రాజా రవివర్మ పెయింటింగ్స్:-- యామిజాల జగదీశ్













 కలకాలం అందరూ చెప్పుకునేలా అపూర్వమైన పెయింటింగ్స్ సృష్టికర్త రాజారవివర్మ  1848 ఏప్రిల్ 29న కేరళ రాష్ట్రంలో తిరువాన్కూర్ సంస్థాన పరిధిలోని కిళిమానూరులో జన్మించారు. 
బాల్యంలోనే కథకళిలోనూ సంగీతంలోనూ శిక్షణ పొందిన రవివర్మ బొమ్మలు గీయడం తమ బంధువు వద్ద నేర్చుకున్నారు. ఏడో ఏట నుంచే ఆయన రోజూ గోడలపైన బొమ్మలు గీస్తూ వచ్చారు.
తిరువనంతపురం సంస్థాన చిత్రకారుడు రామస్వామి నాయుడు దగ్గర తైలవర్ణ చిత్రాలు గీయడంలో తొమ్మిదేళ్ళపాటు శిక్షణ పొందారు.
చెక్కల నుంచీ పువ్వుల నుంచీ మట్టి నుంచీ బొమ్మలు గీయడానికి కావలసిన వర్ణాలను తయారు చేసుకున్నారు.
 
యూరోపియన్ల చిత్రలేఖనం గురించీ తెలుసుకోవాలనుకున్నారు. 1868లో సంస్థానానికి వచ్చిన విదేశ చిత్రకారుడు థియోడర్ జెన్సన్ కళాసృష్టిని దగ్గరుండీ గమనించిన రవివర్మ బొమ్మలు గీయడంలోని మెళకువలను గ్రహించారు.
పద్దెనిమిదో ఏట రవివర్మకు పన్నెండేళ్ళ భగీరథి బాయితో పెళ్ళయింది. భాగీరథి  రాజవంశానికి చెందినవారు. రవివర్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. ముగ్గురు కుమార్తెలు.
1870 - 1880 సంవత్సరాల మధ్య రవివర్మ అపూర్వమైన పెయింటింగ్స్ ని సృష్టించారు. నలుగురూ పది కాలాలపాటు చెప్పుకునే పెయింటింగ్స్ వేశారు.
1873లో వియన్నా ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆయన వేసిన పెయింటింగుకి ప్రథమ బహుమతి లభించింది.
హంసతో సంభాషించే దమయంతి, యశోదాకృష్ణులు వంటి పెయింటింగ్స్ ఆయన సృష్టిలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. 
ఆయన సృష్టించిన పెయింటింగ్సుకి విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.
భారతదేశంలోనే కాక అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలోనూ ఆయన పెయింటింగ్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. అందుకు సాక్ష్యం ఆయనకు లభించిన అవార్డులూ రివార్డులే.
తన రూపాన్ని ఎంతో గోప్పగా చిత్రించినందుకుగాను తిరువాన్కూర్ మహారాజా ఆయనను ఘనంగా సత్కరించారు.
భారతీయ చిత్రకారులలో వర్మ వాటర్ కలర్స్ తో కాకుండా ఆయిల్ పెయింట్ తో బొమ్మలు వేసిన తొలి చిత్రకారుడిగా చరిత్ర పుటలకెక్కారు.
1894లో ఆయన లిథో గ్రాఫిక్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు.
1904లో బ్రిటీష్ రాజు తరఫున్ లార్డ్ కర్జన్ కూడా రవివర్మకు కైజర్ - ఐ - హింద్ స్వర్ణపతకం ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ అనేకానేక ఉత్తరాలు వస్తుండటంతో కిళిమానూరులో ఆయనకోసం ప్రత్యేకించి ఓ పోస్టాఫీస్ ప్రొరంభించడం విశేషం.
ఆయన పెయింటింగ్స్ ని ఇళ్ళల్లో ప్రదర్శించడాన్ని ఓ హోదాగా భావించిన వారున్నారు. గొప్పగా చెప్పుకునేవారు. అదొక అంతస్తనుకునే వారు.
దేశమంతా పర్యటించిన ఆయన తమ కల్పనాశక్తిని పెంచుకుని గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేయగలిగారు.
వాటిలో కొన్ని - నలదమయంతి, శంతను మహారాజు - మత్స్య కన్య సత్యవతి, రాధాకృష్ణులు, దేవకీ కృష్ణులు, సుభద్రార్జునులు, ద్రౌపది వంటి పెయిం
టింగ్స్.
తొలిరోజుల్లో మళయాలభాష మాత్రమే వచ్చిన రవివర్మ తర్వాతికాలంలో హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్, జర్మన్ వంటి భాషలూ నేర్చుకున్నారు. 
ఆయన వేసిన యశోదాకృష్ణుడి పెయింటింగ్ 2002లో యాభై ఆరు లక్షల రూపాయల ధర పలికింది.
ఆయన పెయింటింగ్సుకున్న ఆదరణను తెలిసి బరోడా దివాన్ మాధవరావ్ సూచన మేరకు లితోగ్రాఫ్ ప్రెస్ ఏర్పాటైంది. ఈ ప్రెస్సులో ముద్రింపబడిన ఆయన పెయింటింగ్స్ ప్రపంచ దేశాలకు పంపిణీ అయింది. అంతేకాదు అంతగా డబ్బులు ఖర్చు చేయలేనివారుకూడా ఆయన పెయింటింగ్స్ ని కొనుక్కునే వీలు కలిగింది.
  
అంతేకాదు, మన భారత దేశంలో క్యాలండర్ చిత్రాలు, చిత్రకళలు వ్యాప్తి చెందడానికి ఆయన పెయింటింగ్సే.
అటువంటి చిత్రకళా మేధావి రాజా రవివర్మ తన యాభై ఎనిమిదో ఏట 1906లో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన పెయింటింగ్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాయి. ఉంటాయనడం అతిశయోక్తి కాదు.
ఆధునిక భారతీయ చిత్రకళకు పితామహుడైన రవివర్మ తన జీవితకాలంలో మొత్తం మీద ఏడు వేల పెయింటింగ్స్ వేశారని అంచనా.
న్యూయార్క్‌లోని సోథిబే ఆక్షన్‌ హౌస్‌లో దక్షిణాసియాకు చెందిన ఆధునిక, సమకాలీన కళల చిత్రపటాలు వేలానికి ఉంచారు. ఇందులో రాజా రవివర్మ గీసిన దమయంతి చిత్రం రూ.11.09 కోట్లు పలికింది. దీనికి దాదాపు రూ.4.58 కోట్లు వస్తాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారట. కానీ వూహించని విధంగా రెట్టింపు ధర పలికిందని వారన్నారు. నలదమయంతి నాటకంలోని ఓ సన్నివేశాన్ని తీసుకుని రవివర్మ ఈ దమయంతి చిత్రాన్ని గీశారు. 20వ శతాబ్దానికి చెందిన రవివర్మను 1979లో  భారత ప్రభుత్వం జాతీయ నిధిగా అభివర్ణించింది.

కామెంట్‌లు