ఆ...అమ్మాయి ఎవరో?...!!:---------శ్యామ్ కుమార్.నిజామాబాద్.

 ఇంగ్లీష్ లో " మిస్టేకేన్  ఐడెంటిటీ" అనే ఒక  విషయం ఉంది.  వివరంగా చెప్పాలంటే ఎవరు ఎవరో తెలుసుకోకుండా మాట్లాడటం.  ఇవి కొన్నిసార్లు ప్రమాదాలను కొని తేవడమే కాకుండా గమ్మత్తయిన సంఘటన గా కూడా రూపుదిద్దుకుంటుంది.  అలాంటివే నా స్నేహితుల మధ్య జరిగినసంఘటన  మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
అవి మేము  ఇంటర్ చదువుతున్న రోజులు. మా కాలేజీ లో అమ్మాయిలు దాదాపు సగానికి సగం వుండేవారు.  ఎక్కడా ఇసుమంత కూడా అమ్మాయిల కు  అబ్బాయిల తో ఇబ్బంది వుండేది కాదు. విపరీతమైన క్రమశిక్షణ లో చదువులు సాగేవి.  ఆ వూరి లో ఎక్కువగా ఆ డ్యాం కు సంబంధించిన వుద్యోగులు వుండే వారు. దాంతో మా కాలేజీ లో  చాల వరకు వారి   పిల్లల    సంఖ్యఎక్కువ .  బయట వూరి నుండీ వచ్చిన విద్యార్థులు కొద్ది మంది మాత్రమే  ఉండేవారు.  
ప్రతి రోజు సాయంత్రం ఒక తరగతి చిత్రకళ, మగ్గం లేదా వడ్రంగి కళ  నేర్చు కొవలసి వుండేది.  క్లాస్ లు అన్నీ అయిపోయిన తరువాత అందరూ వరుసగా వెళ్లి ఆడిటోరియo లో నిర్దేశించిన కుర్చీ మీద కూర్చొని ఆ రోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు చూడాల్సిందే.  బయటకు వెళ్లడానికి అనుమతి వుండేది కాదు.  ఇదేం మిలిటరీ రూల్  బాబు అనుకునే వాడిని. 
తెలంగాణ మొత్తంగా ఇటువంటి కాలేజీ ఎక్కడా లేదనే చెప్పాలి.
మొదటి రోజు  కాలేజీకి ఎప్పటిలాగే నేను స్కూల్లో వెళ్తున్నట్టు గా నిక్కర్ వేసుకుని వెళ్లాను.
 అప్పటికే   క్లాసెస్ మొదలయ్యి దాదాపుగా పదిహేను రోజులు అయిపోయాయి అని తెలిసింది. మొదటగా అన్ని సర్టిఫికెట్లు  ఆఫీసులో అందజేసి ఆ తర్వాత ఫీజు  కట్టించుకొని  సంతకం గురించి ప్రిన్సిపాల్ రూమ్ లోకి నన్ను తీసుకుని వెళ్లారు.  అక్కడ ప్రిన్సిపాల్ గారు అడిగారు "ఏంటి బాబు. నీకు హిందీలో  మార్కులు బాగా వచ్చాయి కదా? మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఎందుకు ?అన్నారు.
 దానికి ప్రతిగా ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను ఊరికే నిలబడ్డాను.
 హిందీ తీసుకో బావుంటుంది అని సరేనా అని మళ్ళీ నన్ను అడిగి దానికి  సమాధానంగా తనే సరే అని చెప్పుకొని నన్ను తెలుగు లో నుంచి తీసి హిందీ క్లాస్ లోకి మార్చారు.  అదుగో అక్కడ 11 సంవత్సరాల తర్వాత జరిగే నా వివాహానికి   నా ప్రమేయం లేకుండా ముఖ్యమైన అడుగు పడింది.  అప్పుడు నాకు ఆ సంగతి తెలియదు అనుకోండి.
   నా మొదటి రోజు మొట్టమొదటి తరగతి   బాటని క్లాస్.  విజయలక్ష్మి గారు  వచ్చి పాఠము మొదలు పెట్టారు.  కొత్తగా వచ్చి చేరిన నన్ను చూసి పిలిచి నా దగ్గరున్న ప్రవేశ అనుమతి పత్రము తీసుకొని తన దగ్గరున్న రిజిస్టర్లో  రాసుకున్నారు.  అదంతా జరుగుతుంటే నేను నిలబడి చూస్తున్నప్పుడు నా ముందు వరసలో కూర్చున్న   అబ్దుల్ గని అనే కుర్రాడు  కింద చెయ్యి పెట్టి నా కాలును  గోర్లతో గీకడం మొదలు పెట్టాడు.  అప్పుడు గమనించి చూస్తే నాకు అర్థం అయింది అందరూ ప్యాంట్ వేసుకొని ఉన్నారు నేను ఒక్కడినే  నిక్కర్ తో వున్నాను.  నాకేమీ అర్థం కాక అబ్బాయి ని చూసాను. కొంటెగా చిన్నగా నవ్వడం మొదలుపెట్టాడు.  మళ్లీ ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా నిక్కరు వేసుకుని కాలేజీకి వెళ్లలేదు అనుకోండిఅ ది వేరే విషయం.
 తెలుగు హిందీ ఇంగ్లీష్ క్లాసులకు అన్ని  గ్రూప్ లో నుండి విద్యార్థులు వచ్చి ఒకే చోట ఒకే క్లాసులో కూర్చొని వినేవారు.  అక్కడ నేను , కేఎల్.వి.ప్రసాద్ (  ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యారు) ,  రాజేంద్ర ముగ్గురం కూర్చునేవాళ్ళం.  వాళ్ళిద్దరూ అప్పుడప్పుడూ సరదాగా అమ్మాయిల గురించి జోకులు వేసుకుంటూ నవ్వుకునేవారు.  ఒకరోజు పాఠం మొదలు అయిన తర్వాత  పార్వతి అనే అమ్మాయి ఆలస్యంగా వచ్చింది.  తలుపు దగ్గర అనుమతి గురించి నిలబడిన ఆ అమ్మాయిని చూసి ఉపాధ్యాయుల వారు నవ్వుతూ సంబోధించి లోనికి రమ్మన్నారు.  అప్పుడు అందరూ ఆ అమ్మాయి వేపు చూడసాగారు.   పార్వతి చాలా చక్కగా తెల్లటి వస్త్రాలతో వదులుగా జడ వేసుకొని  మా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది.  మెరుపు తీగ లా  సన్నగా బంగారు రంగులో ఉన్న ఆ అమ్మాయిని చూసి klv prasad సరదాగా చిన్నగా తన పక్కనున్న 
 రాజేంద్ర తో గుసగుసగా అన్నాడు "  అమ్మాయి భలేగా ఉంది లే రాజా" అని. 
 అయితే ఎప్పుడూ హుషారుగా సమాధానమిచ్చే రాజేంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు.  అది చూసి ఎల్.వి.ప్రసాద్ వీడు సరిగ్గా విన్నట్టు లేదు అనుకొని మళ్ళీ రెట్టించి "అమ్మాయి భలే ఉందిలే రాజేంద్ర" అన్నాడు.  అప్పుడు రాజేంద్ర తలవంచుకొని    మొహం గంభీరంగా పెట్టి
"ఆ అమ్మాయి మా చెల్లెలు   బాస్" అన్నాడు.
 వెంటనే  ప్రసాద్ గతుక్కుమని మొహం పెట్టి సీరియస్ గా  ఉపాధ్యాయులను   చూస్తూ పాఠం వినడం మొదలు పెట్టాడు. 
 ఇలాంటిదే ఇంకొక సంఘటన  జరిగింది.  డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణలో ఉన్న నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో కొన్ని నెలలు పని చేశాను.  దాని ఆఫీసు శివాజీ నగర్ లో ఉండేది.  ఆఫీసులో పని ఏమీ ఉండేది కాదు ఎప్పుడో నెలకు ఒక వారం రోజులు తప్ప.  రోజంతా  బ్యాంకు ఉద్యోగ పరీక్షల కొరకు చదువుతూ ఉండేవాడిని.  ముందుగా కాసేపు ఆవరణలో నిలబడి  హిందూ పేపర్ చూసేవాడిని .   ఒకరోజు సరిగ్గా అలాగే నిలబడి ఉన్నప్పుడు  చాలా అందమైన అమ్మాయి అటువైపుగా వెళ్తు కనిపించింది.  ఆ వయసులో అందరు అమ్మాయిలు అందంగా కనిపించే వారు ,లేక అందరు అమ్మాయిలు అందంగా ఉండే వారో తెలియదు కానీ ఆమె  మాత్రం అందమైనది  అనే చెప్పాలి.  అలా ప్రతి రోజు దాదాపుగా అదే సమయానికి  నేను అక్కడ నిలబడడం, అమ్మాయి  మా ఆఫీసు ముందు నుంచి వెళ్లడం  జరిగేది. నన్ను కలవడానికి చాలామంది స్నేహితులు అంతా దాదాపుగా నిరుద్యోగులు, అక్కడికి వచ్చే వారు. వారు రాగానే  టి-గానీ కాఫీ -గానీ   తెప్పించే వాడిని. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకొని వెళ్ళి పోయేవారు. ఆ సమయంలో రవి అనే నా కాలేజీ సహ విద్యార్థి ఎక్కువగా వచ్చేవాడు.  ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాడు. ఎక్కువగా అమ్మాయిల గురించి మాట్లాడే స్వభావం కలిగి ఉండేవాడు.  రోజూ మా ఆఫీసు ముందు నుంచి పోయే అమ్మాయి గురించి చెప్పాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించి ఒక రోజు ఆ విషయం చెప్పాను.  "ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది ?ఎలా ఉంటుంది ?ఎవరు ?పేరు ఏంటి ?"ఇవన్నీ అడిగాడు .నేను నవ్వుతూ చెప్పాను 
"అవన్నీ నాకు ఏమీ తెలియదు, మన ఆఫీసు    ముందు నుంచి రోజు వెళుతుంది . చాలా చక్కగా ఉంటుంది "అని.  
మరుసటి రోజు ఉదయం నాకంటే ముందుగానే  వచ్చి ఆఫీస్ ముందు నిలబడి కనిపించాడు.  నాతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ కళ్ళు  చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.  ఆఫీసు లోపలికి వచ్చి కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ చాలా సేపు కూర్చుని మాట్లాడుతూ అడిగాడు" ఏది !నువ్వు చెప్పిన అమ్మాయి రాలేదే !!"అని .
అప్పుడు నేను అనుకున్నాను అవునే రాలేదు అని .
" అవును రా!  మరి ఈరోజు కనిపించలేదు" అన్నాను. 
చాలా సేపు కూర్చొని ఉద్యోగ విషయాలు వగైరా మాట్లాడి వెళ్ళిపోయాడు.
 రెండో రోజు వాణ్ణిచూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మళ్ళీ వచ్చి కరెక్ట్ గా అదే సమయానికి నాకంటే ముందుగా  వచ్చి సిగరెట్ తాగుతూ ఆఫీసు ముందు నిలబడ్డాడు.!
 అప్పుడు  నవ్వుతూ అడిగా" ఏంట్రా అమ్మాయి గురించే??" అని.
  మొహం అంతా వెడల్పు చేసి నవ్వుతూ "అవున్రా  .నువ్వు అంతలా చెప్పావు కదా, చూద్దామని వచ్చాను." అన్నాడు.  
ఆ రోజు కూడా ఆ అమ్మాయి రాలేదు.  చాలా సేపు ఎదురు చూసి  నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు.  మూడో రోజు మళ్లీ వచ్చాడు.  నేను" ఒరేయ్ నువ్వు వస్తున్నట్టు గానీ అమ్మాయికి తెలిసిపోయిందిరా అందుకే పారిపోయింది" అన్నాను  పగలబడి నవ్వుతూ
 "అయితే మరి ఏంటి వదిలేద్దామా"  అన్నాడు నవ్వుకుంటూ.
 "మరి అంతేగా! అంతకంటే చేసేదేముంది"  అనుకుంటూ రోడ్డు వైపు చూశాను. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి వస్తూ కనపడింది.
 "ఒరేయ్ నీ పంట పండిందిఅదుగో ఆ అమ్మాయి!" అంటూ చూపించాను.  అటువైపుగా చూసి,  మెల్లిగా నా వైపు తిరిగి కాస్త నవ్వుతూ " ఆ అమ్మాయి ఎవరనుకున్నావు ?మా    పిన్నికూతురు !"అన్నాడు. 
 ఈసారి నేను గతుక్కుమన్నాను. నేను కూడా నవ్వటానికి ప్రయత్నించాను కానీ  నవ్వు రాలేదు. వెంటనే   నష్ట నివారణ చర్యల్లో(disaster management)భాగంగా    "ఒరేయ్, తప్పుగా భావించే రా. నాకు తెలియదు గా ఈ సంగతి .మరి ఎవరో అనుకున్నాను." అని సర్ది చెప్పాను. 
"పర్వాలేదు రా. నువ్వు తప్పుగా ఏమీ మాట్లాడలేదు కదా? వదిలే!" అన్నాడు.   
 జీవితంలో రెండోసారి ఆ నిజం తెలుసుకున్నాను ఏమిటంటే ఎవరు ఎవరో తెలియకుండా మాట్లాడకూడదు అని.     భవిష్యత్తులో ఎన్నో సార్లు ఈ విషయం  తలుచుకుంటూ స్నేహితుల దగ్గర సరదాగా నవ్వుకొని చాలా ఆనందించాను.  ఈ విషయంలో నేను వాడి మనసు బాధ పెట్టి ఉంటానేమో ?అని నాకు ఎప్పుడూ   లోలోపల కెలుకుతూ ఉండేది . బహుశా అమ్మాయిలంటే ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటే  ఇలాగే జరుగుతుంది అని వాడికి అర్థమయ్యే ఉంటుంది.    
ఆరోజు రవితో నన్ను చూసిన     ఆ అమ్మాయికి నేను వాళ్ళ అన్నయ్య స్నేహితుడని అర్థమై ఉంటుంది  కామోసు.  , అప్పటి నుంచి నన్ను   స్నేహభావంతో చూసేది.  నేను మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో పలకరించే వాడిని.
 ఎప్పుడు బయట కలిసినా సరే, ఈ విషయం  ఎన్నడూ మా సంభాషణ లో వచ్చేది కాదు. మా మధ్య స్నేహం లో ఏ మాత్రం  తేడా  కూడా రాలేదు. 
 కాని రవి మాత్రం  ఆ తర్వాత మరి ఎప్పుడు  నా ఆఫీస్ ఛాయలకు   పొరపాటున కూడా రాలేదు సుమా.!!

కామెంట్‌లు