పుణ్యావతి భాగ్యావతి (అద్భుత జానపద కథ) డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
 ఒకూర్లో ఒక రైతుండేటోడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరి పేరేమో పుణ్యావతి. మరొకరి పేరేమో భాగ్యావతి. వాళ్ళు చానా పేదోళ్ళు. ఒకరోజు సంక్రాంతి పండుగనాడు వాళ్ళిద్దరూ అడవిలో కట్టెపుల్లలు ఏరుకోని ఇంటికి వస్తా వుంటే దారిలో వాళ్ళకి ఒక గుడికాడ కొందరు ఆడవాళ్ళు పేదవాళ్ళందరినీ వరుసగా కూచోబెట్టి అన్నదానం చేస్తా వుండడం కన్పించింది.
అది చూసి పుణ్యావతి ''అకా! అకా! మనం గూడా అట్లా అన్నదానం చేద్దామా'' అనింది. దానికి భాగ్యావతి ''ఎట్లానే?.. మన దగ్గర అంత డబ్బులు యాడున్నాయి'' అనింది. దానికి పుణ్యావతి నవ్వి ''పట్టుదలుండాలే గానీ సాధించలేనిదేముంటాది. వాళ్ళ లెక్క గొప్పగా చేయలేకపోయినా మనకున్న దాంట్లో ఈ సమ్మచ్చరం గాకపోయినా వచ్చే సమ్మచ్చరమన్నా చేద్దాం సరేనా'' అనింది. అక్క గూడా 'సరే' అనింది.
అన్నదానం చేయాలంటే బాగా డబ్బులు కావాల గదా. దాంతో వాళ్ళు ఆ రోజు నుండీ తాము తిన్నా తినకపోయినా ఎంతో కొంత రోజూ దేముని దగ్గరి హుండీలో ఏయసాగినారు. అట్లా రోజులు వారాలై, వారాలు నెలలై నెమ్మదిగా సమ్మచ్చరం దగ్గర పడి మళ్ళా సంక్రాంతి పండుగ వచ్చింది. ఆరోజు వాళ్ళిద్దరూ పొద్దున్నే లేచి చెరువు దగ్గర శుభ్రంగా తలస్నానం చేసి, దేవునికి భక్తిగా మొక్కుకోని హుండీ పగలగొట్టి ఆ డబ్బుతో బచ్చాలకు, పరమాన్నానికి, సాంబారుకి, పప్పుకి కావాల్సినవన్నీ కొనుక్కోనొచ్చి అన్నీ చేసినారు. చేసినాక పేదోళ్ళందరినీ పిల్చుకోనొచ్చి చాలు చాలనేంతవరకు ఇంకొకటి ఇంకొకటి అనుకుంటా కడుపు నిండా పెట్టినారు.
ఆకాశంలో మొగున్తో రథమ్మీద పోతావున్న పార్వతీదేవి ఇది చూసి ''సామీ! సామీ! ఆడ చూడు ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఎంత కష్టపడతావున్నారో. మంచోళ్ళకి మంచి చేయడం, చెడ్డోళ్ళకి చెడు చేయడం ఇదే గదా మన పని. దా పోదాం వాళ్ళకేమన్నా మంచి చేసొద్దాం'' అనింది.
శివుడు ''ముందు వాళ్ళ భక్తి ఎంత గొప్పదో పరిశీలిద్దాం పా'' అని ఇద్దరూ పేద ముసిలోళ్ళ వేషం వేసుకోని కిందకి దిగినారు. అప్పటికే ఆ అక్కాచెల్లెళ్ళు ఇంట్లో వున్నవన్నీ అందరికీ పెట్టేసి వున్న కొంచం అన్నం తలా ఇంత వేసుకోని తినడానికి కూచున్నారు.
అప్పుడు ఆ ముసిలోళ్ళు ఇంటి ముందు నిలబడి ''అమ్మా ఆకలేస్తుందమ్మా... వూర్లో అందరినీ పిల్చి పెడ్తున్నారంట కదమ్మా. మాగ్గూడా కాస్త ఏమన్నా వుంటే పెట్టండమ్మా. ఎవరూ లేని ముసిలోల్లమమ్మా'' అనరచినారు. అప్పటికే అందరికీ అన్నీ పెట్టేసినారు గదా... వాళ్ళు తినడానికి తప్ప ఇంట్లో ఏమీ లేవు. అయినాసరే ఆ అక్కాచెల్లెల్లిద్దరూ కడుపు నిండా వుత్తనీళ్ళు తాగి పళ్ళాల్లో పెట్టుకున్నవి పెట్టుకున్నట్టు మొత్తం తీసుకోనొచ్చి వాళ్ళకు పెట్టేసినారు.
