మా 'లా'ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా ఆలస్యంగా జరిగాయి రిజల్ట్స్ రావడానికి సమయం పడుతుంది. అందుకని నేను నా మిత్రుడు రవీందర్, శ్రీధర్ జర్నలిజం లో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాం
నాకు జర్నలిజం పై కొంత ఆసక్తి ఉండేది నా లా రెండవ సంవత్సరం అయిపోయిన తర్వాత జర్నలిజం(B.C.J.)ప్రవేశ పరీక్ష రాశాను. సీటు వచ్చింది.నేను జర్నలిజం చదవడం వల్ల నేను న్యాయవాది కావడానికి మరో సంవత్సరం ఆగాల్సివుంటుంది. నేనూ నష్టపోతాను ,నావల్ల వల్ల ఆ సీట్ రావలసిన వ్యక్తి కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఆ వ్యక్తి వచ్చి మీరు నిజంగానే జర్నలిజం కోర్స్ చేస్తారా సార్ అని అడిగాడు. నేనప్పుడు సీటు వదులుకున్నాను ఆ కుర్రవాడికి జర్నలిజం లో సీటు వచ్చింది అతని పేరు నాకు గుర్తులేదు ఇది 1980 లో జరిగిన సంఘటన.
‘లా’పరీక్షలు అయిపోయిన తర్వాత యూనివర్సిటీ లో ఉండొచ్చని జర్నలిజం ఎంట్రెన్స్ పరీక్ష నేను రవీందర్ శ్రీధర్ రాసాము. మాతోపాటు లా చదువుకున్న మరో మిత్రుడు ప్రభాకర్ రావు కూడా జర్నలిజం పరీక్ష రాశాడు మా అందరికీ జర్నలిజంలో సీట్లు వచ్చాయి.జాయిన్ అయ్యాము.
జర్నలిజం చదువుతున్న క్రమంలో రెండు ప్రధానమైన నగరాలకి టూర్లు ఉంటాయి ఒకటి డిల్లీకి,రెండవది బొంబాయికి.
ప్రముఖమైన రాజకీయ నాయకులను,ప్రధానమంత్రిని,రాష్ట్ర రాష్ట్రపతిని,అదేవిధంగా పార్లమెంట్ ని మీడీయా అఫీసులని ముఖ్యమైన ప్రదేశాలని చూడటానికి అవకాశం ఉంటుంది. PTI,UNI లతో పాటు ప్రధాన పత్రికా సంపాదకులని కూడా కలిసే అవకాశం ఉంది.
మా జర్నలిజం బ్యాచ్, మా ప్రొఫెసర్లతో పాటు ఢిల్లీ కి వెళ్ళాం.రాష్ట్రపతిని , ప్రధానమంత్రి ని, కుష్వంత్ సింగ్ ఇంకా చాలామందిని జర్నలిస్టులని కలిసాం. అప్పుడు
తీసుకున్న ఫొటోలని ఈ మధ్య మా మిత్రుడు రవీందర్ షేర్ చేశాడు.
ఒక ఫోటో రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తీసింది. అది రాష్ట్రపతి భవన్లో. మరొకటి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ తో దిగిన గ్రూప్ ఫోటో.అదీ ఆమె అధికార భవనం లో.
నేను చూసిన వ్యక్తులలో బాగా ఆకర్షించినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరా గాంధీ. ఆమె ముఖంలో ఉన్న తేజస్సు నాకు అప్పటివరకు ఎవరి ముఖంలోనూ కూడా కనిపించలేదు గొప్ప తేజస్సు ఆమెలో ఉంది.
ఎమర్జెన్సీ ప్రభావం వల్ల ఆమె అంటే ఒక రకమైనటువంటి అయిష్టత ఉన్నప్పటికీ ఆమెను చూసినప్పుడు ఒక గొప్ప ఆకర్షణ ఏర్పడింది.మా అందరితో కలుపుగోలుగా మాట్లాడినారు.
అదేవిధంగా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మా అందరితో సరదాగా మాట్లాడినారు.పి యల్ విశ్వేశ్వరరావు తో పాటు మరో ప్రొఫెసర్ కూడా ఢిల్లీ కి వచ్చారు.ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తుకు రావడం లేదు.
ఈ ఫోటోలో ఉన్న మిగతా మిత్రులు చాలామంది గుర్తున్నారు. కానీ వారి పేర్లు మర్చిపోయాను.
శ్రీధర్ న్యాయవాదిగా నేను న్యాయమూర్తి గా స్థిరపడ్డాము. హిమాయత్ నగర్ లో ఉన్నప్పుడు తరచూ కలిసేవాడు.రవీందర్ అమెరికాకి వెళ్ళిపోయాడు.
ప్రభాకర్ కూడా న్యాయమూర్తిగా పని చేశాడు.గుండెపోటుతో చనిపోయాడు.శ్రీధర్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.
ఫోటోలో ఉన్న మిత్రులు, నాకు గుర్తు ఉన్న వాళ్ళు సోమశేఖర్ ,గౌరీశంకర్ ,రామకృష్ణారెడ్డి, విజూ కాకతీయ.
సోమశేఖర్ ఇప్పుడు స్వతంత్ర జర్నలిస్ట్. గతంలో అతను బిజినెస్ లైన్ హిందూ గ్రూపులలో అదేవిధంగా PTI లాంటి ప్రధానమైన సంస్థలలో జర్నలిస్ట్ గా పనిచేసాడు. గౌరీశంకర్ డెక్కన్ క్రానికల్ లో పని చేసేవాడు అప్పుడప్పుడు ఆంధ్రభూమికి వెళ్ళినప్పుడు కలిసేవాడు. విజూ కాకతీయ యాడ్ ఎజన్సీని హిమయత్ నగర్ లో నిర్వహించేవాడు. ఆ తరువాత అమెరికాకి వెళ్ళిపోయాడని విన్నాను.
ఇప్పుడు రామక్రిష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.
ఇది 1981 మాట.
మిగతా మిత్రులు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు.
మేము సరదాగా జర్నలిజం చదివాము. అయినా ఆ వాతావరణాన్ని, ఆ ప్రొఫెసర్లని మాతో పాటు చదువుకున్న మిత్రులని మర్చిపోలేము.
ప్రొఫెసర్ బషీరుద్దీన్ తో చాలా సార్లు సరదాగా గొడవపడ్డా ఆయన చాలా ప్రేమపూర్వకంగా ఉండేవాడు. రషీద్ స్నేహంగా,పి ఎల్ వి కలుపుగోలుగా వుండేవాళ్ళు. పి ఎల్ వి ఇప్పుడు అక్కడక్కడా కనిపిస్తారు. స్నేహంగా పలకరిస్తారు.
మా లక్ష్యం వేరు.నేను న్యాయవాది గానో ,న్యాయమూర్తి గానో సెటిల్ కావాలి. మా మిత్రుడు రవీందర్ అమెరికా వెళ్ళాలని అనుకున్నాడు అదేవిధంగా వాడు వెళ్లిపోయాడు. ఈ
మధ్య వచ్చినప్పుడు ఈ రెండు ఫోటోలు నాకు షేర్ చేశాడు. గతంలోకి లోకి నన్ను ప్రయాణం చేయించాడు.
నేను రాసిన ఒక కవితలో ఇలా అంటాను
'స్వర్గాలు లేవు
మనం కోల్పోయినవే స్వర్గాలు'
ఇది కూడా అలాంటిదే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి