చెన్నైలో క్లాక్ టవర్లు:-- యామిజాల జగదీశ్
 మద్రాసు మహానగరంలో అక్కడక్కడ నెలకొల్పిన క్లాక్ టవర్లను చూడవచ్చు. తమిళంలో మణిక్కూండు అంటారు. నూరు సంవత్సరాలకు పూర్వం చేతి వాచీ అనేది ఓ ఖరీదైన వస్తువుగా ఉండేది. కొందరు మాత్రమే వాచీ కొనగలిగేవారు. నేనూ అంతే. మా నాన్నగారు కట్టుకునే చేతి వాచీని అపూర్వంగా చూస్తుండేవాడిని. అదేమీ ప్రత్యేకతలున్న వాచీ కానప్పటికీ అదేదో అరుదైనదిగా అన్పిస్తుండేది. అయితే ఆరోజుల్లో అరుదైనదవడంవల్లోనేమో ప్రజల సౌకర్యార్థం నగరంలోని ముఖ్య స్థలాలలో క్లాక్ టవర్లను ఏర్పాటు చేసి ఉంటారని నా భావన.
క్లాక్ టవర్ అనేది నాలుగు దిక్కులా కనిపించేలా నాలుగువైపులా గడియారాలను అమర్చిన ఓ గోపురం. 
మద్రాసులో ఓ నాలుగు క్లాక్ టవర్లను ప్రధానంగా చెప్పుకోవచ్చును. అవి, రాయపేట్టయ్, డిమెల్లోస్ రోడ్, డౌటన్ రోడ్, తంగశ్శాలై (మింట్) లలో ఉండే క్లాక్ టవర్లు. ఇవి కాకుండా సెంట్రల్ రైల్వే స్టేషన్లు, పి ఆర్ అండ్ సన్స్, చెన్నై కార్పొరేషన్ ఉండే రిప్పన్ బిల్డింగ్స్ లలోనూ క్లాక్ టవర్లను చూడవచ్చు.
చెన్నై అణ్ణాశాలై (మౌంట్ రోడ్డు) కూడలిలోని క్లాక్ టవర్ పి.ఆర్. అండ్ సన్స్ ఏర్పాటు చేసినది. ఇది వందేళ్ళ కాలం నాటిది. ఈ క్లాక్ ప్రారంభోత్సవానికి ఇంగ్లండ్ ప్రిన్స్ జార్జ్, ఆయనను పెళ్ళాడబోయే మేరీలతో పాటు మరి కొన్ని సంస్థానాల ప్రముఖులు పాల్గొన్నారు.
తర్వాతి కాలంలో ప్రిన్స్ జార్జ్,.అయిదో జార్జ్ చక్రవర్తి అయ్యారు. ప్రిన్సెస్ మేరీ రాణీ మేరి అయ్యారు.
 
పి.ఆర్. అండ్ సన్స్ క్లాక్ టవర్లో మూడు వైపులలో మాత్రమే గడియారాలున్నాయి.
ఈ గడియారం చూపే టైము, చెన్నై వాతావరణ శాఖలోని టైము ఎప్పుడూ సెకండ్లతో సహా ఒక్కటిగా ఉంటుందంటారు.
రాయపేటలోని క్లాక్ టవర్ ని 1930లో నిర్మించారు. సౌత్ ఇండియా వాచ్ కంపెనీగా వ్యవహరించే ఘని అండ్ సన్స్ ఇందులోని గడియారాన్ని ఏర్పాటుచేసింది. ఈ సంస్థను 1909లో ఇరాన్ కు చెందిన హాజీ మీర్జా ఘని ప్రారంభించారు. ఈ సంస్థే తర్వాతి కాలంలో చూలై, తిరువొట్రియూర్ వంటి ప్రాంతాలలో నెలకొల్పిన క్లాక్ టవర్లకు గడియారాలను తయారు చేసి ఇచ్చింది.
మింట్ పరిధిలో 1948లో క్లాక్ టవర్ ని ఏర్పాటు చేశారు. ఈ గోపురం ఎత్తు అరవై అడుగులు. ఇక్కడి గడియారాలనూ ఘనీ అండ్ సన్స్ తయారు చేసినవే. 1948లో చెన్నై నగర మేయర్ గా ఉండిన డాక్టర్ యు కృష్ణారావు ఈ క్లాక్ టవర్ కు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడి గడియారాలకు వారానికోసారి ఓ వ్యక్తి కీ key ఇస్తాడు. మధ్యలో ఓ పదేళ్ళు ఇవి పని చేయలేదు. 2013లో ఈ మింట్ కూడలిలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం చేపట్టాక తర్వాత కార్పొరేషన్ వారు పి.ఆర్ అండ్ సన్స్ తో కలిసి 2014 జనవరి 17వ తేదీన ఈ క్లాక్ టవర్ కి ప్రారంభోత్సవం చేశారు. ఇది జార్జి టౌన్ పరిధిలోనికొస్తుంది. ఈ మింట్ స్ట్రీట్ చెన్నైలోని పురాతన వీధులలో ఒకటి. 
చెన్నైలో తొలి క్లాక్ టవర్ 1900లలో పురసైవాక్కంలోని డౌటన్ కూడలిలో నిర్మితమైంది. ఈ టవర్ కట్టడానికి ముందర సెయింట్ జార్జ్ కోట అధికారులు ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఫిరంగి గుండ్ల ధ్వనిని వినిపించేవారు. డౌటన్ క్లాక్ టవర్ ఏర్పాటు చేసిన తర్వాత ఫిరంగి మోత పద్ధతికి స్వస్తి పలికారు. 
చెన్నై నేపియర్ బ్రిడ్జిని వాహనాలపై దాటుకుంటూ పోతున్నప్పుడు ఎర్ర రంగులో ఎత్తున కనిపించే చెన్నై విశ్వవిద్యాలయ టవర్ క్లాక్ వయస్సు వందేళ్ళు దాటింది.
నాలుగు దిక్కులలోనూ ఇక్కడి క్లాక్ టవర్ టైమ్ చూపుతుంది. 1913లో నిర్మితమైన ఈ క్లాక్ టవర్ ఎత్తు ఇరవై ఏడు మీటర్లు. చేపాక్ పరిధిలోనే ఇది రెండో ఎత్తయిన క్లాక్ టవర్. ప్రపంచ తమిళ ప్రాచీన భాష మహానాడుని పురస్కరించుకుని చెన్నై విశ్వవిద్యాలయ క్లాక్ టవర్లో గంటకొకమారు తిరుక్కురళ్ వినిపించేలా ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. గంటకొక తిరుక్కురళ్ చెప్పున రోజులో ఇరవై నాలుగు తిరుక్కుర్ భావంతో సహా వినపడుతుంది. ఈ క్లాక్ టవర్లోపల 1330 తిరుకురళ్ సూక్తులూ ఉన్నాయి. ఒకానొక సమయంలో ఈ క్లాక్ టవర్ పని చేయకుండా పోయింది. తిరుక్కురళ్ వినరాలేదు. అయితే ఇప్పుడు టైమ్ మాత్రం చూపుతోంది. ఈ క్లాక్ టవర్ సమీపాన ఓ నీటి ట్యాంక్ ఉంది. ఆ రోజుల్లో ఇక్కడి గంట ధ్వని వినిపించడంతోనే ఈ ట్యాంక్ నుంచి అన్ని ప్రాంతాలకు నీరు పంపిణీ చేసేవారు. అయితే క్రమేణా ఈ టవర్లోని ఇటుకలు దెబ్బతిన్నాయి. కట్టడం బీటలు వారి నీరు కారడం మొదలైంది. అంతేకాకుండా ఈ టవర్లో పావురాలు వంటివి నివసించడం మొదలుపెట్టాయి. అయితే ఈ విషయం గమనించిన అధికారులు కార్మికులతో పరిశుభ్రం చేయించారు. మొత్తం క్లాక్ టవర్ ని 2022 మార్చికల్లా బాగు చేసి ఇది మునుపటిలా పని చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు.
కామెంట్‌లు