*మంచి వాళ్లకు మంచే జరుగుతుంది (సంయుక్త అక్షరాల కథ)* :-డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 9441032212
 ఒక వూరిలో ముగ్గురు యువకులు వుండేటోళ్ళు. వాళ్ళు చానా పేదోళ్ళు. కానీ చానా మంచోళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళ చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోతే ఒక గురువు చూసి అయ్యో పాపమని అన్నం పెట్టి చదువు చెప్పినాడు. వాళ్ళు పెరిగి పెద్దగయినాక రాజు దగ్గర ఏదయినా కొలువు సంపాదించాలని బైలుదేరినారు.
అలా అడవిలో పోతా వుంటే దారిలో వాళ్ళకి ఒకచెట్టు కింద ఒక ముసలామె ఒంటరిగా కళ్ళనీళ్ళు పెట్టుకోని కనబడింది.
వీళ్ళు ముగ్గురూ ఆగి ''ఏమవ్వా ఏమయింది. ఎందుకలా బాధపడతా వున్నావు. మేమేదైనా సాయం చేయగలమా'' అన్నారు.
దానికా ముసలామె ''ఏం చేద్దాం నాయనా... నాకు నలుగురు పిల్లలు. అందరికీ అన్నీ చేసి పెట్టి పెంచి పెద్ద చేసినా. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయినా గదా... పని చేసే సత్తువా లేదు. లేచి నిలబడే ఓపికా లేదు. ఇటీవలే నా మొగుడు కూడా చచ్చిపోయినాడు. దాంతో వాళ్ళు కొంచంగూడా జాలీ, దయా లేకుండా నన్ను తీసుకోనొచ్చి ఈ అడవిలో ఒంటరిగా వదిలేసి పోయినారు'' అని చెప్పింది.
ఆ మాటలకు ముగ్గురూ బాధపడతా ''అవ్వా... మాకు గూడా ఎవ్వరూ లేరు. మాతోబాటు వచ్చేయి. పంచభక్ష పరమాన్నాలు పెట్టలేక పోయినా మేం ఏం తింటే అది పెడతా కన్నతల్లి లెక్క కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటాం'' అన్నారు.
దానికా ముసలామె నవ్వి ''ఏదో మాట వరసకి అలా అంటా వున్నారు గానీ నిజంగా ఈ ముసలిదాన్ని ఎవరు చూసుకుంటారు నాయనా'' అనింది.
అందుకు ఆ ముగ్గురూ నవ్వి ''అవ్వా... అడవి అన్నాక ముళ్ళచెట్టూ వుంటాది. పళ్ళచెట్టూ వుంటాది. అలాగే వూరన్నాక మంచివాళ్ళూ వుంటారు. చెడ్డవాళ్ళూ వుంటారు. మాకు నువ్వేం బరువు కాదు. అలా అనుకోనింటే అనాథల మయిన మేం అసలు బతికేవాళ్ళమే కాదు. ఎవరో ఒకరు చేరదీయబట్టే గదా ఈ రోజు ఇలా వున్నది. నువ్వు మనసులో ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా మా వెంబడిరా'' అంటా ఆమెను పిలుచుకోని పోయినారు.
ముగ్గురూ రాజు దగ్గర ఒక చిన్న కొలువు సంపాదించినారు. మనలాగే లోకంలో పేదవాళ్ళు, అనాథలు చానామంది వున్నారు. వాళ్ళకు కనీసం చదువన్నా చెబుదాం అనుకుంటా ఒక ఉచిత పాఠశాల పెట్టినారు. అవ్వను 'నువ్వే మాకు పెద్దదిక్కు' అంటా పువ్వుల్లో పెట్టుకోని చూడసాగినారు. అలా ఆరునెల్లు గడిచిపోయినాయి. ఒకరోజు పొద్దున అవ్వ ఎక్కడా కనబడలేదు. వూరంతా వెదికినారు. ఇంటింటికీ పోయి అడిగినారు. ఎవరినడిగినా మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. కళ్ళనీళ్ళతో అవ్వ గదికి చేరుకున్నారు. అక్కడ మంచం కింద ఒక పెద్ద మూట, దానిపైన ఒక ఉత్తరం కనిపించినాయి. విప్పి చూసినారు.
అందులో ''నాయనలారా... మీకు నా ఆశీస్సులు. నేను మీకు నాకు నలుగురు కొడుకులు వున్నారని, వాళ్ళు అడవిలో వదిలేశారని అబద్దం చెప్పినాను. నాకు అసలు పిల్లలే లేరు. మొగుడు కూడా ఇటీవలే చనిపోయినాడు. నాకు పదితరాలు తిన్నా తరగనంత ధనముంది. దాన్ని ఏం చేయాలో తోచక భూములన్నీ అమ్మేసి బంగారం కొన్నా. దాన్ని ఎవరైనా మంచివాళ్ళకి, పదిమందికి సాయం చేసేటోళ్ళకి అప్పగించి కాశీకి పోయి హాయిగా గడపాలనుకున్నా. దాంతో అలా ఒంటరిగా అడవిలో కూచున్నా.
కొందరు చూసీ చూడనట్టు ఈ కంప మనకెందుకులే అని పోతే. మరి కొందరు అన్నీ విని చేతిలో ఒక పదిరూపాయలు పెట్టి పోయినారు. అంతేగానీ, మీలెక్క రమ్మన్నోళ్ళు గానీ, కనీసం పిలిచినోళ్ళు గానీ ఎవరూ లేరు. మీరు తీసుకు రావడమే గాక నెత్తిన పెట్టుకోని చూసుకున్నారు. ఈ ఆరునెల్లూ మీ మంచితనం గూడా గమనించినాను. మీలాంటోళ్ళ చేతుల్లో పెడితే పదిమందికీ ఉపయోగపడుతుంది. మీరు ఈ బంగారంతో హాయిగా బతుకుతా, పదిమందికి సేవ చేయండి. నా కోసం వెదకొద్దు'' అని వుంది.
వాళ్ళు ఆ మూట విప్పితే నిండా బంగారు నగలు కనబడ్డాయి. తేరగా వచ్చినది వూరికే ఎక్కువ కాలం పక్కనే పెట్టుకుంటే అనవసరంగా ఆశలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు వెంటనే అదంతా అమ్మేసి ఆమె పేరు మీదే ఒక బడి పెట్టి అందరికీ ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టినారు.


కామెంట్‌లు