అది చూసి ఆ ముసిలోళ్ళు ''బంగారం లాంటి మనసు మీది'' అని మెచ్చుకోని అన్నీ తిన్నాక మూడు పిడికెళ్ల ఇసక ఇచ్చి ''మేం పోయినాక దేవునికి పూజ చేసి ఒక పిడికిలి మీ ఇంటి మీద, ఒక పిడికిలి మీ పేడదిబ్బ మీద... ఒక పిడికిలి మీ ఇంటి ముందున్న రాళ్ళ మీద చల్లండి'' అని చెప్పి వెళ్ళిపోయినారు.
సరేనని వాళ్ళిద్దరూ దేవుని పూజ చేసి ఆ ఇసక తీసుకోని పోయి ఒక పిడికిలి వాళ్ళ కొట్టం మీద, మరో పిడికిలి వాళ్ళ పేడదిబ్బ మీద, మరో పిడికిలి ఇంటి ముందున్న రాళ్ళ మీద చల్లినారు. అంతే కొట్టం కాస్తా ఏడంతస్తుల మేడైంది. పేడముద్దలు కాస్తా బంగారు ముద్దలైనాయి. రాళ్ళేమో మణులూ, మాణిక్యాలుగా మారిపోయినాయి.
ఇంగ చూడు వాళ్ళ సంబరం సంబరం కాదు. వాళ్ళ నాయన అవన్నీ చూసి మురిసిపోయినాడు. అప్పటినుండీ అవసరమయినప్పుడల్లా ఒక రత్నమో, బంగారు ముద్దనో అమ్ముకుంటా హాయిగా బతకసాగినారు. ప్రతి సమ్మచ్చరం సంక్రాంతి పండగకు మాత్రం వూరు వూరంతా పిలిచి రకరకాల పిండివంటలతో విందుభోజనాలు పెట్టేటోళ్ళు.
అట్లా ఒకొక్క సమ్మచ్చరమే దాటీ దాటీ కొన్నేళ్ళకు ఆ అక్కాచెల్లెల్లిద్దరూ పెరిగి పెద్దగయినారు. వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనముంది గదా. దానికితోడు వాళ్ళిద్దరూ అప్సరసల్లెక్క అందంగా వుంటారు. వాళ్ళ నాయన ఇద్దరు రాకుమారులకు వాళ్ళనిచ్చి వూరందరినీ పిలిచి ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ వేసి ఏడేడు పధ్నాలుగు లోకాలు 'ఆహా' అనేటట్లు పెండ్లి చేసినాడు.
పెండ్లయినాక ఎవరికి వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి పోవాలగదా. వాళ్ళ నాయన అక్కనేమో పడమర దేశానికిస్తే, చెల్లెలినేమో తూర్పు దేశానికి ఇచ్చినాడు. రెండూ చానా దూరం. అందుకని వాళ్ళిద్దరూ గుర్తుగా ఒకరి వుంగరాలు ఇంకొకరు మార్చుకోని కండ్లనీళ్ళు పెట్టుకోని తిరిగి తిరిగి చూసుకుంటా ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయినారు.
అట్లా వెళ్ళిపోయినాక మళ్ళా కొంతకాలానికి సంక్రాంతి పండుగ వచ్చింది. పుణ్యావతి మొగునికి చెప్పి వూర్లో వుండే పేదోళ్ళందరినీ పిలిచి అన్నదానం చేసింది. భాగ్యావతి కూడా అట్లాగే చేద్దామని మొగునికి చెప్పింది. కానీ ఆమె మొగునికి పేదప్రజలంటే అస్సలిష్టం లేదు. దాంతో ''ఛీ!...ఛీ!... ఏందిదంతా... అన్నదానం లేదు, గిన్నదానం లేదు...'' అనరిచినాడు. అప్పటి నుంచీ ఆమె మొగునికి భయపడి అన్నదానమన్నమాటే మరచిపోయింది.
