దాశరథి "వెన్నెల మడుగులు" డా.వి.ఆర్.శర్మ.

 ఈరోజు మహాకవి దాశరథి కృష్ణమాచార్య 96 వ జయంతి. ఆ మహాకవి జయంతి సందర్భంగా ఆయన రాసిన 
"వెన్నెల మడుగులు" అనే బాలగేయ నాటికను గురించి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం.  
    ఈ బాలగేయనాటికను దాశరథి 1953 లో రాశారు. నాకు తెలిసినంతవరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రచయిత రాసిన తొలి బాలగేయనాటిక ఇదే కావచ్చు. అవునో కాదో సాహిత్య పరిశోధకులు చెప్పాలి. ఈ నాటికను చిరుగజ్జెలు(బాల నాటికలు), అనే పుస్తకంలో 1953 లో నాటి తెలంగాణ రచయితల సంఘం,సిరిసిల్లా(శాఖ) ప్రచురించింది.
      వెన్నెలలో ఆడుకోవడం పిల్లలకెంతో  ఇష్టమైన విషయం. కమ్మిన మబ్బులను తొలగించి పిల్లలకు చందమామ ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈ నాటికలో. బాలల్ని ఊహాలోకాల్లోకి తీసుకుని పోయే గేయనాటిక ఇది. 
     ఈ నాటికలో చందమామతో కలిపి మొత్తం ఐదు పాత్రలు ఉంటాయి.ఆరోజు కార్తీక పున్నమి, సాయంత్రం ఏడున్నర సమయం, చంద్రికాపురం అనే చోటు, పిల్లలు ఆడుతూ పాడుకుంటున్నారు.
      "మడుగులు మడుగులు,వెన్నెల మడుగులు/మెత్తని చుక్కలు ఎత్తిన గొడుగులు" అంటూ ఆపాట ఆ అందాల వెన్నెల నిండిన ప్రకృతిని అద్భుతంగా వర్ణిస్తూ కొనసాగుతుంది. 
    ఇంతలో జలధరుడు ప్రవేశించి , పిల్లల్ని "జరగండహో, జరగండహో"అని అదిలించి,వెన్నెలలంటే తెల్లని నాగుంబాములని" భయపెట్టి చేయి విసిరి, వెన్నెలను మాయం చేస్తాడు. 
     పిల్లలు భయపడుతూ " అందాల మనభూమి అడుగునే పోయింది/అంధకారాలతో ఆకాశమొచ్చింది" అనీ, 
"భయము భయమేస్తుంది  బ్రతుకు కంపిస్తుంది/ప్రియమైన మననేల జ్ఞాపకం వస్తుంది" అనీ, అనేక రకాలుగా తమ భావాలు చెప్పుకుంటారు. 
     జలధరం పిల్లలను వాన మబ్బుల రథంమ్మీద ఎక్కించుకొని ఆకాశంలోని పెద్దనీలాల మేడలో దింపుతాడు. ఆ చీకటి మబ్బుల జైలులో పసిపిల్లలు ఖైదీ లౌతారు.     అక్కడ భయపడుతున్న పిల్లల దగ్గరకు చంద్రుడు వస్తాడు.
      "మామ నుండగా/ మీకేం భయము/క్షేమంగా మీ/ఇల్లు చేర్చుతా" అని పిల్లలను తన వెన్నెల రథం ఎక్కించుకుంటాడు. పిల్లలంతా చందమామను కౌగలించుకొంటారు.అంతటా వెన్నెల మడుగులు కనిపిస్తాయి.
      ఇలా చక్కని గేయాలతో ఈ నాటిక పిల్లలను అలరిస్తుంది. ప్రకృతి, వెన్నెల, పిల్లలు నిండిన ఈ గేయ నాటిక నిజంగా పున్నమి వెన్నెల మడుగే. కార్తీక వెన్నెలల్లాంటి పిల్లల కోసం  ఈ గేయనాటిక వెన్నెల మడుగులు పూయించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యకు పిల్లల తరఫున, పెద్దల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.  
               
కామెంట్‌లు