ఎంఎస్, ఓ జ్ఞాపకం...!!:-- యామిజాల జగదీశ్










 జీవితంలో సంగీతం తప్ప మరేవీ తెలియని ఎంఎస్ గారి గురించీ తెలుసునా? అని అడిగితే తెలియాల్సిన అవసరమేముంది అనక తెలుసుకోవలసిన ప్రాధాన్యముందనే అంటారెవరైనా. 
ఓ నాలుగైదు వాక్యాలలో పొందుపరచలేనంత కథ ఆవిడది.
జీవితాంతం సంగీత ప్రయాణం చేసిన మహిళామణి! 
ఈరోజుల్లో ఓ మోస్తరు ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత నేర్చుకోవడాన్ని ఆపేయడం మనమందరం చూస్తూనే ఉంటాం.
కానీ జీవితాంతం నిత్యమూ నేర్చుకుంటూనే ఉండిన ఆవిడే మదురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మిగారు!
డబ్బు విలువ ఏమిటన్నదే తెలియదు ఆవిడకు! అవన్నీ ఆవిడ భర్త సదాశివంగారు చూసుకునేవారు!
సంపాదించిన వాటిలో అధిక భాగం ధర్మ కార్యాలకు ఇచ్చేసే మంచి మనసున్న మనీషి సుబ్బులక్ష్మిగారు.
 
ఎవరినీ పరుష మాటలనేవారు. తిట్టడం అనేది ఆవిడ రక్తంలో లేదు.
ఐక్యరాజ్యసమితిలో గానం చేసిన ఎంఎస్ గారు విశ్వ దేశాలలో తమ స్వరం వినిపించారు. అప్పటికీ తమను ఓ సాధారణ మహిళగానే భావించి జీవించిన మహోన్నత మనీషి ఎంఎస్ గారు.
 
మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక సమ్మాన్ అవార్డు కార్యక్రమానికి ఎంఎస్ గారు, సదాశివంగారు వెళ్ళారు. విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో ఎవరో హిందీలో పిలవడాన్ని విని బయటకు వచ్చీ చూసారు సదాశివంగారు. ఓ పండ్ల వ్యాపారి నిల్చున్నాడు.
"అమ్మ పాడింది వినాలి. మీరా సినిమా నుంచీ ఒకే ఒక్క పాట పాడితే చాలు" అని అతను అడగ్గా సదాశివంగారు కనుసైగ చేయడం, సుబ్బులక్ష్మిగారు ఓ పాట పాడారు.
పఃడ్ల వ్యాపారి వింటూ ఉన్నారు. ఎంఎస్ గారు పాడటం పూర్తయ్యాక అతను రెండు పండ్లు ఆవిడ చేతిలో పెట్టాడు.
సదాశివంగారన్నారు "అన్నింటికన్నా గొప్ప సన్మానం ఇదే" అని.
ఆ పండ్ల వ్యాపారి కళ్ళల్లోని ఆనందబాష్పాలను చూసానని ఎంఎస్ చెప్పారు.
రష్యాలో ఎంఎస్ గారు కచ్చేరీ కోసం వెళ్ళినప్పుడు ఓ రష్యా మహిళ కళ్ళు నీటితో నిండినప్పుడు ఎంఎస్ గారు లేచి నిల్చుని తన హృదయంమీద చెయ్యుంచి ధన్యవాదాలు చెప్పినప్పుడు ఆ మహిళ ఓ పుష్పగుచ్ఛాన్ని ఆవిడకు అందించారు.
లోటంటూ లేకపోవడంవల్లే సజీవంగా గాలితో కలిసి ఆవిడ గానం ఇప్పటికీ అందరినీ స్పర్శిస్తోంది.
"నేనెవరిని? ఈ భారత దేశానికి మాత్రమే ప్రధానిని. కానీ ఎంఎస్ గారు సంగీత సామ్రాజ్ఞి కదా?" అని జవాహర్ లాల్ నెహ్రూ చెప్పే స్థాయికి ఆవిడ సంగీతం భారతదేశాన్ని కట్టిపడేసింది. 
 
భారతరత్న పొందిన ప్రప్రథమ సంగీతకళాకారిణిగా చరిత్ర పుటలకెక్కిన ఎంఎస్ గారిని నా జీవితంలో ప్రత్యక్షంగా చూడటం నా భాగ్యమనుకుంటాను. మేము మద్రాసు టీ. నగర్లోని బజుల్లా రోడ్డులో ఉన్నప్పుడు మా ఎదురిల్లే మన భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారు) గారిల్లు. వారింటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. రక్షకభటులుండేవారు కారు. నీటిసమస్య రోజుల్లో వారింటి ఆవరణలోకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న సందర్భాలున్నాయి. రాజాజీగారింటికి ఎంఎస్ గారు, సదాశివంగారు వచ్చి వెళ్తుండేవారు. అప్పుడు వారిని చూసిన భాగ్యం కలిగింది. జవాహర్ లాల్ నెహ్రూనికూడా రాజాజీగారింటికి వచ్చినప్పుడే చూడగలిగాను. అలాగే బ్రిటీష్ రాణినిసైతం!!

కామెంట్‌లు