ఒకరోజు పక్కూరి రాజు భాగ్యావతి వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్రకొచ్చినాడు. భాగ్యావతి మొగుడు పెద్ద సైన్యాన్ని తీసుకోని యుద్ధానికి పోయినాడు గానీ వాళ్ళతో పోరాడలేక ఓడిపోయినాడు. శత్రువులకు చిక్కితే చంపుతారు గదా దాంతో ఎవరికీ చిక్కకుండా పారిపోయినాడు. అప్పటికే భాగ్యావతి కడుపుతో వుంది. మొగుడు ఓడిపోయినేది తెల్సుకోని ఆమె గూడా శత్రువులు కోటలోకి రాకముందే రాజ్యమిడిచి పారిపోయి ఎవరి కంటా పడకుండా ఒక చిన్నపల్లెలో దాచిపెట్టుకోనింది.
కొంతకాలానికి ఆమెకు అక్కన్నే ఒక కొడుకు పుట్టినాడు. భాగ్యావతి ఆ ఇంట్లో, ఈ యింట్లో పని చేస్తా కొడుకుని పెంచి పెద్ద చేయసాగింది. అట్లా పదైదేండ్లు గడిచిపోయినాయి.
ఒకరోజు ఆ పిల్లోడు వాళ్ళమ్మతో ''అమా! అమా! నేను పుట్టినప్పటినుండీ చూస్తా వున్నా. మనమొకరింటికి పొయ్యిందీ లేదు, వేరొకరు మనింటికి వచ్చిందీ లేదు. మనకెవరూ బంధువుల్లేరా'' అనడిగినాడు.
దానికి వాళ్ళమ్మ కండ్లనీళ్ళు పెట్టుకోని ''ఎందుకు లేర్రా! మీ నాయన యాడున్నాడో ఏమయిపోయినాడో తెలియదుగానీ నీకో పెద్దమ్మ వుంది. ఈడికి ఏడువందల మైళ్ళ దూరంలో వుండే పడమర దేశానికి ఆమె రాణి'' అని చెప్పింది. దాంతో వాడు ''అమా! అమా! నేను పోయి పెద్దమ్మనోసారి చూసొస్తా'' అన్నాడు. ఆమె సరేనని వాళ్ళు విడిపోయేటప్పుడు మార్చుకున్న వుంగరం కొడుక్కిచ్చి ''రేయ్‌! దీన్ని మీ పెద్దమ్మకు చూపియ్యి, నిన్ను గుర్తుపడ్తాది'' అని చెప్పింది.
సరేనని వాడు వాళ్ళమ్మ చేసిచ్చినేటివన్నీ మూటగట్టుకోని బైలుదేరినాడు. ఏడువందల మైళ్ళంటే చానా దూరంగదా. తింటా నడుస్తా... తింటా నడుస్తా... ఒకొక్క వూరే దాటుకుంటా ఆఖరికి ఒక నెలకల్లా ఆ పడమర దేశానికి చేరుకున్నాడు. చేరుకోని కోట లోపలికి పోతా వుంటే వాని మాసిపోయిన బట్టలు చూసి రాజ సైనికులు లోపలికి పోనియ్యలేదు.
ఎట్లాగబ్బా లోపలికి పోవడం అని బైటే కూచోని ఆలోచిస్తా వుంటే రాణి ఇంట్లో పని చేసే దాసీలు కొందరు నీళ్ళకని సంకలో బిందెలు పెట్టుకోని చెరువుకాడికి పోవడం కనబడింది. వెంటనే వాడు వురుక్కుంటా ఒకామె దగ్గరకి పోయి ''అమా! అమా!... నేను మహారాణి చెల్లెలి కొడుకుని. నన్ను లోపలికి రానియ్యడం లేదు. కాస్త రాణికి చెప్పు'' అన్నాడు. దానికి అందరూ వాని గుడ్డలు చూసి నవ్వుతా ''నువ్వు మా రాణి చెల్లెలి కొడుకువా? మొగం చూడు ఎట్లా వుందో'' అని ఎక్కిరించినారు. వాడు ఎన్ని చెప్పినా నమ్మకపోయేసరికి ఇట్లా కాదనుకోని వాళ్ళమ్మ ఇచ్చిన వుంగరం తీసి ఎవరూ చూడకుండా ఒకామె కడవలో ఏసి గమ్మున కూచున్నాడు.
