ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం

 నేను బడిల 
సదువుకునే టప్పుడు
నెలకు ,మూడు నెలలకు,
ఆరు నెలలకు,యాడాదికి
పరీచ్చలు ఉండేటివి
సార్లు ఇంగిలీసు, ఇందీ 
ఇమ్ల రాయించేటోల్లు
చూచి రాత రాత్తె 
రాయంగ రాయంగ
రాత మంచిగ కుదురుతదని
చూచి రాత గుడ 
రాపిచ్చేటోల్లు.
5,6 వట్టినంక b
ఇంగిలీసు, ఇంది,
ఇమ్ల రాయించే టోల్లు.
సరిగా రాయక పోతే
బరిగెతో కొట్టే టోల్లు 
8,9 తరగతలల్ల
క్లాస్ ఉన్నోల్ల తోనే 
చెంప దెబ్బలు గుడ 
కొట్టిచ్చేటోల్లు.
ఇగ తెలుగు సెప్పె లచ్చుమయ్య సారైతే
కొట్టకుండా
మొకానికి చాక్ పీస్ తోని
నామాలు వెట్టె టోడు
లెక్కలు సరిగ సెయ్యక పోతే
లచ్చుమ రెడ్డి సారైతె
సింత బరిగె తో గాని
లొట్ట కట్టెతో గాని
తిట్టుకుంట సేతుల మీద,
ఈపు మీద,పిర్రల మీద 
జోపుడు జోపేటోడు.
 నాకైతే
ఎంత కొట్టినా,ఎంత తిట్టినా
లెక్కలు రాలేదు గని
తెలుగైతే కొద్దిగ అబ్బిందుల్లా!
గట్ల అచ్చిన తెలుగు తోనే
నాలుగు వయిలను,
నాలుగు వందల 
బుచ్చి బుచ్చి సినిమాలను,
నాలుగు వందలకు 
ఎక్కువగనే కతలు,
మూడున్నర వేలకు మించి
కైతలను రాసిన. 
పాటలను రాత్తున్న.
ఇదంతా
తెలుగు మంచిగ సెప్పిన 
లచ్చుమయ్య సారు 
దేవెనార్తే నుల్లా!
గట్లనే  కరిమార్ల ఉన్న
మలయశ్రీ సారు
నేను రాసినయి కైతలే అని 
దైర్నము జెప్పి
ఒక వయిని అచ్చుగొట్టిచ్చిండు.
నన్ను కతలు రాయుమని సెప్పింది జంధ్యం వెంకటేశ్ బాబు సారు
అగో గప్పటి నుంచి
రోజూ ఏదో ఒకటి
రాయందే ఉంట లేను.
ఏదైన రాయక పోతే
ఎట్లనో ఉంటది
ఔ మల్ల!

కామెంట్‌లు