వీరమతి...అచ్యుతుని రాజ్యశ్రీ

 దేవగిరి రాజ్య ప్రధాన సేనాపతికూతురు వీరమతిలో దేశభక్తి  అణువణువునా పొంగి పొర్లేది.యవనులు దేవగిరి పై దాడిచేసినపుడు తండ్రి  అసువులు  బాయటంతో ఆమె అనాధగా మిగిలింది.
బాల్యంలోనే  తల్లిని పోగొట్టుకున్న  ఆపిల్లని  రాజైన రామదేవుడు సాకాడు. రాకుమార్తె  గౌరీదేవి తో సమంగా వీరమతి అందరి ప్రేమ ఆప్యాయతలు పొందేది.కూతురి పెళ్ళితో బాటు వీరమతి ని  మరాఠా సర్దార్ కృష్ణారావుతో జరిపించాడు రాజు. ఎంతో ఘనంగా తన ఉదారతను చాటాడు. అల్లాఉద్దీన్  దేవగిరి పై ఎన్నో సార్లు దాడి చేశాడు కానీ గెలవలేదు.
కూటనీతిని ప్రదర్శించే  అల్లాఉద్దీన్  కృష్ణా రావుని లొంగదీసుకున్నాడు. వాడిపీడ వదిలిందని దేవగిరి రాజ్యం సంబరాల్లో  మునిగి తేలుతుండగా దేవగిరి ని చుట్టుముట్టారు శత్రువులు. రామదేవుడు  తన సేనాపతులతో చర్చించి  అల్లాఉద్దీన్ ఆనుపానులన్నీ  కనుక్కోమన్నాడు.కుటిలుడు అల్లాఉద్దీన్ తో లాలూచీ పడిన కృష్ణారావు  "నేను వెళ్తాను"అని లేచాడు.అతనికి ఎప్పటినుంచో గద్దె నెక్కాలని ఆశ!భర్త మనస్తత్వం గ్రహించిన  వీరమతి  అతన్ని సందేహించింది. అందుకే పురుష వేషంలో గుర్రంపై  అతన్ని అనుసరించింది.ఒక  దట్టమైన అడవిలో  భర్త  అపరిచితుడితో మాట్లాడటం చాటుగా వింది."నీవు మాకు సాయంచేస్తే నీవే దేవగిరి కి రాజువి" అని శత్రువు అనటంతో తెల్లబోయింది.అంతే చిరుతపులి లా అతని పై ఎగిరి  కత్తి తో పొడిచి చంపేసింది.ఎవరిని అనుకున్నారు?తన భర్త కృష్ణారావు ని!! దానితో దిగ్భ్రమచెందిన గూఢచారి పఠాన్ పలాయనం చిత్తగించాడు."కృష్ణారావు!నీవు దేశద్రోహివి నమ్మకద్రోహివికాకుండా కాపాడాను.తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే పెట్టిన చేతిని కరిచే దుర్మార్గుని నా భర్త గా అంగీకరించలేను.అందుకే నిన్ను ముందు కడతేర్చాను.నేనూ నీవెంటే వస్తున్నా. "అని ఆకత్తి తోటే తనను పొడుచుకుని అమరురాలైంది.దేశభక్తి కర్తవ్యం ముందు  బంధుత్వం బలాదూర్ అని నిరూపించింది  ధీర వీరమతి. కేవలం రక్షణ దళాలు మాత్రమే కాదు వారి కుటుంబాలు కూడా నీతి నిజాయితీగా ఉండాలి. అన్ని కాలాల్లో దేశం  సురక్షితం గా ఉంటేనే మనం సుఖసంతోషాలతో ఉండగలం. కాబట్టి బాల్యం నించి ఇలాంటి కథలు పిల్లలు చదవాలి .పెద్దలు చెప్పాలి.
కామెంట్‌లు