శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది: :- ఎం. బిందు మాధవి

 "అమ్మాయ్ ఎదురు రామ్మా. అన్నయ్యకి పిల్లని చూట్టానికి వెళుతున్నారు" అన్నారు మంగతాయారు గారు.
"నువ్వ... నీ చాదస్తం బామ్మా! మనుషులు చంద్రమండలానికి వెళ్ళే ఈ రోజుల్లో ఇంకా ఈ నమ్మకాలేంటి" అని విసుక్కుంది సునీత.
"నువ్వు మరీనే! మనిషి చంద్రమండలానికి వెళ్ళినా నిలబడేది నేలమీదే! తినేది ఆ అన్నమే, పీల్చేది ఆ గాలే! అయినా అటూ ఇటూ కాని చదువులు చదువుకున్న మీరు ఇలా ఆలోచిస్తున్నారు కానీ, "ఇస్రో" లో పని చేసే పెద్దాయన...ఎవరూ ఆ:( శివన్ ఆయన కూడా శాటిలైట్స్, రాకెట్స్ నింగిలోకి పంపేటప్పుడు తిరుపతి వెళ్ళి పెద్దాయన్ని దర్శించుకు వస్తాడు తెలుసా? అంత ఖర్చు పెట్టే ప్రాజెక్ట్స్ విజయవంతం అవ్వాలని అంత చదువుకున్న ఆయన ప్రతిసారీ దేవుడికి మొక్కుకుంటారు. విజయవంతం అయ్యాక మళ్ళీ వెళ్ళి మొక్కు చెల్లించుకొస్తారు. మీ అంత సమర్ధత, తెలివితేటలు వారికి లేవనా?" అన్న బామ్మ వాక్ప్రవాహానికి అడ్డం వచ్చి "అబ్బబ్బా ఆపవే బామ్మా నీ ఉపన్యాసం! నడు" అన్నది సునీత నవ్వుతూ.
అమ్మ చెప్పులేసుకుని బామ్మ అనుమతి కోసం చూస్తున్నది. "ఆ:( ఇహ బయలుదేరండి" అన్నది. బామ్మ అంత సేపు ఎందుకు ఆగమన్నదో అక్కడున్న ఎవ్వరికీ అర్ధం కాలేదు.
"పిల్ల బానే ఉంది అత్తయ్యా. చక్కగా నల్లగా బారాటి జడ. కను ముక్కు తీరు బానే ఉంది. అంత పెద్ద చదువులు చదువుకున్నా, పిన్న పెద్ద గౌరవం ఉన్నట్టే అనిపించింది. తనకి కాబోయే వరుడిని తల్లిదండ్రులనే నిర్ణయించమన్నదంటే తెలియట్లా, ఆ అమ్మాయి ఆలోచనలు" అన్నది కాబోయే కోడలు పిల్ల బాగుందన్న తృప్తి మాటల్లోను, మెరుపు కళ్ళల్లోను ప్రతిఫలిస్తూ ఉండగా భాగ్యం.
"బామ్మా ఇదంతా నువ్వు శకునం చూసి పంపినందువల్లేనంటావా" అన్నది కొంటెగా సునీత.
"అలా ఎందుకంటాను కానీ అది కూడా ఒక భాగమే అనుకోవాలి. ఆలస్యమెందుకు రేపు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. మన గురించి కూడా పిల్ల అభిప్రాయం కనుక్కోమను. ఆ అమ్మాయికి మనవాడు ఓకే అయితే త్వరలో ముహూర్తాలు పెట్టించెయ్యరా" అన్నది కొడుకు పాండురంగంతో.
********
మనవడి పెళ్ళిలో కొత్త మనవరాలు వందనతో సందడి చేసిన బామ్మగారు, దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చి "అమ్మాయ్ నీ లాగా డిగ్రీలు చదువుకోకపోయినా, నేను జీవితాన్ని చదివాననుకో. నేను ఏమన్నా చెబితే పెద్దావిడ అనుకుని సర్దుకుపో. మా వాళ్ళు నావన్నీ చాదస్తాలని నవ్వుతారు. మా నమ్మకాలు, అనుభవాలు మావి" అని చెప్పి దోస్తీ చేసేసుకుంది.
"అమ్ముమ్మగారూ ఈ రోజు నాకు ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది. ఆశీర్వదించండి" అని పాదాలకి నమస్కారం పెట్టింది వందన.
"నా తల్లే క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అయినా నీకివ్వకపోతే ఎవరికిస్తారు ప్రమోషన్! భాగ్యం... అమ్మాయికి ఎదురు రా అమ్మా" అన్నారు.
భాగ్యమ్మగారు ఎదురు వచ్చాక, ఒక నిముషం ఆగి బామ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వందనకి బయలుదేరటానికి.
