మూర్ఖుడికి సన్మానం.:-డి.కె.చదువులబాబు.తెలుగుఉపాధ్యాయుడు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716

 భువనగిరి జమీందారు అమాయకుడు. ఆయనకు ఒకసారి అతి మూర్ఖుడికి సన్మానం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే దివాను కోటప్పను పిల్చి, "చుట్టూఉన్న  గ్రామాల్లో పరమ మూర్ఖుడెవరో కనుక్కునిరా! ఒక మూర్ఖుని ఎన్నికచేసి చెప్పు. ఘనంగా సన్మానం చేస్తాను"అన్నాడు.
అతిమూర్ఖుడి కోసం వెదుకుతున్న కోటప్పకు దారిలో గంపలోని చేపలను పిసుకుతూ, ఒక్కొక్కచేపను చెవి దగ్గర పెట్టుకుని ఊపుతూ పరిశోధనచేస్తున్నవాడు కనిపించాడు.
వాడి దగ్గరకెళ్ళి "ఎందుకలా చేస్తున్నావ్?"అని అడిగాడు.
"సముద్రంలో నా ఉంగరం జారిపోయింది. దాన్ని చేప మింగి ఉంటుంది కదా! ఏ చేప కడుపులో ఉందో పరిశీలిస్తున్నాను" అని చెప్పి తనపనిలో నిమగ్నమయ్యాడు. కోటప్ప వాడి వివరాలు వ్రాసుకున్నాడు.
కొంతదూరం వెళ్ళాక కోటప్పకు ఒకడు భూమిపై బోర్లాపడుకుని కనిపించాడు. "ఎందుకలా పడుకున్నావని" అడిగాడు కోటప్ప.
"భూమి లోపలనుండి నీళ్ళుఎలా బయటకు వస్తున్నాయని'లోపలఎన్నినీళ్లు ఉన్నాయో కనిపిస్తాయని చూస్తున్నా" అన్నాడు. వాడి మూర్ఖత్వానికి నవ్వుకుంటూ వాడి వివరాలు వ్రాసుకున్నాడు.
ఆగ్రామం నుండి పక్కగ్రామానికెడుతున్న కోటప్పకు ఒకడు చెట్టుకు ఉరితాడు తగిలించి, దానివైపు చూస్తూ, ఆలోచిస్తూ కనిపించాడు.వాడి దగ్గరకెళ్ళి కారణమడిగాడు.
"నాభార్య 'మూర్ఖుడితో వేగలేను. ఉరేసుకుని చావు' అంది. ఆవు తలుగు తీసుకుని వచ్చాను. ఈతాడు తెగిపోతే ఆవుకు తలుగు ఎలా?" అని ఆలోచిస్తున్నా అన్నాడు.
కోటప్ప వాడి వివరాలు వ్రాసుకుని, చావు ఏసమస్యకూ పరిష్కారం కాదని ధైర్యంగా బతకాలని వాడికి నచ్చజెప్పి, తాడుచేతికిచ్చి ఇంటికి పంపాడు.
పక్కగ్రామంలో నీళ్ళు తాగనని మొరాయిస్తున్న గేదెకు బలవంతంగా నీళ్ళు తాపాలని ప్రయత్నిస్తున్న వాడు కనిపించాడు.
"దానికిష్టమైతే అదే తాగుతుంది కదా!" అన్నాడు కోటప్ప.
"గేదెకు బాగా నీళ్ళుతాపితే దీని పాలల్లో నీళ్ళు కలుస్తాయి. నీళ్ళుతాపకుంటే చిక్కని పాలిస్తుంది కదా! నీళ్ళపాలు అమ్మితేనే లాభమని నాన్న చెప్పేవాడు" అన్నాడు. వాడి మూర్ఖత్వానికి నవ్వుకొని వాడి వివరాలు కూడా వ్రాసుకుని వెళ్తున్న కోటప్పకు పరుగెడుతూ వస్తున్న ఒకడు విసురుగా తగిలాడు. "ఎందుకలా పరుగెడుతున్నావు?"అని అడిగాడు కోటప్ప.
"ఇంటి దగ్గర వీణ వాయించాను. ఆ శబ్దం ఎంతదూరం వెళ్ళిందో, విందామని వెడుతున్నా"అంటూ పరుగెత్తాడు. వాడిని గుర్తుపెట్టుకున్నాడు కోటప్ప.
అక్కడనుండి ప్రయాణమై మరో గ్రామం చేరుకున్నాడు.దివాను అక్కడకెళ్ళేసరికి వర్షం మొదలయింది. వర్షంలో తడుస్తూ భోరున ఏడుస్తున్న ఒకడు కనిపించాడు. కారణమడిగితే "నిన్నటిదాకా ఆకాశం బాగుండేది.ఈరోజు ఏ కష్టమొచ్చిందో, ఏడుస్తోంది చూడు. నాక్కూడా ఏడుపొస్తోంది" అన్నాడు. 
వాడి వివరాలు వ్రాసుకుని ఒక ఇంటి పంచన చేరాడు కోటప్ప. అక్కడ ఒకడు తన శరీరానికి రంగువేసుకుంటుండటం చూసి కారణమడిగాడు.
"నాన్న చనిపోతూ, మచ్చ లేకుండా బతకమని చెప్పాడు. అందుకే చర్మంమీద మచ్చలు కనిపించకుండా ఒకేరంగు వేసుకుంటున్నాను" అన్నాడు.
 'మచ్చలేకుండా బతకమంటే జీవితంలో చెడ్డపేరు రాకుండా బతకమనిఅర్థం' అని వాడికి వివరించి, వాడి వివరాలు వ్రాసుకున్నాడు.
కోటప్ప అక్కడనుండి పక్క గ్రామానికెళ్ళాడు . అక్కడ పెద్దచిత్రపటాన్ని, కుంచెను మార్చి మార్చి చూస్తూ,తలగోక్కుంటున్న ఒకడు కనిపించాడు.వాడి ప్రవర్తనకు కారణమడిగితే "ఈచిత్రపటాన్ని ఒక పెద్దమనిషి నాముందే తయారుచేశాడు. ఇంత పెద్ద చిత్రం ఈచిన్న కుంచెలో ఎలా దాక్కుని ఉండగల్గిందో అర్థంకావడంలేదు" అన్నాడు.
కోటప్ప వాడి వివరాలు వ్రాసుకుని రాత్రికి భువనపురం చేరి, జమీందారు దగ్గరకెళ్ళాడు.కోటప్ప వెళ్ళే సమయానికి జమీందారు వెన్నెల్లో కూర్చుని గోనెసంచి లోకి దేన్నో తోస్తున్నాడు. జమీందారు చేస్తున్నపని ఏంటో అర్థంకాక ఏం చేస్తున్నారని అడిగాడు.
"నేను చేయబోయే సన్మానానికి వెన్నెలతో శాలువా తయారుచేసివ్వమని నేతగాడికి చెప్పాను.వెన్నెలను తీసుకురండి తయారు చేసిస్తానన్నాడు.అందుకే వెన్నెలను సంచిలోకి తోస్తున్నా" చెప్పాడు జమీందారు.  దివానుకోటప్ప బుర్రగోక్కుంటూ "అయ్యా!చుట్టుపక్కలగ్రామాల్లో అంతగొప్ప సన్మానానికి మీరుతప్ప అర్హతగలవారు ఎవ్వరూ కనిపించలేదు. మీకుతప్ప ఆసన్మానం పొందే అర్హత మరెవరికీ లేదు" అన్నాడు. 
ఆమాటలకు జమీందారు చాలా సంతోషపడ్డాడు.

కామెంట్‌లు