స్వప్న సౌందర్యం:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.

 నిద్రరాని రాత్రులెన్నో గడిపాను
నిద్ర చెదిరిన పగటిపూట పుటలెన్నో చదవాను
ఒక దశాబ్ద కాలపు పలవరింతల్లో
మధనపడ్డ మనసు కలవరింతలు 
నిదురలేని నాలో 
జనించింది ఓ సుందర స్వప్నం 
 ఆశల కాంతి శిఖరంలా 
ప్రశాంత మదిలో అజేయ వసంతం
ఎంత గొప్ప సాంత్వన కలిగే నాలో
ఎంత గౌరవ భావన ఎత్తిన శిరంలో
స్వప్న సౌందర్యం నిండిందీ అవనిపై
నైరాశ్యంపై చేసిన యుధ్ధంలో నాది  
 ఇన్నేళ్ళ మనిషి కేక గెలుపుతీరంలో
జీవితం విలువ వికసించిన పూలదే
తీపి తేనె దారాల్లిన మాతృత్వం
లిపి లేని భాషలో ప్రేమ అక్షరత్వం
ఉపశమనంలో దొరికిన బహుమతి
మనసులో దాగిన సోయగాల గీతి
నయనానంద స్వప్న సౌందర్యంలో
సురుచిర చిరు దరహాస దివ్యతేజం
తేట మనసు అమేయ స్వాతి నేత్రం 
 సత్య దృష్టి సృష్టిలో సతతం నిజం
నిత్య నిర్మల నవ్యాతి నవ్య కావ్యం

కామెంట్‌లు