బాతులోళ్ల ..పిల్ల ..!!:-శీరంశెట్టి కాంతారావు రచయిత పాల్వంచ

 ఎప్పటి మాదిరిగానే ఆ ఏడూ యాసంగి కోతలు ఐపోయాయో లేదో  తమిళనాడు నుండి రెండు బాతుల లారీలొచ్చాయి ఒకటి ఆకుతోటదగ్గర మరొకటి  కుంట కట్ట దగ్గర మకాం పెట్టాయి
కట్టకింద పాశమోళ్ళ పొలం గడ్డతీర్పు చేస్తున్న కూలీలు వాళ్ళ దిన చర్యను గమనించ సాగారు
రెండు జోడాలు పొలాలమీదికి బాతుల్ని తోలుకొని పోతే 
గుడిశ దగ్గర పెళ్ళికాని యువతి వంటావార్పు చేస్తూ వుంటుంది
వాళ్ళల్లో గట్టయ్య అనే ఉచ్చిలోడు అడపా దడపా బాతులమ్మాయి దగ్గరికెళ్ళి వస్తుండేవాడు
వాడికి తమిళం రాదు 
ఆ అమ్మాయికి తెలుగురాదు
పాపం భాష తెలియని 
ఆ అమ్మాయి వాడు ఏదన్నా అర్ధంగాక ఓ వెర్రినవ్వు నవ్వేది 
దాన్నే అలుసుగా తీసుకున్న వాడు తోటి పనోళ్ళదగ్గర ఏవేవో గప్పాలు కొట్టసాగాడు వాళ్ళు వాడిమాటల్ని నమ్మక పోయినా సరదాగా వింటుండిపోయారు
ఓరోజు పైటన్నం తిన్నంక ఎవరిసక్కిన వాళ్ళు చెట్టునీడన తువ్వాల్ల మీద అడ్డమొరిగారు
గట్టయ్యగాడు  ఎప్పుడు లేచి వెళ్ళాడో గాని, బాతులమ్మాయి అరుపుల్తో ఉలిక్కి పడిలేచిన వాళ్ళంతా గుడిశ దిక్కు పరుగెట్టారు 
అక్కడి దృశ్యం చూడనలవిగాక   వెనుదిరిగి తట్టా బుట్టా,పలుగు పారా సర్దుకొని ఊళ్ళో కొచ్చి పడ్డారు
మరో గంటలో బాతులోళ్ళు ఊరిమీది కొచ్చిపడి పెద్దమనుషుల్ని కచ్చీరు దగ్గర కూర్చోబెట్టారు 
మా సాంప్రదాయంలో
పిల్లబతుకును ఆగంజేసినోడే దాన్నేలు కోవాల పిల్లమెడలో
వాడిచేత తాళికట్టించి ఒప్పజెప్పి మాదేశం మేం ఎల్లిపోతం రేపటికల్లా 
ఆ ఏర్పాట్లు చేయించండంటూ పెద్దమనుషుల్నే హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళి పోయారు
ఒక్క వెధవ వల్ల ఊరికే చెడ్డ పేరొచ్చిందన్న ఆలోచనతో పెద్దమనుషులు కదిలిపోయారు 
పిల్ల పెండ్లి మేం కండ్లజూసుకొని  మాదేశం ఎల్లిపోతమంటూ బాతులోళ్ళు ఒకటే మాటమీద నిలబడ్డారు
వాడోట్టి పోకిరోడు ముందే పెండ్లైనోడు చేసుకుంటే తిన్నట్టు లేకుంటే పన్నట్టు పెండ్లం మీదికి పిల్ల నిచ్చి మీరెల్లిపోతే ఈకానని రాజ్యంలో అదెంత బాధపడుద్దో ఆలోచించండీ!
ఏదన్నా ఇప్పించేందుగ్గూడా వాడిదగ్గర పైసాలేదు మేమే రైతుల్నడిగి ఎంతో కొంత డబ్బులిచ్చే ఏర్పాటు చేస్తామన్నారు
పిల్లమానానికి రేటుకడతారా బాతులోళ్ళ నుండి బాణంలా 
ప్రశ్న దూసుకొచ్చింది 
ఏం చేయడానికి తోచని పెద్దమనుషులు కేసుపెట్టండి అంటూ సలహా ఇచ్చారు 
మాకు ఊరుతో తప్ప పోలీసుల్తో పన్లేదు 
మంచో చెడో ఊరే తీర్పుచెప్పాలంటు భీష్మించారు
వాడికి పెళ్ళిచేస్తే మాత్రం మీ పిల్లబతుకు వల్లకాడే డబ్బంటే అట్లంటిరి, పోలీసులంటే ఇట్లంటిరి మరింక మేం మాత్రం చేసేదేముంది? మీరే ఇంకేదన్నామార్గముంటే చెప్పండన్నారు పెద్దమనుషులు
వాళ్ళు కొంత యోచనచేసిన పిమ్మట ప్రత్యామ్నాయం ప్రకటించారు
పెద్దమనుషులు ఆమోదించారు
మరునాడు ఉదయం టముకేసి
ఊరినంతా కచ్చీరు దగ్గరికి రప్పించారు  
చాకలి వాడ నుండి అందరికన్నా పెద్దముత్తైదువు అక్కమ్మను రప్పించి ఊరిసమక్షంలో ఆవిడను కూర్చీమీద కూర్చో బెట్టించి
ముందుగా తప్పుచేసిన గట్టయ్యను పిలిచారు
వాడు తల నేలకేసుకునివచ్చి 
అక్కమ్మ పాదాలకు పసుపు పూసి, నుదుటన బొట్టుపెట్టి కాళ్ళకు దండంపెట్టి తప్పైందంటూ టపటపా చెంపలేసుకుని పక్కకు జరిగాడు,అతనివెనుకే మిగిలిన పనివాళ్ళంతా వచ్చి ఆవిడకాళ్ళకు దండంబెడుతూ
ఆసమయంలో వాణ్ణి అడ్డుకొని ఆడపిల్ల మానం కాపాడక పోవటం  మాదీ తప్పే అంటూ చంపలేసుకున్నారు
బాతులోళ్ళు విధించిన శిక్షకు
ఊరు సిగ్గుతో చితికిపోయింది
                 ***