*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౮ - 88)

 శార్దూలము:
*నిన్నన్ జూడరొ, మొన్నజూడరొ జనుల్ | నిత్యంబు జావంగ నా*
*పన్నుల్గన్న నిధానమయ్యెడిన్ యాధన | భ్రాంతిన్విసర్జింపలే*
*కున్నా రెన్నడు నిన్ను గందురిక మ | ర్త్యుల్ గొల్వరేమో నిను*
*న్విన్నంబోవక యన్యదైవరతులన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మాతో వున్న వాళ్ళు చనిపోవటాన్ని నిన్న చూసారు, మొన్న చూసారు. రోజూ చూస్తూనే వున్నారు, మా మనుషులు. కానీ డబ్బు సంపాదించడం మీద వున్న ప్రేమని వదలుకో లేక పోతున్నారు.  ఇబ్బందులలో వున్న వారిని రక్షించడానికి నువ్వు వున్నావు అనే నిజాన్ని ఒప్పుకో లేక పోతున్నారు.  డబ్బులు వున్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సమయం పోగొట్టుకుంటున్నారు. ఎప్పటికి నీ దగ్గరకు వస్తారో, ఎమిటో ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మా చుట్టూ జరుగుతున్న జనన మరణాలను ప్రతీ రోజూ చూస్తూనే వున్నాము.  ఈ జనన మరణ చక్ర బంధంలో కలిగే ఇబ్బందులనూ చూస్తున్నాము. అయినా సరే, నీవే కల్పించిన మాయకు లొంగిపోయి, ఐహిక సుఖాలకూ, కష్టాలకు మూలమైన ధనసముపార్జన వైపే మొగ్గుతున్నాము.  ఈ ధనము నీవైపు నడిపించే ఇంధనము కాదని గ్రహించలేక పోతున్నాము. నీవు కప్పిన ఈ మాయ పొరలను నీవే తొలగిస్తే తప్ప, మాలోనే వున్న నిన్ను చేర్చే, నిన్ను మేము తెలుసుకోలేము కదా, కాళహస్తీశ్వరా! ఈ విషయం నీకు తెలుసు. అయినా, మాయలో పడి కొట్టకుంటున్న మమ్మల్ని చిద్విలాసంగా చూస్తుంటావు, చిదంబరేశా.  ఎప్పటికైనా నిన్ను నీవు మాకు పరిచయం చేయకపోతావా ఆని ఆశగా మోరలెత్తి డగ్గుత్తితో నీవైపే చూస్తున్నాము, చకోరాల వలే. కరుణించు కార్తికేయా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు