కృష్ణారావుగారి కానుక అధ్యాత్మ రామాయణం:-- యామిజాల జగదీశ్

 ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ పారాయణ పరిసమాప్తి పురస్కరించుకుని పసుమర్తి కృష్ణారావుగారు శ్రీసీతారామ పట్టాభిషేకం సందర్భంగా నిర్వహించిన పూజాదికాలలో భాగంగా అందరికీ అధ్యాత్మ రామాయణం (శ్లోక - తాత్పర్య సహితం) పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. గీతాప్రెస్ (గోరఖ్ పూర్) వారు తెలుగు అనువాదంతో వెలువరించిన పుస్తకమిది. మదునూరి వేంకట రామ శర్మగారు ఆంధ్రీకరించారు. 448 పేజీల ఈ పుస్తకం ధర 140 రూపాయలు మాత్రమే. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండలతో కూడిన అధ్యాత్మ రామాయణం నాలుగువేల పైచిలుకు శ్లోకాలున్నాయి. 
రామాయణం శ్రీరామచంద్రుడి దివ్య చరితం మాత్రమే కాదు, శీలవతియైన సీతమ్మ కథకూడా. 
రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి అందించిన ఈ మహత్తర కావ్యంలో మొత్తం 24,000 శ్లోకాలున్నాయి. నేను మొట్టమొదటగా తెలుగు తాత్పర్యంతో చదివినది మా నాన్నగారి రచననే. ఆంధ్రపత్రికలో పద్నాలుగేళ్ళకుపైగా మా నాన్నగారి రచనను ధారావాహికంగా  (వాల్మీకి శ్లోకాలతోపాటు తెలుగు తాత్పర్యాన్ని) ప్రచురించింది. నేను కొంతవరకే చదివాను. మా నాన్నగారు రాస్తున్న రోజుల్లో మద్రాసులోనే ఉన్న నేను కొంత కాలం తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. దాంతో చదివే క్రమానికి ఆటంకం ఏర్పడింది.
బ్రహ్మాండపురాణంలో పార్వతీ పరమేశ్వరుల సంవాదరూపంలో ఉన్నదే అధ్యాత్మ రామాయణంగా మానవాళికి అందిన గొప్ప కానుక. 
తెలుగు నాట వాల్మీకి రామాయణం ఎంతటి ఆదరణ పొందిందో అంతటి ఆదరణ ఈ అధ్యాత్మ రామాయణానికి లభించింది. జానపదుల నోటిలోనూ ఈ రామాయణం నానుతుంటుంది. అధ్యాత్మ రామాయణ తత్త్వం చక్కని కథల రూపంలో పాఠకుల హృదయాలలో నిలిచిపోయింది. 

ఇప్పటికి పదమూడు ముద్రణలకు నోచుకున్న ఈ అధ్యాత్మ రామాయణం రచయిత చెప్పినట్లు కోరిన వారికి కొంగుబంగారమే. పారాయణ విధానం, పారాయణ సమాపన శ్లోకాలు, శ్రీ జానకీ జీవనాష్టకమ్ లతో పాటు హనుమంతుడు చెప్పిన శ్రీ సీతారామ స్తోత్రమ్ కూడా ఈ గ్రంథంలో పొందుపరిచారు.
తెలుగు రాష్ట్రాలలో పెళ్ళి కావలసిన ఆడపిల్లలకు అధ్యాత్మ రామాయణ కీర్తనలు నేర్పించే సంప్రదాయముండేది. ఆడపడుచులు నలుగురు కలిసినా పేరంటాలలోనూ హరికథలలోనూ ఆలయాలలోనూ అధ్యాత్మ రామాయణ కీర్తనల ప్రస్తావించడం మామూలే. 
శ్రీరామ రామ రామేతి 
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే
(పద్మ పురాణంలో ఉత్తర ఖండంలోది) 
మహత్తరమైన ఈ శ్లోకాన్ని రోజు చదివితే ఎంతో మంచిది.  మూడు సార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వేయి మార్లు పలికినంత గొప్ప ఫలితం లభిస్తుందన్నది ఈ శ్లోకార్థం. అంతకుముందే నాకీ శ్లోకం తెలుసుకానీ అర్థం మాత్రం మల్లంధూర్జటిగారివల్ల తెలిసింది. శ్రీ కంచి పరమాచార్యులవారు ఈ శ్లోకం గొప్పతనం గురించి చెప్పిన కథనం ఇటీవల ఓ తమిళ ఆధ్యాత్మిక మాసపత్రికలో చదివాను. 
ఈ భూమండలంమీద ఎన్ని రామాయణాలు వచ్చినా వస్తున్నా ఆదికవి వాల్మీకి రామాయణమే ప్రధానమైంది. 
అటువంటి గొప్ప కావ్యాన్ని కృష్ణారావుగారి దంపతులు పూజ చేసి అందరికీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఓ నాలుగైదు గంటలపాటు ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో హాయిగా గడిచింది. మనసుకి ప్రశాంతత. మంచి విందు ఏర్పాటు చేశారు. 
కృష్ణారావుగారు శ్రీవేంకటేశ్వరస్వామి, షిరిడీ సాయి భక్తులు. అంతేకాదు, నండూరి శ్రీనివాస్, చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలను వింటూ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథలను అప్పుడప్పుడూ నాకు చెప్తుంటారు. కోటప్పకొండ కథనం, కాకాసురుడు కథలను నాకు చెప్పింది ఆయనే. 
కాకాసురుడి వృత్తాంతం రామాయణం లోనిది. అరణ్యకాండంలో జరిగిన ఈ ఉదంతాన్ని వాల్మీకి సుందరకాండలో ప్రస్తావించారు. సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్తుంది. 
సీతారాములు చిత్రకూట పర్వతంపై అరణ్యవాసం జరుపుతున్నప్పుడు ఓ రోజు ఒక కాకి సీతమ్మను ఇబ్బందిపెడుతుంది. దాంతో సీతమ్మ కాకిని కొట్టబోతుంది. అదిచూసి రాముడు నవ్వుతాడు. ఆ తరువాత కాకి వెళ్ళిపోతుంది. కాస్సేపయ్యాక సీతమ్మ రాముడి ఒడిలో నిద్ర పోతుంది. ఇంకొద్ది సమయం తర్వాత సీతమ్మ తల్లి నిద్ర లేచి రాముడిని ఒడిలో పడుకోబెట్టుకొంటుంది. సీతమ్మ రాముడి ఒడిలో నిద్రపోతున్నంతసేపూ రాని కాకి సీత ఒడిలో రాముడు నిద్రకు ఉపక్రమించిన వెంటనే వచ్చి సీతమ్మను గాయపరుస్తుంది. దీంతో సీతమ్మ నుంచి రక్తం కారి రాముడి నుదుటిపై పడుతుంది. రాముడు వెంటనే నిద్ర లేచి ఎవరురా అది అంటూ పక్కనే ఉన్న ఓ దర్భను తీసి అభిమంత్రించి ఆ కాకి మీదికి వేస్తాడు. దాని నుంచి తనను రక్షించమని ఆ కాకి ముల్లోకాలవారిని వేడుకుంటుంది. కానీ రక్షించేవారెవరూ కనిపించరు.
చివరకు చేసేదేమీ లేక ఆ కాకి రాముడి దగ్గరకే వచ్చి వేడుకుంటుంది. 
అప్పుడు రాముడు, సీత శాంతించడం చూసి బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి నువ్వు సమర్పించుకోకతప్పదంటాడు. దాంతో ఆ కాకి తన కుడి కంటిని ఇచ్చుకోవడంతో ఆ కాకికి ఓ చూపు పోతుంది.
ఆ కాకి మరెవరో కాదు, ఇంద్రుడి కుమారుడైన కాకాసురుడు.
ఇక కోటప్పకొండ విషయానికొస్తే,
గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామపరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధే కోటప్పకొండ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేతైన శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. మహాశివరాత్రి రావడంతోనే మన రాష్ట్రంలో ఎక్కువ మందికి గుర్తుకువచ్చే పుణ్యక్షేత్రం ఈ  కోటప్పకొండే. ఇక్కడ శివరాత్రిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడే బ్రహ్మదేవుడికి శివుడు జ్ఞానోపదేశం చేసాడంటారు. కోటప్పకొండను త్రికూటాద్రి, త్రికూట పర్వతం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న మూడు గిరులను బ్రహ్మ కొండ, విష్ణు కొండ, రుద్ర కొండగా కూడా పిలుస్తారు.
ఇక్కడి కొండపై కాకులు వాలని కథేంటో చూద్దాం.
పూర్వం ఓ భక్తురాలు కొండ దిగువన ఉండేది. ఆమె ప్రతిరోజూ కొండపై కొలువై ఉన్న త్రికోటేశ్వర స్వామికి నైవేద్యం తీసుకువెళ్ళేది. 
అలా ఓరోజు ఆమె కుండలో నైవేద్యం తీసుకెళ్తుండగా ఆ నైవేద్యాన్ని కాకులు నేలపాలు చేశాయి. 
దీంతో ఆమెకు కోపం వస్తుంది. ఈ కొండపై కాకులు వాలకుండా ఆమె శపించింది. ఆమె ఆగ్రహానికి గురైన కాకులు అప్పటినుండి ఈ కొండపై వాలడంలేదని ఆలయ చరిత్ర మాట.
అలాగే బాబా మహత్తు, లీలల గురించి కూడా కృష్ణారావుగారెన్నింటినో చెప్పడమే కాకుండా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వస్తున్న "శ్రీ సాయిలీల" పత్రికను ఇస్తూ ఉంటారు చదవడానికి.

కామెంట్‌లు