:- బెలగాం భీమేశ్వరరావు

 రఘురాంపురం పంచాయతీకి చెట్లు
పెంచడం కోసం ప్రభుత్వం నుంచి డబ్బు
వచ్చింది. పంచాయతీ పెద్దలు  కచేరీలో సమావేశ
మయ్యారు.ఒక సభ్యుడు ఊరి చివర బంజరు
భూమిలో టేకు చెట్లు పెంచుదామన్నాడు.మరొక
సభ్యుడు ఊరు చుట్టూ గుగ్గిలం చెట్లు పెంచుదామన్నాడు. ఇంకొక సభ్యుడు పూలచెట్లు
పెంచుదామన్నాడు.ఇలా సభ్యులు 
ఒకొక్క అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
అంతలో ఆ గ్రామ పాఠశాల పిల్లలు కచేరీకి 
వచ్చారు. పర్యావరణ నినాదాలు చేశారు.
పంచాయతీ సభలో మాట్లాడడానికి అనుమతి
ఇవ్వండని సర్పంచ్ ను కోరారు. సర్పంచ్ కు
పిల్లలంటే ప్రేమ.
అనుమతి ఇచ్చాడు.అప్పుడు విద్యార్థులందరి
తరుపున రాము " పెద్దలకు నమస్కారం. ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి.
సామాన్యులు పండ్లు కొనలేకపోతున్నారు. అందువల్ల ఊరి నిండా పండ్ల చెట్లు పెంచమని మా మనవి.
అవి పండ్లనిచ్చి ఊరి వారి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.చల్లని నీడనిస్తాయి.చల్లని గాలినిస్తాయి.గాలిని శుభ్రపరుస్తాయి.పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి అధికమవుతుంది. రకరకాల రోగకారక జీవులు విజృంభిస్తున్న ఈ కాలంలో పండ్ల చెట్లకే ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడండి. మన ఊరిలోని ప్రజలకు పండ్లు ఉచితంగా లభించాలనే మా కోరిక. పెద్దలైన
మీరు చాలా పెద్ద మనసుతో మా చిన్న పిల్లల
కోరికను అర్థం చేసుకుంటారని మేం మనవిచేసుకుంటున్నాం"అని సభను కోరాడు.
సభ పిల్లల కోరికను ఆమోదించింది. పండ్లమొక్కలు తెప్పించి వీధీవాడా నాటారు.
అందరు ఆ మొక్కలను పసిపిల్లలను సాకినట్లు
పెంచారు.పెద్ద చేశారు.కొన్నాళ్ళకి పండ్లు
అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు
ఆరోగ్యవంతులై చక్కగా పనిపాట్లు చేసుకోసాగారు.కరోనా కష్ట కాలంలో ఆ పండ్ల చెట్లు ఎంతో ఉపయోగపడ్డాయి.పండ్లచెట్లు
నాటమని సలహా ఇచ్చిన పిల్లలను మెచ్చని వారు
ఆ ఊర్లో ఎవరూ లేరు.