*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౪ - 74)

 శార్దూలము:
*చవిగా, చూడ, వినంగ, మూర్కొన, తనూ | సంఘర్షణాస్వాదమొం*
*ద వినిర్మించెదవేల జంతువుల, నే | తత్క్రీడలే పాతక*
*వ్యవహారంబులు సేయ, నేమిటికి | మయావిద్యచే బ్రొద్దు పు*
*చ్చి వినోదింపగా! దీననేమి ఫలమో! |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
నీ మాయా చేత, మా మనుషులకు, రుచులు తెలుసుకోవడానికి నాలుక, ప్రపంచాన్ని చూడడానికి కన్ను, వాసనలు గుర్తించడానకి ముక్కు, చప్పుడులు వినడానికి చెవి, స్పర్శ తెలిసేట్టుగా చర్మం అన్నీ ఇచ్చి వీటి వల్ల మేము తెలిసీ, తెలియక తప్పులు చేస్తుంటే చూసి ఆనందిస్తావు. ఇలా చేయడంవల్ల నీకు ఏమి లాభం కలుగుతుంది సామీ! .........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరమానందా! నీ మాయా జగత్తులో మాకు పంచేద్రియాలూ ఇచ్చి మమ్మల్ని ఐశ్వర్య వంతులుగా చేయాలని అనుకున్నావా స్వామీ! కానీ మేము వాటిని విషయ వాంఛలను తీర్చుకోవడానికి వాడుతున్న తీరు చూచి ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఎమి అనందం పొందుతున్నావు, తండ్రీ! నీవిచ్చిన కన్నులతో నిన్ను చూడటం మరచి పోయాము. నాలుకతో నీ నామం పలుకుట లేదు.  నీ విచ్చిన చెవులతో దివ్యమైన, పాపహరమైన నీ నామం వినడం లేదు. ఈ శరీరాన్ని నీ సేవలో వినియోగం చేయడంలేదు. సర్వవిధాలా భ్రష్ఠులమై పోయాము. ఇక మాకు నీవే గతి! ఇదే మా శరణాగతి! కరుణించి, నీ కన్నులు తెరచి చల్లని చూపులు మాపై కురిపించు చంద్రకళాధరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు