ఓ వారం రోజుల క్రితమేమో డా. ఎన్. గోపీగారు చీమలపై ఓ వచన కవిత పంపారు. బాగుంది. అది చదవడానికి కొద్ది రోజుల ముందు తమిళంలో కవి వైరముత్తు రాసిన కవితొకటి చదివాను. అదీ చీమలపైనే. చీమల్ని చురుకుతనానికి సంకేతంగా చెప్పుకోవచ్చనిపిస్తుంది. గోపీగారి కవిత నిడివి చిన్నదే అయినా బాగుంది. అది బహుశా చదివే ఉంటారు. తమిళంలోని వైరముత్తు కవిత సారాంశమూ బాగుంది. తమిళంలోని కొన్ని విషయాలకు నావి కొన్ని ఊహలు జోడించీ ఇది రాశాను.
చీమల గురించీ అంతర్జాలంలో విషయాలు సేకరించి ఇచ్చిన తన కుమారుడు మదన్ కార్కికి కృతజ్ఞతలు చెప్తూ వైరముత్తు ఈ కవిత ప్రారంభించారు.
చీమలూ....చిరుప్రాణుల్లారా....ఊరేగింపు తీస్తున్న చీమల్లారా...పది కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద అవతరించిన చీమల్లారా....మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది....మీతో మాట్లాడాలిని ఉంది. కాస్త సమయం కేటాయిస్తారా? అని కవి అడగ్గా చీమలిలా చెప్పాయి...
"మా నడకను ఆపి కాలాన్ని వృధా చేసుకోడానికి మేమేమీ మనుషులం కాము. ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాతో పాటు నడవండి" అన్నాయి చీమలు ఒక్కటిగా.
"ఒక సెంటీ మీటరంత ఉండే చిరు ప్రాణుల్లారా! మీ ఆకారానికి ఎప్పుడైనా వగచేరా అల్పజీవులమని" కవి ప్రశ్న.
"ఓరీ పేద మనిషీ. మిల్లీమీటరంత కూడా కలత పడలేదు. ఒక చీమ తన బరువుకన్నా యాభై రెట్ల అధిక బరువును మోయగలదు. మరి నువ్వు నీ బరువుకి యాబై రెట్ల అధిక బరువుని మోయగలవా చెప్పు" చీమ సూటిగా ప్రశ్నించింది.
కవి ఏమీ జవాబు చెప్పలేక మరో ప్రశ్న వేశాడు - మీ కాలక్షేపమేమిటీ అని.
జీవితమే కాలక్షేపం. అన్వేషణే ఆట. సాగిపోతుండటమే విశ్రాంతి అంది ఓ చీమ.
అక్కడితో ఆగక "ఆరు నుంచి పది వారాల జీవితకాలంలో విశ్రాంతేమిటీ?" అంది.
ఈపాటి జీవితకాలానికే ఇన్ని పాట్లా? అని కవి ఇంకా మాట పూర్తి చేయకముందే చుమ చెప్పసాగింది....
"మీలాగా మాకు ఒక్క కడుపు లేదు. మాకున్నది రెండు పొట్టలు. తిన్న ఆహారానికో పొట్ట. నిల్వ చేసుకోవడానికి ఇంకొక పొట్ట. అందుకే మాకిన్ని పాట్లు. అయినా మేమేమీ దీనిని కష్టంగా చూడమంది"
మీగురించి మీరే విస్తూ పోయే సంగతులున్నాయా అని కవి ప్రశ్నించగా చీమ చెప్పిందిలా....
"నెమలీకతో కొట్టినా మేము మరణిస్తాం. అయితే మేముగానీ ఏనుగు చెవిలో దూరామో దాని అవస్థ ఇంతా అంతా కాదు. అది తలచుకుంటే మాకంత శక్తి ఉందా అని ఆశ్చర్యమేస్తుంది."
"మీరు ప్రేమ, మీ ద్వేషం...." అనీ కవి ఏదో ప్రశ్నించే లోపు చీమ అందుకుంది...
"బియ్యప్పిండితో వేసే ముగ్గులంటే ఇష్టం. సుద్దముక్కతో వేసే ముగ్గులు గిట్టవు" చెప్పింది చీమ.
నిల్వ చేసుకున్న గింజలు మొలకెత్తుతే ఏం చేస్తారు మీరు అని కవి అడగ్గా వాటిని సేకరించేటప్పుడే అవి మొలకెత్తడానికి వీల్లేకుండా చేసేస్తామంది చీమ.
మీరు మరచిపోలేని సంఘటనంటూ ఏదన్నా ఉందా? అన్న ప్రశ్నకు చీమ చెప్పిందిలా -
"మీ అహింసా పోరాట ఊరేగింపులో మా జాతికి చెందిన వేలాది చీమలు మీ కాళ్ళ కింద నలిగి చనిపోవడాన్ని ఇపపటికే కాదు ఎప్పటికీ జీర్ణించుకోలేమని!"
"సరేగానీ మీకు ఎదురుగా వచ్చే చీమల ముక్కును మీ ముక్కుతో ఎందుకు స్పర్శించుకుంటారు?" అని అడగ్గా చీమ ఇలా చెప్పింది....
"అవి మా కాలనీ చీమలా కాదా అని తెలుసుకోవడానికే అలా ముక్కులతౌ పరస్పరం రాసుకుంటాం. ఒకవేళ మా కాలనీ చీమలే అయితే దారిస్తాం. లేకుంటే డీకొంటాం. ముందుకు పోనివ్వం"
"అన్నట్టు మీకంటూ చెప్పుకోవడానికి ఏదన్నా ఓ కీర్తి ఉందా?" అని అడగ్గా చీమ జవాబిచ్చిందిలా....
"అమెజాన్ అడవుల్లోని సైనిక చీమలు ఎక్కడైనా ఏనుగు చనిపోయి పడి ఉంటే మేము ఆ ఏనుగుని లాగించేస్తాం. మా పొట్టలలో ఏనుగు సమాధులున్నాయనే విషయాన్ని మరచిపోకు ఓ మనిషీ"
"మీరు సాత్వికులే కదా" అని కవి ప్రశ్నించగా చీమ "అబ్బే, నువ్వనుకుంటున్నట్టు మేమేమీ మరీ అంత సాధుస్వభావులం కాము. మాకూ కొన్ని నియమ నిబంధనలున్నాయి. మా మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఏదన్నా కీడు జరిగే అవకాశముంటే ముందుగానే ఒకరికొకరం శబ్దాలు చేసి అప్రమత్తమవుతాం...."
"ఏమిటీ మీరు శబ్దాలు పుట్టిస్తారా?" అని కవి ఆశ్చర్యంగా చూసాడు.
అప్పుడు చీమ "మీ మనుషులు చెవిటివాళ్ళయితే మేమేం చేస్తాం...." అంది.
కవి నేనడిగిన వాటికి ఓపికతో సమాధానాలిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అనగానే చుమలన్నీ కలిసి "మేమూ నీకు ధన్యవాదాలు చెప్తున్నాం. కంటికి కనిపించని కామధేనువు గురించీ, మీరెవరూ చూడని ఆదిశేషుడి గురించీ చెప్పుకునే మీరు ఒకరికొకరు అబద్ధాలతో పలకరించుకుంటూ, మనసులో ఒకటుంచుకుని బయటక మరొకటి మాట్లాడే మీ మానవజాతి తరఫున మమ్మల్ని పలకరించి విషయాలు తెలుసుకున్నందుకు ధన్యులమయ్యాం మేము" అన్నాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి