ధీరోదాత్త భగత్ సింగ్:-- యామిజాల జగదీశ్





 భగత్ సింగ్ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు. సాహస కృత్యాలకూ, విప్లవ చైతన్యానికి మారుపేరు. భగత్ సింగ్ ఉరితీతను నిరసిస్తూ అతని మద్దతుదారులు అమరవీరుడిగా ప్రకటించారు. 

1907 సెప్టెంబరు 28వ తేదీన బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో గల ఖత్కర్  కలాన్ లో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ చిన్నతనం నుంచే ధైర్యంగా మాట్లాడుతూ ఉండేవాడు. దేశభక్తుల చరిత్రలను చదివేవాడు.
భగత్ సింగ్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో అనేక నాటకాలలో నటించేవాడు. రాణాప్రతాప్, సమ్రాట్ చంద్రగుప్త వంటి నాటకాలలో భగత్ సింగు నటనకు ప్రత్యేకించి మంచి ప్రశంసలు లభించాయి.
గురుద్వారా నాంకానా సాహిబ్ లో నిరాయుధులను హతమార్చిన ఘటనను నిరసిస్తూ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాడు. అప్పుడతని వయస్సు పద్నాలుగేళ్ళు.
తనకింట్లో పెళ్ళి చేయాలనుకుంటున్నారని తెలియడంతోనే భగత్ సింగ్ ఓ ఉత్తరం రాసి పెట్టి ఇంట్లోంచి కాన్పూరుకి వెళ్ళిపోయాడు. తన జీవితం దేశానికి అంకితం చేయబోతున్నాను. తనకు మరిదేనిపైనా కోరికలు లేవన్నదే ఆ లేఖలోని సారాంశం
లాలా లజపతిరాయిని హతమార్చడాన్ని నిరసిస్తూ తిరుగుబాటుదారుడిగా మారాడు. భగత్ సింగ్ సుఖ్ దేవ్ తో కలిసి లాహోరులో పోలీస్ సూపరింటెండెంట్ అయిన జేమ్స్ స్కాట్ ని హతమార్చేందుకు  ఆలోచించారు. సుఖ్ దేవ్, రాజ్ గురులు అతనికి అత్యంత సన్నిహితులు. ప్రాణప్రదం. ఎక్కడికెళ్ళినా ఏం చేయాలన్నా వీరు ముగ్గురూ కలిసే ఆలోచించేవారు. ఒక్కటిగా నడిచారు. చివరికి ముగ్గురూ ఉరిశిక్షకు గురయ్యారు. 
అయితే ఈ కుట్రలో పొరపాటున అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ సౌండర్స్ ని హతమార్చారు. 
జన్మతః సిఖ్ఖుల కుటుంబంలో పుట్టినప్పటికీ భగత్ సింగ్ గడ్డం తీసేసాడు. జుత్తు కత్తిరించేసుకున్నాడు తననెవరూ గుర్తించకూడదని. పోలీసులకు చిక్కకుండా లాహోరు నుంచి కలకత్తాకు తప్పించుకుని పారిపోయాడు భగత్ సింగ్. 
భగత్ సింగుకి పుస్తకాలంటే ప్రాణం. చార్లెస్ డికెన్స్, లెనిన్, మాక్సిం గోర్కీ, కార్ల్ మార్క్స్, లియో టాల్ స్టాయ్ రచనలంటే మహా ఇష్టం.
సోషలిజం సిద్ధాంతాలు భగత్ సింగుని ప్రభావితం చేశాయి. 
ఎంతగా చదివేవాడో అంత రాసేవాడు భగత్ సింగ్. పలు పత్రికలకు వ్యాసాలు రాశాడు.
జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ నాలుగు పుస్తకాలు రాశాడు. అలాగే రోజూ డైరీ రాసే అలవాటుండేది. 
జలియన్ వాలా బాగ్ ఊచకోత రోజున  భగత్ సింగ్ స్కూల్ నుంచీ వస్తూ వస్తూ రక్తంతో తడిసిన మట్టి ముద్దను ఓ సీసాలో ఇంటికి తీసుకొచ్చి రోజూ దానికి నమస్కరించేవాడు. అప్పుడతని వయస్సు 12 ఏళ్ళు.
కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే భగత్ సింగ్ నవ్ జవాన్ భారత్ సభలో సభ్యుడిగా చేరాడు. 
భగత్ సింగుకి ఆరు భాషలు వచ్చును. హిందీతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, పోలిష్, స్వీడిష్ భాషలపై పట్టుంది.
ఈ ఆరు భాషల్లోనూ అనర్ఘళంగా మాట్లాడేవాడు.
బతికినంత కాలం ఆనందంగా బతకాలన్నది భగత్ సింగ్ కల. అయితే అందుకు అడ్డంకిగా ఉండిన ఆంగ్లేయులను భరతగడ్డ నుంచీ తరిమికొట్టాలనే పోరాటానికి తనను అంకితం చేసుకున్నాడు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఇంక్వి లాబ్ జిందాబాద్ అనేది ప్రముఖ నినాదం. ఇది భగత్ సింగ్ నినాదం.
రెండవసారి అరెస్టయి మరణం ఖాయమని తెలిసిన తర్వాత భగత్ సింగ్ జైల్లో డైరీ రాయడం మొదలుపెట్టారు. ఆ డైరీల్లో తన ఇష్టాలను, ప్రణాళికలను ఎన్నో రాశారు. అలాగే జైల్లో ఉన్నప్పుడే నేనెందుకు నాస్తికుడిని అనే పుస్తకాన్ని రాశాడు. అతను చనిపోయిన తర్వాత ఈ పుస్తకం అచ్చయింది.
చిన్నతనంలో ఆధ్యాత్మికతపట్ల ఎక్కువ మక్కువ చూపించిన భగత్ సింగ్ తర్వాతి రోజుల్లో నాస్తికుడిగా మారాడు. లెనిన్, మార్క్స్ వంటి ప్రముఖుల రచనలను చదివాకే ఆయన నాస్తికుడిగా మారినట్టు చెప్తారు.
హింసంటే అస్సలు ఇష్టం లేని భగత్ సింగుని పరిస్థితులు దాడులకు ఉసిగొల్పాయి.  హింసవల్ల ప్రాణాలు పోతాయి కనుక దానికి దూరంగా ఉండాలనుకునేవాడు. అందుకే జాతీయ శాసనసభపై విసిరిన బాంబులను కూడా తక్కువ నాణ్యత ఉన్నవే తయారు చేయించాడు. ఈ దాడి అనంతరం భగత్ సింగు లొంగిపోయాడు. 
1931 మార్చి 23 వ తేదీన భగత్ సింగుతో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను లాహోరు జైలులో ఉరితీశారు. ఉరి తీయడానికి నాలుగు రోజుల ముందు క్షమాభిక్ష ముసాయిదా పత్రంపై సంతకం చేస్తే విడిచిపెడతామని చెప్పినప్పుడు దేశానికి తన జీవితాన్ని అంకితం చేస్తానంటూ సంతకం చేసేందుకు నిరాకరించిడు. జైలులో తగిన వసతులు కల్పించడం లేదని నిరాహారదీక్ష కూడా చేసాడు.
భగత్ సింగ్ చివరి మాటలు...
"మీరు నా ప్రాణం మాత్రమే తీయగలరు. కానీ నా భావాలను కాదు. మీరు నా శరీరాన్ని తగలబెట్టగలరు కానీ నా ఆత్మను కాదు"
పరిస్థితుల దృష్ట్యా  తీవ్రవాదిలా నటిస్తున్నా, నిజానికి తాను తీవ్రవాదిని కాననేవాడు భగత్ సింగ్.  బాంబుదాడుల ఉద్దేశం ప్రజలను బలితీసుకోవడం కాదని, బ్రిటీష్ వారి దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడమేనని చెప్పిన భగత్ సింగ్ ప్రతి మనిషి ఆత్మశోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు. ఆయన అభిమయమంతా దేశానికి సేవ చేయడమే.  విప్లవం మానవజాతికి తిరుగులేని హక్కని, స్వేచ్ఛ అనేది అందరికీ జన్మ హక్కని చెప్తుండేవాడు. ఏదేమైనా భగత్ సింగ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.


కామెంట్‌లు