గురువుకు కానుక (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  ఆ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగుతున్నాయి‌. విద్యార్థులు ముందే సేకరించిన పూలతో పూల మాలలు తయారు చేసి, ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. అందరు విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయులు పాండురంగ మాస్టారు అంటే చాలా ఇష్టం. తెలుగు మాస్టారు మాత్రం ఇలాంటి సన్మానానికి దూరంగా ఉన్నారు. సురేంద్ర అనే విద్యార్థి పాండురంగ మాస్టారు వద్దకు చేరి, "చూశారా గురువు గారూ! అమరేంద్ర పూలమాల కాదు కదా కనీసం ఒక్క పువ్వు కూడా తేలేదు." అన్నాడు. సురేంద్రకు ఇతరులపై చాడీలు చెప్పడం అలవాటు. అప్పుడు పాండురంగ మాస్టారు అమరేంద్రను పిలిపించి, "అందరూ పూలతో వాళ్ళ గురువులను సన్మానిస్తే నువ్వు మాత్రం ఎందుకు అలా చేయలేదు?" అని ప్రశ్నించారు. "మీరే కదా గురువు గారూ! సిలబసులో లేకున్నా పుష్ప విలాపం చక్కగా బోధించారు. అందుకే పూలను స్వేచ్ఛగా తల్లి ఒడిలో ఉంచాలని తెంపలేదు." అన్నాడు అమరేంద్ర. "ఇప్పుడు నీ సందేహం తీరిందా సురేంద్ర!" అన్నారు గురువు గారు. సురేంద్ర ముఖం వేలాడేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇతరుల గురించి చాడీలు చెప్పరాదు అని తెలుగు మాస్టారు ఎన్నిసార్లు చెప్పినా సురేంద్రలో మార్పు రావడం లేదు.
        ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో జరుగుతుంది. మధ్య మధ్యలో విద్యార్థులు చక్కగా ఉపన్యాసం ఇస్తున్నారు. ముగ్గురు పిల్లలతో విద్యార్థులు పోటీలు పడుతూ నీతి పద్యాలు రాగయుక్తంగా పాడుతూ వాటి భావాలను చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి కనీసం పది పద్యాలు చెబుతున్నారు. వాళ్ళంతా చదువులో బాగా వెనుకబడిన విద్యార్థినులు. వాళ్ళను తెలివైన విద్యార్థులుగా చేయడానికి తెలుగు మాస్టారు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అలా పద్యాలను చెబుతుంటే గురువు గారు ఆశ్చర్యపోయారు. సన్మాన కార్యక్రమం తర్వాత వాసు అనే విద్యార్థి పాండురంగ మాస్టారు దగ్గరకు చేరి ఇలా అన్నాడు. "చదువు రాని విద్యార్థులు ఇంత చక్కగా పద్యాలు చెబుతుంటే ఆనందం వేసిందా గురువు గారు. ఇదంతా అమరేంద్ర కృషి ఫలితమే. వారం రోజుల నుంచి ఆ విద్యార్థులకు పద్యాలను నేర్పి మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని అనుకున్నాడు. అంతేకాదు. ఇప్పుడు ఆ విద్యార్థులు తప్పులు లేకుండా ఎంత కఠినమైన విషయాన్నైనా చదువగలరు. రాయగలరు. ఇదంతా అమరేంద్ర పుణ్యమే." అని. పాండురంగ మాస్టారు అమరేంద్రను పిలిపించి బాగా ప్రశంసించారు. అక్కడే సురేంద్ర కూడా ఉన్నాడు. "అమరేంద్ర! పనిలో పనిగా సురేంద్రలో ఇతరులను ఓర్వలేని గుణాన్ని మార్చు." అన్నారు గురువు గారు. సురేంద్ర సిగ్గుతో తల దించుకున్నాడు.
కామెంట్‌లు