"అమ్ముమ్మగారూ..ఇంటర్వ్యూ బాగా చేశాను. ఫలితాలు వచ్చేవారం చెబుతారు" అన్నది సాయంత్రం ఇంటికి రాగానే!
పది రోజుల్లో వందనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ కూడా ఆ ఊళ్ళోనే ఇచ్చినట్టు తెలిసింది. మనవరాలి బుగ్గలు పుణికి తలచుట్టూ చేత్తోనే తిప్పి దిష్టి తీసింది.
********
ఆ రోజు ఉదయం ఎనిమిదయినా వందన బద్ధకంగా మంచం మీదే దొర్లుతున్నది. కడుపులో తిప్పుతున్నట్టు వికారంగా ఉన్నది. తల బద్దలవుతున్నట్టు నొప్పి!
"ఏరా ఝాము పొద్దెక్కినా అమ్మాయి లేవలేదు. ఆఫీసు లేదా? ఒంట్లో బానే ఉందా" అంటూ బెడ్ రూం లోకి వచ్చిన బామ్మగారికి తల నొప్పితో మూలుగుతున్న వందన కనిపించింది.
"అయ్యో...అయ్యో ఏమయిందమ్మా" అని "భాగ్యం..ఓ సారి ఇలారా. రోజూ పొద్దున్నే లేచే పిల్ల ఇలా నలతగా పడుకుని ఉంటే ఒక్కళ్ళూ పట్టించుకోరేం?" అని హడావుడి చేసి వందనని లేపి ముఖం కడిగించి కాఫీ తాగించే ప్రయత్నం చేస్తుంటే భళ్ళున కక్కేసింది.
"ఒరేయ్ పవనూ అరుంధతికి ఫోన్ చెయ్యి. లక్షణాలు చెప్పి, తీసుకురమ్మంటుందేమో అడుగు" అని అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు.
"బామ్మా అరుంధతి అత్తయ్యకి ఫోన్ చేశాను. నీకు ముత్తవ్వగా ప్రమోషన్ అయ్యుండచ్చు అన్నది. అయినా ఒకసారి తీసుకురమ్మంది" అన్నాడు పవన్.
పవన్, వందన బయలుదేరుతుంటే కోడలిని ఎదురు రమ్మని, వాళ్ళని పంపించాక దేవుడి గదిలోకెళ్ళి "నాయనా దాని కడుపున ఓ కాయ కాస్తే చూసి, ముని మనవడిని ముద్దాడి నీ దగ్గరకి వచ్చేస్తాను. అరుగుదల తగ్గింది. కాళ్ళూ, చేతులు సహకరించటం లేదు. ఓపిక అయిపోయింది. మంచాన పడకుండా తీసుకుపో నాయనా" అని దణ్ణం పెట్టుకుని వచ్చింది.
పవన్, వందన హాస్పిటల్ నించి శుభవార్తతో వచ్చారని కోడలితో దిష్టి తీయిద్దామని వస్తూ ఉండగా, "బామ్మా ఓ సారి ఇలా రా. స్నానానికి నీళ్ళు నింపిన బకెట్ లో బల్లిపడింది. నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి. పాపం పడగానే గిల గిలా తన్నుకున్నది" అని సునీత పిలిచేసరికి గబ గబా అటు అడుగు వెయ్యబోయిన బామ్మగారు తూలి కింద పడ్డారు. తుంటి ఎముక విరిగింది.
"ఏమి ఫరవాలేదు. ముందు పిల్లని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురండి" అని హుందాగా ధైర్యంగా చెబుతున్న బామ్మగారిని ఆశ్చర్యంగా చూస్తూ "బామ్మా శకునం చూసే పంపావు కదా! ఇలా జరిగిందేం" అన్నది ఎప్పుడూ బామ్మని ఆట పట్టించే సునీత నిజాయితీగా.
"మనం చేసుకున్న కర్మ ఫలం మనతోనే ఉంటుంది. దాన్ని కాదనటం ఎవరి వల్ల కాదు. అనుభవ కాలాన్ని ఎవరూ తప్పించలేరు. నా కాలు విరగటానికి కానీ, ఆ బల్లి అలా నీళ్ళల్లో పడి చావటానికి కానీ ఎవరి శకునమూ కారణం కాదు. ఏ టైంలో జరిగేవి ఆ టైం లో మనం మోసుకొచ్చిన కర్మ ఫలాన్ని బట్టి జరుగుతాయి. మనకి మంచి జరిగితే, మన ప్రజ్ఞ అని, చెడు జరిగితే ఎవరో ఎదురొచ్చారు కనుక శకునం బాగాలేదని ఎదుటివారి గురించి అనుకోకూడదనే, బయటికి వెళ్ళేటప్పుడు మన కుటుంబ సభ్యులనే ఎదురు రమ్మనేదాన్ని" అన్నారు మంగతాయారు గారు పెద్దరికంగా.
