సమయస్ఫూర్తి...అచ్యుతుని రాజ్యశ్రీ --


 
 
శ్రీపురంరాజుకి అపురూప వస్తువులు  సేకరించటం ఒక ప్ర వృత్తి.ఎంత  డబ్బు ఐనా సరే చాలా పాతవి ప్రాచీన వస్తువులు కొనేవాడు. ప్రజల కష్ట నష్టాలు  ఆలోచించకుండా  డబ్బు  అలా ఖర్చు చేయటం మంత్రికి నచ్చేది కాదు. ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న  మూడు మట్టి బొమ్మ లు  తెచ్చి "రాజా!ఇవి రెండు వేల ఏళ్ళ క్రితం వి .మీరు ఎంత ఇస్తే  అంతే పుచ్చుకుంటాను."ఆమాటకు రాజు  వెంటనే  రెండు వేల నాణాలు ఇచ్చాడు. రాజు కి బాగా కుచ్చుటోపీ పెట్టాను అని ఆనందిస్తూ  అతను  వెళ్లి పోయాడు.  రాజు  అపురూప  బొమ్మలను శుభ్రంగా

ఉంచే బాధ్యతను  ఒక నౌకరుకి అప్పగించాడు.
రాజు ఇలా హెచ్చరించాడు."ఈబొమ్మలలో ఏ ఒక్కటీ పగిలినా నీతల తీసేస్తాను."ఆనౌకరు భయంతో  రోజూ జాగ్రత్తగా వాటిని శుభ్రంగా తుడిచి భద్రంగా పెట్టేవాడు. భయంతో చేస్తే  ఆపని కానీ  చదువు కానీ  త్వరగా చేతికి అందవు.ఆనందం తో  ఇష్టంతో చేస్తే  ఆపని ఫలిస్తుంది.నమ్మకం కూడా ఉండాలి.
 కానీ ఒక రోజు అతనిచేయి జారి ఒక బొమ్మ  భళ్ళున నేలపైబడి బద్దలైంది.నౌకరు భయంతో గజగజవణికిపోయాడు."ఈవేళ్టితో  నాకు నూకలు చెల్లాయి" అనుకున్నాడు.  రాజు కి ఈవిషయం తెలిసి "వాడిని ఈడ్చుకురండి"అని ఇద్దరు భటులను పంపాడు.మంత్రి కూడా  ఆనౌకరు దగ్గరకు వచ్చాడు. ఆయన సైగతో  నౌకరు కావాలి అనే మిగతా  రెండు బొమ్మలను నేలపై విసిరి బద్దలు కొట్టాడు. భటులు ఇద్దరూ ఆ నౌకరు ని రాజు ముందు నిలబెట్టారు. జరిగిన సంగతి చెప్పారు. కోపంతో రాజు  నౌకరుని తన కత్తితో  నరకబోయాడు.మంత్రి  అడ్డుకుని ఇలా అన్నాడు"ప్రభూ! మట్టి బొమ్మ కోసం మీరు సాటి మనిషి నిండు ప్రాణాన్ని  బలిచేస్తున్నారు.అతని భార్య పిల్లల గతిఏంటి?మీరు ఆరెండు బొమ్మల బాధ్యత ఇంకో నౌకరు కి అప్ప చెప్తారు.వాడూ చేజారి పగలకొడితే అతనిని కూడా మీరు  చంపుతారుకదా?అందుకే తనే బొమ్మలను పగలగొట్టి ఇంకో నౌకరు ప్రాణం కాపాడాడు.మనిషి కన్నా  మీకు  బొమ్మ ఎక్కువనా రాజా!బొమ్మ పగిలితే ఇంకో బొమ్మ ను తయారు చేయవచ్చు. కానీ మనిషిని తిరిగి బతికించగలరా?"అప్పుడుగానీ రాజుకి  జ్ఞానోదయం కాలేదు.తను ఎంత మూర్ఖుడు?విచ్చలవిడిగా ధనం సరదాలకోసం చరిత్రలో నిలచిపోవాలని జనాలను ఉసురు పెట్టాడు?అప్పటినుంచి   ప్రజోపయోగమైన పనులు చేయసాగాడు.మంత్రి అంటే రాజు కన్నా  సమర్ధుడుగా ఉండాలి. అప్పుడే రాజ్యం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.
కామెంట్‌లు