దాసీలందరూ కడవల్తో నీళ్ళు తీసుకోని పోయి రాణిగారింట్లో బానలో పోస్తా వున్నారు. ఈ వుంగరమేసినామె గూడా అందరిలాగే పోస్తా వుంటే టప్పుమని చప్పుడయ్యింది. ఆ చప్పుడు విని రాణి ''ఏమే! నీళ్ళు తెమ్మంటే నీళ్ళతో బాటు రాళ్ళు గూడా తెస్తున్నావా ఏమి'' అని బానలో చేయి పెట్టి వెదికితే వుంగరం దొరికింది. ఆ వుంగరం ఆమె తన గుర్తుగా చెల్లెలికిచ్చినేది గదా! దాంతో ఆచ్చర్యపోయి ఆ దాసీతో ''ఇది మా చెల్లెలికి నేనిచ్చినేది. నీ కడవలోకి ఎట్లా వచ్చింది'' అనడిగింది. అప్పుడా దాసి జరిగిందంతా చెప్పింది.
రాణి వెంటనే భటులను పిలిచి ఆ పిల్లోన్ని గౌరవంగా లోపలికి పిలుచుకోని రమ్మనింది. రాగానే వానికి బాగా తలస్నానం చేపిచ్చి, ముచ్చటయిన పట్టుబట్టలు కట్టిచ్చి, రకరకాల వంటలతో విందుభోజనం పెట్టి, ప్రేమగా దగ్గర కూచోబెట్టుకోని ''ఏరా! మీ అమ్మా నాయనా బాగున్నారా! నువ్వేంది ఇట్లా ఒక్కనివే ఒంటరిగా వచ్చినావు! ఏం జరిగింది'' అనడిగింది. వాడు జరిగిందంతా చెప్పినాడు. ఆమె ''అయ్యో పాపం'' అని బాధపడింది.
వాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఒక నాలుగు వారాలుండి ''ఇంగ నేను పోయొస్తా పెద్దమ్మా! ఇప్పటికే ఇల్లు విడిచి చానా రోజులయింది'' అన్నాడు. ఆమె సరేనని లోపలికి పోయి ఒక పెద్ద సొరకాయ తీసుకోనొచ్చి లోపలున్న గుజ్జంతా తీసేసి దాన్నిండా బంగారు వరహాలు పెట్టి ''రేయ్‌! జాగ్రత్త. ఇది యాడా పోగొట్టుకోకుండా ఇంటికి తీసుకోని పోయి మీ అమ్మకియ్యి'' అని చెప్పింది.
''సరే'' అని వాడు సొరకాయ తీసుకోని పోతా వుంటే అడవిలో ఒకరోజు ఒక పెద్ద దొంగల గుంపు ఎదురయింది. వాళ్ళు మీద పడి వాన్నంతా వెదికి ఏం దొరకక పోయేసరికి సొరకాయ గుంజుకోని పంపిచ్చినారు.
వాడు కండ్లనీళ్ళు పెట్టుకోని తిరిగి పెద్దమ్మ ఇంటికాడికొచ్చి జరిగిందంతా చెప్పినాడు. ఆమె ''సర్లే! పోయిందేదో పోయింది. ఏడ్చొద్దు'' అని చెప్పి తరువాత రోజు ఒక రాగి చెంబు నిండా వజ్రాలు, రత్నాలు పోసి ఎవరికీ కనబడకుండా పైన బట్టకట్టి ''ఇదిగో ఈ చెంబు తీసుకోని పోయి మీ అమ్మకియ్యి'' అని చెప్పింది.
''సరే'' అని వాడు ఆ చెంబు తీసుకోని పోతావుంటే దారిలో వానికి బాగా దాహమయింది. దాంతో ఒక బావి మీద చెంబు పెట్టి నీళ్ళు తోడుకుంటా వుంటే పొరపాటున చేయి తగిలి అది లటుక్కున బావిలో పడిపోయింది. దాని కోసం వాడు బావిలోకి దిగి ఎంత వెదికినా అది దొరకలేదు. దాంతో వాడు కండ్లనీళ్ళు పెట్టుకోని తిరిగి పెద్దమ్మ ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పినాడు.
దానికామె ఆచ్చర్యపోయి ''ఇదేందబ్బా! వీళ్ళకు ఎంత మేలు చేద్దామనుకున్నా దరిద్రం ఇట్లా పట్టుకోనింది'' అని ఆచ్చర్యపోయి ''సర్లే నాయనా రేపు సంక్రాంతి పండగ. పండగ ఈన్నే చేసుకోని మర్నాడు పోదువులే'' అనింది. వాళ్ళింట్లో పండగలూ, పబ్బాలూ ఏమీ చేయరుగదా. దాంతో వాడు ఆచ్చర్యంగా ''అదేం పండగ పెద్దమ్మా... మా యింట్లో ఎప్పుడూ చెయ్యలేదే'' అన్నాడు.
