బాపు :- మంగారి రాజేందర్ జింబో

పళ్లెం  నుంచి
ఒక్క మెతుకు  కింద పడినప్పుడల్లా
నువ్వే గుర్తుకొస్తావు

 కచేరీ లోని
 కుర్చీని చూసినప్పుడు
 ఇంకా నువ్వు చందమామ కథలను
 చదువుతున్నట్టే అనిపిస్తుంది 

ఇంటి ముందటి అర్రలో 
ఇంకా నువ్వు రోగులను చూస్తున్నట్టుగా 
చెరిగిపోని ఓ ఫీలింగ్

గుడికి పోయినప్పుడల్లా 
నువ్వే గుర్తుకొస్తావు. 
మనుషుల్లో దైవాన్ని 
చూసిన నీ భావన గుర్తుకొస్తుంది 
ఏమి ఆశించని 
నీ వైద్యసేవే స్పురణ లోకి వస్తుంది 

బస్టాండుని చూసినప్పుడల్లా 
అక్కలని 
బస్సెక్కించి సాగనంపమని చెప్పిన 
నీ మాటలే  గుర్తుకొస్తాయి

నిరంతరం పనిలో నిమగ్నమైన నువ్వు
నాతో మాట్లాడింది తక్కువే
పనులు చెప్పిందీ తక్కువే !

నువ్వు చెప్పిన చిన్న చిన్న పనులు 
నేను చేయనివి 
తరుచూ 
అన్నీ గుర్తుకు వస్తూనే వుంటాయి 

ఆ గోడ మీద నుంచి 
ఒక్కసారి కుర్చీలో కూర్చుని 
ఆ పనులు మళ్ళీ చెప్పకూడదా 
నువ్వు చెప్పకపోయినా  
ఆ పనులన్నీ చేయాలని ఉంది
బాపూ..?
కామెంట్‌లు