"మా చిన్నప్పుడు బయటికెళ్ళేటప్పుడు బల్లి చేసే శబ్దం శుభసూచకం అని మా అమ్మ చెబుతూ ఉండేది. నిజమే అనుకునేదాన్ని. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి. బల్లిని చూసి అందరూ భయపడతారు. లేదా దాన్ని జుగుప్సాకరంగా చూస్తారు. బహుశ అందుకే బల్లికి కూడా ఒక గౌరవాన్ని ఆపాదించటానికి పెద్ద వాళ్ళు అలా అంటారేమో అని పెద్దయ్యాక అనిపించేది".
"ఇప్పుడు కూడా మనింట్లో కొన్ని సార్లు బయటికి వెళుతుంటే బల్లి చప్పుడు చెయ్యటం జరుగుతూ ఉండేది. అదీ యాదృచ్ఛికమే! నా చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చి, ఆ చప్పుడు వచ్చాక మిమ్మల్ని బయటికి వెళ్ళమనేదాన్ని."
"ఇవ్వాళ్ళ దేవుడి దగ్గరకి వెళ్ళి మంచాన పడెయ్యకు స్వామీ అని వేడుకున్నాను. బల్లి నీళ్ళల్లో పడి చనిపోవటం, నేను పడి కాలు విరక్కొట్టుకోవటం అనేవి యాదృచ్ఛికమైన కర్మానుభవాలు. చీకటి-వెలుగులనేవి సృష్టిలోనే ఉన్నాయి. ఎవరి జీవితంలో అయినా ఎప్పుడూ ఆనందమే ఉండదు. అప్పుడప్పుడూ పరీక్షా సమయాలూ ఉంటాయి. అంతే" అని తేల్చేశారు మంగతాయారు గారు.
వందనని ఇంట్లో దించి బామ్మని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు పవన్.
స్టీల్ రాడ్ వేసి ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది. వారం రోజుల్లో ఇంటికొచ్చిన బామ్మగారు, వందన చేసిన సేవలతో, ఇంట్లో వారి ఆప్యాయతానురాగలతో, ఫిజియో థెరపిస్ట్ సూచనలతో నెలలోనే చిన్నగా నడవటం మొదలుపెట్టారు.
"అమ్ముమ్మగారూ మీ ముని మనవడి రాక గురించి శకునం మంచిది కాదు అనుకుంటారేమో అని భయపడ్డాను" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న వందనతో "అయ్యో పిచ్చి పిల్లా...అలా ఎప్పుడూ అనుకోవద్దు. వాడిని ఎత్తుకుని ముద్దాడాలని రాసి ఉన్నది కనుకనే, ఇలా చిన్న పరీక్షతో బయట పడ్డాను. మన కర్మ...అది మంచైనా, చెడయినా...అనుభవించటానికి మన చుట్టూ ఉండే వాళ్ళు పని ముట్ల లాంటి వారు. వారి ప్రమేయం ఏమీ ఉండదు."
"మన కర్మ బాగుంటే బతుకుతాం అని ఎవరూ మొండిగా నడిచే రైలుకి, బస్సుకి ఎదురు వెళ్ళరు. అజాగ్రత్తగా వాహనాలు నడపరు! అలాగే నిప్పుతో పని చేసేటప్పుడు, ప్రమాదమైన ఇతర పనులు చేసేటప్పుడు మన వంతు జాగ్రత్త మనం తీసుకుంటాం! అలాంటిదే శకునం చూసుకోవటం కానీ, ముహూర్తం గురించి ఆలోచించుకోవటం కానీ! మానవ ప్రయత్నం సరిగా ఉండి సంకల్పం మంచిదయితే భగవంతుడు మనతోనే ఉంటాడు అని ముందుకెళ్ళాలి. ఏదీ చాదస్తంగా ఆలోచించకూడదు, మనకి జరిగే నష్టానికి ఎదుటివారిని నిందించకూడదు. ఇన్నేళ్ళ జీవితంలో నేను నేర్చుకున్నదిదే" అన్నారు మనవరాలిని గుండెలకి హత్తుకుంటూ.
వయసుతో వచ్చిన అనుభవాల పరిణతితో ఆకాశమంత ఉన్నతంగా కనిపించారు వందనకి మంగ తాయారుగారు.
[సామెతల ఆధారంగా కధలు రాసే ప్రయత్నంలో భాగం ఈ కధ]

కామెంట్‌లు