దాంతో ఆమె ''ఓహో! ఇందుకా వీళ్ళిట్లా నాశనమైపోయింది'' అనుకోని తర్వాతిరోజు వాన్తోనే వూర్లో వాళ్ళందరికీ అన్నదానం చేపిచ్చి ''రేయ్‌! నువ్వు పోయి మీ అమ్మతో ఏది చేసినా చేయకపోయినా సంక్రాంతి పండగకు పేదోళ్ళకు అన్నదానం చేయడం మాత్రం మరచిపోవద్దని చెప్పు'' అనింది. ''సరే'' అని వాడు తిరిగి బైలుదేరినాడు.
అట్లా అడవిలో పోతా పోతా వుంటే నడిచీ నడిచీ వానికి బాగా దాహమైంది. ఇంతకు ముందు చెంబు పోగొట్టుకున్న బావి కనబడింది. నీళ్ళు తాగుదామని బకీట లోపలికేసినాడు. తీసి చూస్తే ఇంగేముంది నీళ్ళతోబాటు అంతకు ముందు పడిపోయిన వజ్రాలున్న రాగి చెంబు కూడా అందులో కనబడింది.
వాడు సంబరంగా నీళ్ళు తాగి దాన్ని తీస్కోని పోతా వుంటే దారి మధ్యలో దొంగల గుంపు మళ్ళా ఎదురయ్యింది. వాళ్ళు వాన్ని పట్టుకోని చేతిలోని చెంబు గుంజుకుంటా వుంటే అప్పుడే అటువైపు వేటకొచ్చిన ఆ వూరి సైనికులు చూసి దొంగల మీద పడి వాళ్ళను మెత్తగా తన్ని చెంబుతో పాటు వాళ్ళ దగ్గరున్న సొరకాయ కూడా తిరిగిచ్చినారు.
వాడు అవన్నీ తీస్కోని ఇంటికొచ్చి ''అమా! అమా! మన కష్టాలన్నిటికీ కారణం మనం సంక్రాంతి పండగకు పేదోళ్ళకి అన్నదానం చేయకపోవడమేనంట. పెద్దమ్మ చెప్పింది'' అని చెప్పినాడు.
ఆమె అక్క పంపిన బంగారమంతా అట్లనే పక్కకు పెట్టి ఆరోజు నుండీ తిన్నా తినకపోయినా ఎంతో కొంత దాచిపెట్ట సాగింది. అట్లా సమ్మచ్చరం కాగానే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పేదోళ్ళందరికీ అన్నదానం చేసి, అక్క పంపిన బంగారం గూడా వాళ్ళకే ఇచ్చేసింది. అట్లా ఒకొక్కరికీ అన్నం పెడ్తా పోతా వుంటే ఒకచోట ఒకడు మూలుగుతా జ్వరంతో ఒణుకుతా కిందపడి కనబన్నాడు.
''ఎవరబ్బా పాపం అట్లా వణుకుతా వున్నాడు'' అని దగ్గరికి పోయి చూస్తే ఇంకేముంది... ఆమె మొగుడే... పారిపోయినప్పట్నించీ పెండ్లాం పిల్లలు యాడున్నారో తెలియక ఒకొక్క వూరే వెదుక్కుంటా ఆఖరికి ఇక్కడికి వచ్చినాడు. ఏదేమయితేనేం అట్లా ఆ రోజు మళ్ళా అందరూ కలుసుకున్నారు.
ఆమె వెంటనే మొగున్ని, కొడుకుని తీస్కోని అక్క దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పింది. అప్పుడామె ఆమె మొగునికి చెప్పి చెల్లెలి మొగునికి పెద్ద సైన్యాన్నిచ్చి యుద్ధానికి పంపిచ్చింది. యుద్ధంలో వాళ్ళు శత్రువులను చంపి మళ్ళా తమ రాజ్యాన్ని తాము సంపాదించుకున్నారు. 
అప్పటి నుండి ప్రతి సంక్రాంతికి దేశంలో వున్న పేదలందరికీ అన్నదానం చేస్తా తమ దగ్గరున్నదంతా వాళ్ళకి పంచి పెడ్తా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటా మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.
*************

కామెంట్‌లు