ఇది ఎండాకలమే కాదు, పరిక్షల కాలం కూడా. ఎండా కాలంలో వాతావరణమంతా వేడేక్కినట్లే, విద్యార్థుల మెదళ్ళు కూడా చదువులతో వేడెక్కుతాయి. స్కూలులో, ఇంట్లో ట్యుషన్లలో ఎక్కడా చూసినా చదువే. ఎవరి నోటవిన్నా పరిక్షలే. ఏ ఇద్దరూ పలకరించుకున్నా మొదట చదువే. పరిక్షలు, వారి భవిష్యత్తు విషయమే చర్చ. అయితే ఎంతగా పరిక్షలు రాస్తున్నా మధ్య మధ్యలో రిలాక్సేషన్ అవసరం. ఆ రిలాక్సేషన్ లోనే మొద్దుబారిన మెదడు, తిరిగి నూతన శక్తిని పొంది ఉత్తేజిత మవుతుంది.
చాలామంది తల్లిదండ్రులు పరిక్షలనగానే పిల్లల్ని ఎటూ కదలనీయ కుండా, ఎవరితో మాట్లాడనీయకుండా, టి.వి చుడనీయకుండా చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని కనిపించినా అందులోని విషయాలు బుర్రకెక్కవు. ‘చదువుకో... చదువుకో..’ అని వారిని వదిలేయకుండా, తల్లిదండ్రులు కూడా సరదాగా వారితో కూర్చొని పరిక్షల విషయాలపట్ల చర్చిస్తుండాలి. వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. చిన్న పిల్లలైతే వారు చదివినవన్ని అప్పచెప్పించుకోవాలి. సరిగా చెప్పినప్పుడు మెచ్చుకోలుగా ‘వెరీగుడ్’ అనో, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడమో చేస్తే పిల్లల్లో ఎంతో ఆత్మస్తైర్యం పెరుగుతుంది.
ముఖ్యంగా కామన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం స్టడీ అవర్స్, టూషన్స్ అంటూ స్కూళ్ళకు, ట్యుషన్లకు పరుగెడుతుంటారు. ఆ హడావిడిలో పిల్లలు సరైన ఆహారం తీసుకోరు. తల్లిదండ్రులు ఈ విషయంలో తగు జాగ్రత్త వహించి పిల్లలు మంచి పౌష్టికాహారం తీసుకునేలా జాగ్రత్త పడాలి. శక్తి ఉంటేనే ఎంతైనా చదువగలుగుతారు. ఆహారంతో పాటు నిద్రకూడా చాల అవసరం. ఎంత పరిక్షలైన శరీరానికి కావలసినంత నిద్ర అవసరం. నిర్ణిత సమయం వరకు చదివించి ఆ తరువాత మనసంతా తేలికయ్యేలా తల్లిదండ్రులు మంచి జోక్స్ చెప్పి నవ్వించడమో లేదా వారికి నచ్చిన విధంగా ఒక అరగంట గడపనిచ్చి అప్పుడు నిద్రపోనివ్వాలి. ఇలా చేయడం మూలంగా నిద్ర చక్కగా పడుతుంది. తెల్లవారి లేచేసరికి మనసు ప్రశాంతంగా తయారవుతుంది. స్కూళ్ళలో చాప్టర్ వైజ్ గా, తర్వాత సగం సిలబస్ తోనూ, ఆ తర్వాత పూర్తి సిలబస్ తోనూ రివిజన్ టెస్టులు జరుగుతుంటాయి. వీటన్నిటి తర్వాత మరల ప్రీ ఫైనల్ పరీక్షలు. ఈ పరిక్షలన్నింటితో పిల్లలు అలిసిపోయి, అసలు పరిక్షలు వచ్చేసరికి నీరస పడుతారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే స్కూళ్ళన్నీ రివిజన్ టెస్టులు నిర్వహించడంలోనే శ్రద్ధ చూపెడుతున్నాయి.
పరిక్షలు నిర్వహించడంతో పాటు ఆయా టెస్టు పేపర్లలో ఉండే ముఖ్యమైన పాయింట్ల గురించి డిస్కస్ చేయాలి. ఒక ప్రశ్నకు సమాధానం ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఎలాంటి తప్పులు చేస్తే ఎన్ని మార్కులు కట్ అవుతాయో పిల్లలకు వివరించాలి. ఒక్కొక్కసారి చిన్న జవాబు ఉన్నవాటిని పెద్ద ప్రశ్నలలోనూ, పెద్ద జవాబు ఉన్నా వాటిని చిన్న ప్రశ్నలలోను అడుగుతుంటారు. అలాంటప్పుడు మార్కులకు అనుగుణంగా విద్యార్థులు జవాబులో వాక్యాలకు పెంచుకోవడం, తగ్గించికోవడం చేసేలా నేర్పించాలి. మొదటి సారిగా ఏడవ తరగతి కామన్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు కామన్ ఎగ్జామ్స్ పట్ల ఉండే భయాన్ని పోగొట్టాలి. ఈ విద్యార్థులు మరీ చిన్న పిల్లలూ కారు, మరీ పెద్ద పిల్లలూ కారు. అందుకే వీరితో సంయమనంతో వ్యవహరించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను పరిక్షలు, మార్కులు అంటూ బెదరగోట్టకుండా చక్కని అవగాహనతో పరిక్షలు రాసేలా ప్రోత్సహించాలి. స్కూళ్ళలో టీచర్లు ఎక్కువ మార్కులు పొందని విద్యార్థులపై చిన్నచూపు చూపడం మంచి పద్ధతి కాదు. వీలైతే వారికి ఏ విధానంలో చెబుతే బాగా మార్కులు సంపాదించేలా పరిక్షలు రాయగలరో ఆలోచించాలి. విద్యార్థులందరి తెలివి తేటలు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. పరిక్షల టెన్షన్ లో ఉన్నా విద్యార్థులను మరింత టెన్షన్ పెట్టకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చక్కని ప్రోత్సాహం అందించాలి. అప్పుడే పరిక్షలంటే భయం తొలగిపోయి ఆ స్థానంలో ఇష్టం పెరుగుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి