తగిన పాఠం:- ఆర్యసోమయాజుల శరత్--సాఫ్ట్ వేర్ ఇంజనీర్-9885668181

  హరిగిరి రాజు జయ సింహునికి ప్రతాపుడనే కుమారుడున్నాడు.రాజుగారికి ప్రతాపుడు ఏకైక పుత్రుడు అవడం వలన ఎంతో గారాబంగా పెంచారు.గురుకులానికి పంపినా సరిగ్గా మనసు పెట్టి చదివే వాడుకాదు.తోటి పిల్లలతో ఆడుకోకుండా బాగా తిని నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాడు దానితో ఊబకాయం వచ్చింది.ప్రతాపుడు ఏ పని సక్రమంగా నిర్వహించలేక పోతున్నాడు.ఒక సారి మంత్రి కొడుకు సుహస్తుడు ఏదో పని మీద రాజ అంతఃపురానికి వచ్చాడు. అంతఃపురానికి పక్కనున్న తోటలో ఏదో శబ్దం అయింది! ఏమిటా అని సహస్తుడు బయటకు పరుగెత్తాడు.మరి ఊబ కాయం చేత ప్రతాపుడు పరుగెత్తలేక పోయాడు.తోటలోని పెద్ద బాన మీద టెంకాయ చెట్టు నండి టెంకాయ ఊడిపడిన శబ్దం అది.మరికొన్ని కాయలు పడేందుకు సిద్దంగా ఉన్నట్లు సుహస్తుడు గమనించాడు.అంతటి మంత్రి కొడుకైనా గబగబా చెట్టుఎక్కి కాయలు కోసి కింద పడేశాడు.
    సుహస్తుడి చురుకుదనానికి ప్రతాపుడు ఆశ్చర్యపోయాడు.తను ఏ పని చురుగ్గా చేయలేక పోతున్నట్టు గ్రహంచి ఏది ఏమైనా తను మారాలని నిశ్చయించుకుని ఆస్థాన రాజ గురువైన విద్యాపతి గారిని కలసి తనకు చురుకుదనం లేని పరిస్థితి వివరించాడు.
         ప్రతాపుడి సంగతి తెలిసిన విద్యాపతి "నాయనా నీవు మారాలనుకొంటున్నావు అది మంచి విషయం,ఈ ప్రపంచం లో ప్రతి జీవి ఆ మాటకొస్తే సూర్యుడు,గ్రహాలు,చెట్లు మరెన్నో చైతన్యవంతంగానే ఉంటాయి.అవి ఎంతో మేలు చేస్తుంటాయి.వాటి పట్టుకను సార్థకం చేసుకుంటుంటాయి.రేపు నీవు బద్దకించకుండా నాతోరా, ఎన్నోవిశేషాలు చూపిస్తాను నీకు పూర్తిగా అర్థం అవుతుంది"చెప్పారు విద్యాపతి.
       "సరే నేను వస్తాను గురువుగారు"చెప్పాడు ప్రతాపుడు.
        "అయితే పొద్దున ఐదు గంటలకు తయారయి ఉండు,ఏ మాత్రం ఆలస్యం చేయకు"
          "సరే గురువుగారు"చెప్పాడు ప్రతాపుడు.
ప్రతాపుడు తన సేవకులతో వేకువజామునే లేపమని ఆజ్ఞాపించాడు.
         విద్యాపతి గారు చెప్పిన విధంగా పొద్దున్నే వచ్చారు.చిత్రంగా ప్రతాపుడు తయారుగా ఉన్నాడు.
విద్యాపతి గారు ప్రతాపుడిని తీసుకుని ఒక అడవికి వెళ్ళి పక్షి గూళ్ళను చూపించాడు పిల్లలు ఉన్నాయిగానీ పెద్ద పక్షులు లేవు! పెద్దచెట్లను చూపించాడు అవి పండ్ల పూలతో విరగబూసి ఉన్నాయి.జింకలు వేగంగా నడస్తూ గడ్డిని తింటున్నాయి.
         వాటిని చూపి విద్యాపతి చెప్పారు,"చూడు ప్రతాప్ చెట్లు ఏ మాత్రం విశ్రమించకుండా పండ్లు,పూలు మనందరికీ ఇస్తున్నాయి! వేకువ జామునే పక్షులు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళి తాము తిని పిల్లలకు ఇస్తూ తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటున్నాయి.అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ మనల్ని మన కర్తవ్యాల్ని మనం నిర్వర్తించాలని చెబుతున్నాడు.ఆ చీమలు చూడు క్రమశిక్షణతో ఒకే దారిలో పోతూ బద్దకించకుండా ఆహారం సేకరించి దాచుకుంటున్నాయి.దానినే చైతన్యం అంటారు. తరచి చూస్తే ప్రకృతిలో ప్రతీదీ  మనకు అనేక విషయాలు బోధిస్తాయి. ప్రతి జీవికి చైతన్యం ఉండాల్సిందే,మన మనుషుల్లో మరింత చైతన్యం ఉండి మన పుట్టుకకు ఒక అర్థం ఉంది అని తెలియచెయ్యాలి అనేక మంది గొప్పవారు బద్దకం లేకుండా మనకి కావ్యాలు, కళలు అందించి వారి పేరును స్థిరస్థాయి చేసుకున్నారు"చెప్పారు విద్యాపతి.
         "గురువర్యా,నాకు అర్థం అయింది అభివృద్ధికి పరమ శత్రువు బద్ధకమే,రేపటినుండి మీరు చైతన్యం నిండిన ప్రతాప్ ని చూస్తారు"అని పూర్తి విశ్వాసం తో చెప్పాడు ప్రతాపుడు.
       చెప్పినట్టే ప్రతాపుడు బద్దకం వదలించుకుని తనను తాను తీర్చి దిద్దుకుని 
 మంచి యువరాజు అని పించుకున్నాడు.
                 

కామెంట్‌లు