తాత నేర్పిన పాఠం....అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇంట్లో లత శివ  తెగ అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. కరోనా వల్ల  ఇంకా  వీరికి ఆన్లైన్ క్లాస్. బైట ఆడుకోనివ్వరు.కుక్కినపేనులా నోర్మూసుకుని  ఎంత సేపని కూచుంటారు?అమ్మా నాన్నా లాప్టాప్ కంప్యూటర్!బామ్మ వంటపనిలో బిజీ."అబ్బ!ఏంటా కాకిగోల?"విసుక్కుంది.తాత కూరలసంచీ బల్లమీద పెట్టి అన్నాడు."లతా!నీవు బామ్మకి
సాయం చేయి.శివా! ఈవరండా గది నీట్ గా పెడితే నేను మంచి కథ చెప్తాను."లత కూరలు శుభ్రం గా నీటితో కడిగి   సింక్ లో ఉన్న  గ్లాసులు కడిగింది. శివ గది వరండా లో కుర్చీలు  సామాన్లు  సర్ది అందరి చెప్పులు స్టాండులో పెట్టాడు."తాతా!కథచెప్పు"కుర్చీలో కూలబడ్డారు.
 "కథ వినటం కాదు ఆలోచించి జవాబు చెప్పాలి.ఈ మూడు బొమ్మలు మీకోసం తెచ్చాను.వీటి తేడా కనిపెట్టాలి."చిన్న మేకు ఇచ్చాడు. పిల్లలు వాటిని అటూ ఇటూ తిప్పి బోర్లించిచూశారు.అంతా మామూలుగానే ఉన్నాయి."మాకు ఏమీ తెలీటంలేదు తాతా!".
"ఈమేకు ని మొదటి బొమ్మ చెవిలో పెడుతున్నాను. "అది ఈచెవి నుంచి ఆచెవి బైటికి వచ్చింది.రెండో బొమ్మ  చెవిలో పెడితే దాని నోటిలోంచి బైట కొచ్చింది. మూడో బొమ్మ లోంచి మేకు బైటికి రాలేదు."అయ్యో ఇప్పుడు ఎలా?"పిల్లలు అరిచారు. "దీని వెనుక ఉన్న  కీ తిప్పితే వస్తుంది "తాత బొమ్మ అడుగు భాగంనించి మేకుని బైటికి తీశాడు. "మీకు ఏం అర్థం అయింది?ఏం నేర్చుకున్నారు?"తాత ప్రశ్నకు తెల్లమొహం వేశారు. తాత చెప్పుకుపోతున్నాడు"మనం ఈమూడోబొమ్మలాగా గుంభనంగా ఉండాలి. పెద్దలు చెప్పిన ది బాగా ఆకళింపు చేసుకుని ప్రవర్తించాలి. మంచి మాటలు ఇతరుల కి చెప్పాలి.చాడీలు చెప్పితే  ఇరువురికీ నష్టం. ఇక మనల్ని ఎవరైనా తిట్టినా ఈచెవిలోంచి విని ఆచెవితో వదిలేయాలి. అవసరమైతే వారికి  సాయంచేయాలి."శివ అన్నాడు "పిల్లలు తమ సమస్య కష్టం చెప్పబోతే  "ఆపు నీ సుత్తి .చదువుకో పుస్తకాలు తీసి"అని పెద్దలు అంటే మాకు ఎలా ఉంటుంది,"
"అవును!అందుకే గదా మాఇల్లు మా పల్లెను వదిలి మీరు కనీసం 8వక్లాస్ కి వచ్చే దాకా  మీదగ్గర ఉందామని వచ్చాం.ఆయా ని పెట్టవచ్చు. కానీ బామ్మ తాత ప్రేమ ఆప్యాయత మీరు ఇప్పుడే రుచి చూడాలి. మేము మంచంమీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు  ఓల్డ్ ఏజ్ హోంలో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే చాలు!"తాత కళ్ళల్లో నీరు తిరిగాయి."లేదు తాత!మీరు  మమ్మల్ని మన పల్లెకి తీసుకుని వెళ్లండి. ఆన్లైన్ క్లాస్ కదా! పల్లెలో మీఫ్రెండ్స్ బంధుమిత్రుల ని మాకు పరిచయం చేయండి. నాన్న ని కారులో దింపమని అడుగుదాం"పిల్లల మాటలు విన్న బామ్మ వెర్రి ఆనందం తో  గబగబా వచ్చి  వారి ని  గుండె లకు హత్తుకుని ముద్దు పెట్టింది.
కామెంట్‌లు